‘హిందువులారా.. అమెరికా వదిలి వెళ్లండి!’ దీపావళి వేడుకల్లో ట్రంప్ మద్దతుదారుల రచ్చ!
అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న ఓటమి తర్వాత భారతీయులపై విద్వేషపూరిత దాడులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలోని సియాటెల్‌లో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లోకి ట్రంప్ మద్దతుదారులు కొందరు ప్రవేశించి, భారతీయులు, హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘భారతీయులందరినీ దేశం నుంచి బహిష్కరించాలి’, ‘హిందువులు క్రైస్తవులను భర్తీ చేస్తున్నారు’ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఈ నిరసనకారులు దీపావళి వేడుకలనే తమ ఆందోళనకు వేదికగా చేసుకోవడం అక్కడి భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది. ఆ సమయంలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. అలాంటి సమయంలో నిరసనకారులు నినాదాలు చేయడంతో వేడుకలకు హాజరైన భారతీయులు వారిని తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు వారిని అక్కడి నుంచి బయటకు పంపించారు.
ఈ ఘటనపై భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ తీవ్రంగా స్పందించారు. దీపావళి హిందూ సమాజానికి ఎంతో ముఖ్యమైన పండుగని, ఎలాంటి భయం లేకుండా తమ పండుగను జరుపుకునే హక్కు వారికి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి విద్వేషపూరిత చర్యలకు నగరంలోనే కాదు, దేశంలోనూ చోటు లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Hindus Helped Democrats Win? భారతీయులపై ట్రంప్ మద్దతుదారుడి ఆరోపణలు!
భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిలో జాక్ లాంగ్ అనే వ్యక్తిని ట్రంప్ మద్దతుదారుడిగా గుర్తించారు. దీపావళి వేడుకల నుంచి బయటకు పంపించిన తర్వాత కూడా అతడు హిందువులపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. టెక్సాస్‌లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించడానికి హిందువులే సహకరించారని వ్యాఖ్యానించాడు.
ఈ ఘటన అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన జాక్ లాంగ్.. దీపావళి వేడుకల్లో యాంటీఫా కార్యకర్తలు, హిందూ సమాజానికి చెందిన డజన్ల కొద్దీ మంది తమపై దాడి చేశారని ఆరోపించాడు. తమను కొట్టడంతో పాటు తమ జెండాను ధ్వంసం చేశారని పేర్కొన్నాడు.
అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్ ప్రాంతాల్లో క్రైస్తవులపై హిందువుల ప్రభావం పెరుగుతోందని ఆరోపిస్తూ తాము నిరసన చేపట్టినట్లు బయట మీడియాతో చెప్పాడు.
అప్రమత్తంగా ఉండాలంటూ హిందూ సంస్థ హెచ్చరిక!
సియాటెల్ ఘటనపై ఉత్తర అమెరికా హిందువుల కూటమి (Coalition of Hindus of North America – CoHNA) ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో జాక్ లాంగ్, థామస్ అలెన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారని వెల్లడించింది.
వారు భారతీయులు, హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించినట్లు తెలిపింది. సియాటెల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే హిందువులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇతర దీపావళి వేడుకలకు కూడా వెళ్లి నిరసనలు చేపడతామని వారు ప్రకటించినట్లు వెల్లడించింది.
దీంతో అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో నిర్వహించబోయే దీపావళి వేడుకల భద్రతపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జాక్ లాంగ్ ఎవరు?
భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన జాక్ లాంగ్ అమెరికాకు చెందిన మితవాద కార్యకర్త. అతడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుదారుడు. ‘వైట్ రీప్లేస్మెంట్’ పేరుతో ఒక సంస్థను నిర్వహిస్తున్నాడు.
2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన ఘటనలో జాక్ లాంగ్ కూడా పాల్గొన్నాడు. ఈ కేసులో పోలీసులపై దాడి సహా పలు అభియోగాలు ఎదుర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించి సుమారు నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. అయితే 2025 జనవరిలో ట్రంప్ మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జాక్ లాంగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా వలసదారులు, ముస్లింలు, ఇతర వర్గాలకు వ్యతిరేకంగా నిర్వహించిన పలు నిరసన కార్యక్రమాల్లో అతడు పాల్గొన్నాడు. 2026లో ఫ్లోరిడా నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా సెనేట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ప్రయత్నించాడు.
అమెరికాలో ఎన్నికల రాజకీయాల ప్రభావం ఇప్పుడు అక్కడ నివసిస్తున్న భారతీయులపైనా పడుతోందన్న ఆందోళన ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చింది. పిల్లలు దీపావళి వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్న వేదికపైకి వచ్చి ఇలాంటి నినాదాలు చేయడం భారతీయ అమెరికన్లలో ఆగ్రహానికి కారణమైంది.
—-సూర్య ప్రకాష్ జోశ్యుల







