జర్నలిస్టులను టార్గెట్ చేసిన ట్రంప్ టీమ్.. వ్యతిరేకంగా వార్త రాస్తే జైలుకేనా?
ఒక ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల వెనుక అసలు కథేంటి? ప్రజలకు తెలియని విషయాలు బయటకు ఎలా వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ జర్నలిస్టులు కథనాలు రాస్తుంటారు. అందుకోసం ప్రభుత్వంలో పనిచేసే కొందరు వ్యక్తులు ఇచ్చే రహస్య సమాచారాన్ని కూడా ఉపయోగించుకుంటారు. అయితే అలాంటి సమాచారాన్ని బయటపెట్టే జర్నలిస్టులనే టార్గెట్ చేస్తే? తమకు సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు చెప్పకపోతే అరెస్ట్ చేస్తామంటే? ఇప్పుడు అమెరికాలో ఇలాంటి చర్చే మొదలైంది. ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్న స్టీఫెన్ మిల్లర్ ఈ దిశగా ఓ సంచలన ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
వార్త రాస్తే సరే.. సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిందేనా?
అమెరికా ప్రభుత్వంలో జరిగే వ్యవహారాలపై రహస్య సమాచారంతో కథనాలు రాసే జర్నలిస్టులపై జాతీయ భద్రత పేరుతో క్రిమినల్ విచారణలు ప్రారంభించాలని స్టీఫెన్ మిల్లర్ భావిస్తున్నారట. అంటే ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులు తమకు అందించిన సమాచారంతో జర్నలిస్టులు వార్తలు రాస్తే, ఆ సమాచారాన్ని ఎవరు ఇచ్చారో తెలుసుకోవడానికి న్యాయశాఖ రంగంలోకి దిగాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.
అంతేకాదు, తమకు సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు చెప్పేందుకు జర్నలిస్టులు నిరాకరిస్తే వారిని అరెస్ట్ చేసే అవకాశాన్ని కూడా వైట్‌హౌస్, న్యాయశాఖ పరిశీలించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు ది అట్లాంటిక్ కు వెల్లడించారు.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరుగుతున్నా, ప్రజలకు తెలియకూడదని కొందరు ప్రయత్నిస్తున్నా.. ఆ విషయాన్ని బయటపెట్టేందుకు ముందుకొచ్చే ఉద్యోగులకు జర్నలిస్టులే ఒక ఆధారం. కానీ సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు బయటపెట్టాల్సి వస్తుందనే భయం ఉంటే, రేపు ప్రభుత్వంలో పనిచేసే వాళ్లు ఎవరైనా మీడియాతో మాట్లాడటానికి ముందుకొస్తారా? ఇదే ఇప్పుడు అమెరికా మీడియా వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్న అంశం.
సుసీ వైల్స్ ఉన్నప్పుడు బ్రేకులు.. ఇప్పుడు మిల్లర్ చేతిలో యాక్సిలరేటర్!
ట్రంప్ ప్రభుత్వంలో ఇంతకుముందు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన సుసీ వైల్స్ కొన్ని వివాదాస్పద నిర్ణయాల విషయంలో ట్రంప్‌కు అడ్డుకట్ట వేసేవారని చెబుతుంటారు. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకునే ఈ ప్రతిపాదన విషయంలోనూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. సుసీ వైల్స్ స్థానంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్న స్టీఫెన్ మిల్లర్ మాత్రం ఇలాంటి చర్యలకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ట్రంప్‌కు ఇప్పుడు తన నిర్ణయాలను అడ్డుకునే వ్యక్తులు అవసరం లేదని, తాను చెప్పిన పనులను వెంటనే అమలు చేసే వాళ్లు కావాలని ఆయన భావిస్తున్నట్లు వైట్‌హౌస్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించారు. అందుకే మిల్లర్‌కు మరింత ప్రాధాన్యం లభిస్తున్నట్లు సమాచారం.
వైట్‌హౌస్ ఒక మాట.. న్యాయశాఖ మరో మాట!
ఈ వ్యవహారంపై వైట్‌హౌస్ స్పందన కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్య సమాచారాన్ని బయటపెట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వైట్‌హౌస్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇలాంటి లీకులు అమెరికన్ల ప్రాణాలకు ప్రమాదం కలిగించడంతో పాటు దేశ భద్రతకు ముప్పు తెస్తాయని, బాధ్యులైన వారిని కచ్చితంగా జవాబుదారీగా నిలబెడతామని చెప్పారు.
ఇదంతా ఇప్పుడే మొదలైందా? జర్నలిస్టులపై గతంలోనూ చర్యలు!
నిజానికి ట్రంప్ ప్రభుత్వం జర్నలిస్టుల సమాచార వనరులను గుర్తించేందుకు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గత జనవరిలో FBI, వాషింగ్టన్ పోస్ట్ కు చెందిన ఓ జర్నలిస్టు ఇంటిపై దాడి చేసింది. ట్రంప్ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై ఆమె పరిశోధనాత్మక కథనాలు రాస్తుండటంతో ఆమె ఇంట్లోని పలు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ పరికరాల్లో ఉన్న డేటాను పరిశీలించడానికి ప్రభుత్వానికి అనుమతి లేదని న్యాయమూర్తి చివరకు స్పష్టం చేశారు.
ఆ తర్వాత జూన్‌లో మరో ప్రయత్నం జరిగింది. వాషింగ్టన్ పోస్ట్ కు చెందిన ముగ్గురు, వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెందిన ఒక జర్నలిస్టును గ్రాండ్ జ్యూరీ ముందు హాజరై తమకు సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు వెల్లడించాలని న్యాయశాఖ కోరింది. అలా చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుని జైలుకు పంపే పరిస్థితి కూడా ఉండేది. అయితే ఆయా మీడియా సంస్థలు ఈ చర్యలను గట్టిగా వ్యతిరేకించడంతో ఆ సబ్పీనాలను నిలిపివేశారు.
ట్రంప్ విమానంపై వార్త రాస్తే.. జర్నలిస్టుల ఫోన్ రికార్డులపైనా నజర్!
జూలైలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఖతార్ నుంచి ట్రంప్‌కు బహుమతిగా వచ్చిన విలాసవంతమైన విమానంపై న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురించింది. అధ్యక్షుడు ఉపయోగించబోతున్న ఆ విమానం భద్రతకు సంబంధించిన అంశాలపై సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు తెలుసుకోవాలని న్యాయశాఖ భావించింది. ఇందులో భాగంగా ఆ కథనాలు రాసిన ముగ్గురు జర్నలిస్టులకు సబ్పీనాలు జారీ చేసింది. అంతటితో ఆగకుండా జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్ రికార్డులను కూడా కోరింది.
అయితే ఈ వ్యవహారంలో న్యాయపరమైన లోపాలున్నాయని ఫెడరల్ న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో న్యాయశాఖ చివరకు ఆ సబ్పీనాలను వెనక్కి తీసుకుంది.
ఏదైమైనా..!
ఒక జర్నలిస్టు తనకు సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరును బయటపెట్టాల్సి వస్తుందనే భయంతో కథనాన్ని ఆపేస్తే, ప్రజలకు తెలియాల్సిన ఎన్నో విషయాలు తెర వెనుకే ఉండిపోవచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా బలహీనపడితే, ప్రజలకు చేరే సమాచారం కూడా పరిమితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు అమెరికాలో చర్చ కేవలం స్టీఫెన్ మిల్లర్ ప్రతిపాదన గురించే కాదు.. జాతీయ భద్రతకు, ప్రభుత్వ జవాబుదారీతనానికి, మీడియా స్వేచ్ఛకు మధ్య ఉండాల్సిన హద్దులు ఎక్కడ అన్నది కూడా.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







