ఆడబిడ్డల చుట్టూ రేవంత్ అధికార చక్రం!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు మహిళలే ప్రధాన కేంద్ర బిందువుగా మారారు. ప్రజాపాలన నినాదంతో అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన పరిపాలనా విధానాల్లోనూ, రాజకీయ వ్యూహాల్లోనూ మహిళా ఓటు బ్యాంకును అత్యంత పటిష్టమైన కోటగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన పుట్టినరోజు వేడుకలను సైతం స్వయం సహాయక సంఘాల మహిళల నడుమ జరుపుకోవడం, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే నా సంకల్పం అని ప్రకటించడం కేవలం ఒక భావోద్వేగ ప్రకటన మాత్రమే కాదు.. అది కాంగ్రెస్ ప్రభుత్వ దీర్ఘకాలిక రాజకీయ ఎజెండాకు స్పష్టమైన నిదర్శనం.
గతంలో సంక్షేమ పథకాలు కుటుంబ యూనిట్‌గా సాగితే, రేవంత్ సర్కార్ పథకాల రూపురేఖలను మహిళా కేంద్రీకృతంగా మార్చింది. ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన ‘మహాలక్ష్మి’ పథకమే దీనికి అతిపెద్ద ఉదాహరణ. మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు రవాణా స్వేచ్ఛను కల్పించిన ఈ పథకానికి ఏటా వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రీయింబర్స్మెంట్ రూపంలో భరిస్తోంది. విమర్శలు, ఆటో కార్మికుల ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆపే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పడం మహిళా వర్గానికి ఇచ్చిన రేవంత్ భరోసా కల్పించారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం నేరుగా మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించేలా రూపకల్పన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మహిళల పేరిటే మంజూరు చేయడం ద్వారా కుటుంబంలో స్త్రీ పాత్రను నిర్ణయాత్మక స్థాయికి తీసుకెళ్లాలనే వ్యూహం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
కేవలం దానధర్మాల తరహా సంక్షేమానికే పరిమితం కాకుండా, పొదుపు సంఘాల నెట్‌వర్క్‌ను ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. స్వయం సహాయక సంఘాలకు రూ. 79,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించడం, వాటిపై దాదాపు రూ. 1,900 కోట్ల వడ్డీని ప్రభుత్వమే భరించడం ద్వారా గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థల్లో మహిళా సాధికారతను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలను కేవలం చిన్నపాటి కుటీర పరిశ్రమలకే పరిమితం చేయకుండా పెట్రోల్ బంకుల నిర్వహణ, సోలార్ పవర్ ప్రాజెక్టులు, పాఠశాల యూనిఫామ్‌ల తయారీ వంటి పెద్ద కాంట్రాక్టులను అప్పగిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేయబోతున్న నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ, కొత్తగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లలో 3.5 లక్షలు ఒంటరి మహిళలు, వితంతువులకే దక్కడం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోంది.
ఈ మహిళా అనుకూల విధానాల వెనుక బలమైన రాజకీయ విశ్లేషణ కూడా ఉంది. గత బీఆర్ఎస్ పాలనలో తొలి విడత కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధానంగా ఎండగడుతోంది. ప్రస్తుతం కేబినెట్లో మహిళలకు దక్కిన స్థానాలు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతను ఎత్తిచూపుతూ విపక్షాలపై పైచేయి సాధించే వ్యూహం అమలువుతోంది. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటూ మహిళల ఆత్మగౌరవాన్ని తెరపైకి తేవడం ద్వారా భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకుంటున్నారు.
అయితే ఈ ప్రయాణం అంత సులువేమీ కాదు. మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఆర్టీసీపై పడుతున్న భారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభావితమైన ప్రైవేట్ రవాణా రంగ కార్మికుల అసంతృప్తిని చల్లార్చడం ప్రభుత్వానికి పరీక్షగా నిలుస్తున్నాయి. అలాగే, హామీ ఇచ్చిన పథకాలన్నీ నిరంతరాయంగా అందరికీ చేరకపోతే వచ్చే అసంతృప్తిని నియంత్రించడం కూడా కీలకమే. మొత్తంగా చూస్తే, సంక్షేమం, భావోద్వేగం, ఆర్థిక సాధికారతలను మేళవించి తెలంగాణ మహిళా లోకాన్ని కాంగ్రెస్ వైపు శాశ్వతంగా తిప్పుకోవాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహం. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది అనే సాధారణ సామాజిక సూత్రాన్ని, ఎన్నికల రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ కవచంగా మలచుకోవడంలో రేవంత్ రెడ్డి ఎంతవరకు సఫలమవుతారో రాబోయే ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.







