బీఆర్ఎస్ మెడకు ధరణి ఉచ్చు!?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమని, అవినీతి రహిత పాలనకు చిహ్నమని ప్రచారం చేసుకున్న ‘ధరణి’ పోర్టల్ ఇప్పుడు నాటి పాలకుల మెడకు ఉచ్చులా బిగుస్తోంది. డిజిటల్ సంస్కరణ ముసుగులో హైదరాబాద్ శివార్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగిన వేల కోట్ల రూపాయల భూ అక్రమాలపై సీఐడీ పంజా విసరడంతో గులాబీ శిబిరంలో గుబులు మొదలైంది. ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేపట్టిన ఆకస్మిక సోదాలు, అరెస్టులతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది.
సీఐడీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో వెలుగుచూసిన సాంకేతిక ఆధారాలు దర్యాప్తు అధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల చట్టంలోని అత్యంత కీలకమైన సెక్షన్ 22ఏ లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ మిగులు, వక్ఫ్, దేవాదాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు తేలింది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హాట్స్పాట్లుగా మారిన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వేల కోట్ల విలువైన భూముల రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా మార్చేశారు. పోర్టల్ మేనేజ్మెంట్ సిబ్బంది, కొందరు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, అర్ధరాత్రి వేళల్లో నిషేధిత జాబితా నుంచి వేలాది ఎకరాలను తొలగించి రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, కొందరు బినామీల పేరిట పట్టా చేసినట్లు ఆధారాలు లభించాయి.
సాధారణ రెవెన్యూ కేసుల్లో మాదిరిగా ఫైళ్లను మాయం చేయడం లేదా అధికారులపై నెపం నెట్టడం ఇక్కడ సాధ్యం కాకపోవడమే నాటి అగ్రనేతలను కలవరపెడుతోంది. డిజిటల్ వ్యవస్థలో జరిగిన ప్రతి మార్పునకు సంబంధించి లాగ్ ఫైల్స్, ఐపీ అడ్రస్లు, యూజర్ క్రెడెన్షియల్స్, టైమ్స్టాంప్లు వంటి సాంకేతిక ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. ఎవరి ఆదేశాలతో, ఏ సిస్టమ్ నుంచి, ఏ సమయంలో నిషేధిత జాబితాలోని భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారనే ఆడిట్ ట్రయల్ పూర్తిగా రికార్డయి ఉంది. పోర్టల్ డెవలపర్లు, రెవెన్యూ ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్లను విచారించడం ద్వారా ఈ అక్రమాల అసలు సూత్రధారులు ఎవరనే దానిపై సీఐడీ పక్కా సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. ధరణి అనేది గతంలో కేసీఆర్ స్వయంగా రూపకల్పన చేసి పర్యవేక్షించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో, నాటి సీఎంవో, మంత్రివర్గంలోని కీలక నేతలు, కీలక ఐఏఎస్ అధికారుల చుట్టూనే ఇప్పుడు దర్యాప్తు తిరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం కేవలం రెవెన్యూ వివాదంగా మిగలకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ రాజకీయ యుద్ధంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ సర్కార్ ఈ కక్షసాధింపు రాజకీయాలకు తెరలేపిందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. అయితే, గత ప్రభుత్వంలో భూములు కోల్పోయిన పేదలు, బాధితులైన వేలాది మంది రైతులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని, ప్రజా సంపదను కొల్లగొట్టిన పెద్ద తలకాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.
సీఐడీ దర్యాప్తు ప్రస్తుతం కింది స్థాయి సిబ్బంది దాటి పొలిటికల్ మాస్టర్మైండ్స్, రియల్ ఎస్టేట్ నెట్వర్క్ల వైపు విస్తరిస్తోంది. అక్రమ బదిలీల వెనుక జరిగిన భారీ నగదు లావాదేవీలు, షెల్ కంపెనీల పెట్టుబడులను బయటకు తీసేందుకు ఆర్థిక దర్యాప్తు సంస్థల సహకారం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే నాటి ప్రభుత్వంలోని కీలక రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేయడం, అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రికార్డులను పక్కాగా సీఐడీ నిరూపిస్తే, ఇది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించడంతో పాటు, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయం.







