బీఆర్ఎస్లో వికేంద్రీకరణ.. క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం!
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు బీఆర్ఎస్ తన రాజకీయ కార్యాచరణలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ నిర్ణయాలపై గళమెత్తాలన్నా, విధానపరమైన లోపాలను ఎండగట్టాలన్నా ప్రధానంగా కేటీఆర్, హరీశ్‌రావు వంటి అగ్రనేతలే ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ముందుంటున్నారు. అయితే అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలంటే కేవలం ఇద్దరు ముగ్గురు నేతల ప్రెస్మీట్లు మాత్రమే సరిపోవని అధిష్ఠానం గ్రహించింది. ఈ నేపథ్యంలో, గళాన్ని వికేంద్రీకరించి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తెరపైకి తెచ్చే సరికొత్త రోడ్‌మ్యాప్‌ను పార్టీ సిద్ధం చేస్తోంది.
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు ఇకపై కేవలం నియోజకవర్గాలకే పరిమితం కాకుండా నిర్దిష్ట విధానపరమైన అంశాలపై నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతలను భుజానికి ఎత్తుకోనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తమపై చేస్తున్న విమర్శలకు రాష్ట్ర స్థాయి నుంచి సమాధానం వచ్చేంతవరకు వేచి చూడకుండా, స్థానికంగానే ఆధారాలతో తిప్పికొట్టేలా నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రాజెక్టులు, రుణమాఫీ, మహిళలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి అంశాలపై నియోజకవర్గాల వారీగా డాక్యుమెంటేషన్ సిద్ధం చేసి, స్థానిక ప్రజాప్రతినిధుల వైఫల్యాలను నిలదీయడమే ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశం. ఆరోపణలు కేవలం వ్యక్తిగత దూషణల స్థాయికి పరిమితం కాకుండా, గణాంకాలు, వాస్తవాలతో కూడిన డేటా ఆధారిత రాజకీయ దాడి చేయాలని అధిష్ఠానం స్పష్టం చేస్తోంది.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులు, ప్రభుత్వ లాంఛనాల ద్వారా ప్రజల్లో ఉన్న నేతలకు.. ప్రతిపక్షంలో మనుగడ సాగించడం పూర్తిగా భిన్నమైన అనుభవం. అధికారం పోయాక ప్రజల్లో కనిపించకుండా పోయారనే ముద్ర పడకుండా, నిత్యం ప్రజల సమస్యల మధ్యే ఉండేలా క్షేత్రస్థాయి కార్యాచరణను రూపొందిస్తున్నారు. గ్రామాలు, మండలాల్లో పర్యటించడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, స్థానిక ఆసుపత్రులు, విద్యాసంస్థల సమస్యలపై తక్షణమే అధికారులను ప్రశ్నించడం, స్పందన లేకుంటే రోడ్లపైకి వచ్చి పోరాటం చేయడం వంటి పనులను స్థానిక నాయకులకు తప్పనిసరి చేయనున్నారు.
ఈ వ్యూహం వెనుక బలమైన రాజకీయ ప్రయోజనం కూడా దాగి ఉంది. ఇటీవలి కాలంలో కొందరు కీలక నేతలు పార్టీని వీడటంతో, పార్టీ ఉనికి కేవలం కొద్దిమంది నేతల చుట్టూనే తిరుగుతుందనే భావన కేడర్‌లో వ్యక్తమైంది. ఆ నైరాశ్యాన్ని తుడిచిపెట్టాలంటే ప్రతి నియోజకవర్గంలోనూ స్వతంత్రంగా ప్రజలను ప్రభావితం చేయగల సమర్థులైన నాయకులను ప్రోత్సహించడం అత్యవసరం. కొత్త తరం నాయకులకు లేదా స్థానిక మాజీ ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా వారు పార్టీకి పూర్తిస్థాయిలో కమిట్ అవుతారు. రేపు ఎప్పుడైనా ఎవరో ఒక నాయకుడు పార్టీ మారినా.. పార్టీ కేడర్ చెదిరిపోకుండా నిలబెట్టే ప్రత్యామ్నాయ నాయకత్వం సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి విధానాలపై కేటీఆర్, హరీశ్‌రావు దృష్టిసారిస్తే.. స్థానిక రాజకీయాలను స్థానిక నేతలే నడిపించే ఒక క్రమశిక్షణతో కూడిన రాజకీయ విభజన సాధ్యమవుతుంది.
పార్టీ కేడర్‌లో స్తబ్ధతను పోగొట్టి, తిరిగి పోరాట పంథాను రగిలించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ అడుగులు వేస్తోంది. ప్రెస్‌మీట్ ల నుంచి ప్రజల ముంగిట్లోకి పార్టీని తీసుకెళ్లడంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎంతమేరకు సఫలమవుతుందనే అంశమే భవిష్యత్తులో గులాబీ పార్టీ పూర్వవైభవానికి గీటురాయి కానుంది.







