మేయర్‌గా నిత్యా రామన్ ముందున్నది ముళ్ల బాటేనా? ఇన్ని సమస్యలా?
ఒక ఎన్నికలో గెలవడానికి రాజకీయ ప్రత్యర్థులను ఓడిస్తే సరిపోవచ్చు. కానీ ఒక నగరాన్ని పాలించాలంటే ప్రత్యర్థులే కాదు.. అక్కడి సమస్యలను కూడా ఎదుర్కోవాలి. ఇప్పుడు నిత్యా రామన్ ముందున్నది ఇదే పరిస్థితి. భారత్‌లో పుట్టి లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికైన ఆమెకు స్వాగతం పలికేది అధికార పీఠం ఒక్కటే కాదు.అనేక సమస్యలు కూడాను. వీటికి తోడు ఆమెకు మద్దతు ఇవ్వని రాజకీయ వ్యవస్థ కూడా ఉంది. అంటే నిత్యా రామన్ ఒకేసారి రెండు పోరాటాలు చేయాలి. ఒకటి నగర సమస్యలతో.. మరొకటి వాటిని పరిష్కరించడానికి అవసరమైన రాజకీయ వ్యవస్థతో. మరి ఈ రెండు పోరాటాల్లో ఆమెకు ఎదురయ్యే అసలైన అడ్డంకులేంటి? మేయర్‌గా ఆమె ఎదుర్కోవాల్సిన అసలైన సవాళ్లేంటి?
మొదటి అడ్డంకి.. ఆమె గెలిచిన వ్యవస్థే ఆమెకు సహకరిస్తుందా?
నిత్యా రామన్ ఎన్నికల విజయం వెనుక రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామాలున్నాయి. లాస్ ఏంజెలెస్ సిటీ కౌన్సిల్లో ఆమెతో కలిసి పనిచేసిన 14 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా మేయర్ ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇవ్వలేదు. పోలీసు యూనియన్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. మరోవైపు డెమోక్రటిక్ పార్టీకి చెందిన కీలక నాయకులంతా ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌కు మద్దతుగా నిలిచారు.
అయినా ఆమె విజయం సాధించారు. ఇప్పుడు అదే రాజకీయ వ్యవస్థతో కలిసి పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే లాస్ ఏంజెలెస్‌లో మేయర్‌కు అపరిమిత అధికారాలు ఉండవు. నగర పాలనలో సిటీ కౌన్సిల్‌కు కూడా కీలకమైన పాత్ర ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి ప్రాజెక్టులు, విధానాల అమలు వంటి అంశాల్లో కౌన్సిల్ సహకారం అవసరం.
మాజీ సిటీ కౌన్సిల్ సభ్యుడు మైక్ బోనిన్ లాస్ ఏంజెలెస్ మేయర్ అధికారాలను అకార్డియన్‌తో పోల్చారు. అంటే సిటీ కౌన్సిల్ సహకారాన్ని బట్టి మేయర్ అధికారాల పరిధి విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది. నిత్యా రామన్‌కు రాజకీయంగా మద్దతు ఇవ్వని సభ్యులను కూడా తన నిర్ణయాలకు ఒప్పించాల్సి ఉంటుంది.
ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించడం ఒక ఎత్తు. వారితో కలిసి నగరాన్ని నడిపించడం మరో ఎత్తు. ఆమె ముందున్న మొదటి పరీక్ష ఇదే.
వేలాది మంది రోడ్లపైనే.. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ?
లాస్ ఏంజెలెస్‌లో నిరాశ్రయుల సమస్య కేవలం గణాంకం కాదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని జీవిస్తున్న ప్రజలు కనిపిస్తారు. ప్రపంచంలోని సంపన్న నగరాల్లో ఒకటిగా పేరున్న ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం అక్కడి పాలనా వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది.
ఈ సమస్యపై నిత్యా రామన్‌కు గత అనుభవం ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె నిరాశ్రయులకు సహాయం అందించే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అర్బన్ ప్లానర్‌గా కూడా పనిచేశారు.
అయితే ఇప్పుడు ఆమె ముందున్నది ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహించడం కాదు. నగరవ్యాప్తంగా నిరాశ్రయుల సమస్యకు పరిష్కారం చూపించడం. టెంట్లను తొలగించడం మాత్రమే సరిపోదు. వారికి శాశ్వత నివాసాలు కల్పించాలి. అవసరమైన సహాయక సేవలు అందించాలి. మళ్లీ వీధుల్లోకి రాకుండా చూసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.ఇందుకు భారీగా నిధులు, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం.
హౌసింగ్ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?
లాస్ ఏంజెలెస్‌లో ఇళ్ల ధరలు, అద్దెలు సామాన్యులకు అందనంతగా పెరిగాయి. మంచి ఉద్యోగం ఉన్నవారు కూడా నగరంలో నివాసం ఏర్పరుచుకోవడం కష్టంగా భావిస్తున్నారు. ఆదాయంలో ఎక్కువ భాగం ఇంటి అద్దెకే ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
నిత్యా రామన్ తన ప్రధాన ప్రాధాన్యతల్లో హౌసింగ్ అఫోర్డబిలిటీని చేర్చారు. తక్కువ, మధ్యతరగతి ఆదాయం ఉన్నవారికి అందుబాటులో ఉండే ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు, పట్టణ ప్రణాళికలో మార్పులు, ప్రభుత్వ సహకారంతో ఇళ్ల నిర్మాణం వంటి చర్యలు అవసరం.
కానీ కొత్త ఇళ్ల నిర్మాణం అంత తేలికైన పని కాదు. భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పెట్టుబడులు, స్థానిక రాజకీయ నిర్ణయాలు.. ఇలా అనేక అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఇళ్ల కొరతను తగ్గించడంతోపాటు ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచడం ఆమెకు మరో పెద్ద పరీక్ష.
పోలీసు వ్యవస్థతో విభేదాలు.. ప్రజలకు భద్రత ఎలా కల్పిస్తారు?
నిరాశ్రయుల సమస్య, ఇళ్ల ధరలతోపాటు ప్రజల భద్రత కూడా నిత్యా రామన్ ముందున్న ముఖ్యమైన అంశం. నేరాల నియంత్రణ, పోలీసు వ్యవస్థ పనితీరు, బహిరంగ ప్రదేశాల్లో భద్రత వంటి అంశాలపై ప్రజల్లో నమ్మకం కల్పించాలి.
అయితే ఎన్నికల సమయంలో పోలీసు యూనియన్ ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. ఇప్పుడు అదే పోలీసు వ్యవస్థతో సమన్వయం చేసుకుంటూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
పోలీసు విభాగానికి నిధుల కేటాయింపు, నేరాల నియంత్రణకు అనుసరించే విధానాలు, ప్రజల భద్రతకు సంబంధించిన నిర్ణయాలు ఆమె పాలనలో కీలకం కానున్నాయి. ఒకవైపు పోలీసు వ్యవస్థ సహకారం అవసరం. మరోవైపు ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ఆమెకు సవాలుగా మారనుంది.
హాలీవుడ్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయ్.. నగర ఆర్థిక వ్యవస్థను కాపాడగలరా?
లాస్ ఏంజెలెస్ అంటే ప్రపంచానికి ముందుగా గుర్తొచ్చేది హాలీవుడ్. సినిమా నిర్మాణం, టెలివిజన్, వినోద పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ఈ నగరం ఇప్పుడు ఉద్యోగాల విషయంలో సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఎన్నికల ప్రచారంలో నిత్యా రామన్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకప్పుడు సినిమాలు తీయడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, సృజనాత్మక ఆలోచనలకు వేదికగా ఉన్న లాస్ ఏంజెలెస్‌లో ఇప్పుడు ఆ ఉత్సాహం తగ్గిపోయిందని అన్నారు.
మళ్లీ నగరాన్ని సృజనాత్మకతకు, వ్యాపారాలకు, సినిమా నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతంగా మార్చాలని తన ఆకాంక్షను వెల్లడించారు.
అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కొత్త పెట్టుబడులు రావాలి. సినిమా నిర్మాణ సంస్థలకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాలి. కొత్త వ్యాపారాలకు అవకాశాలు పెరగాలి. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. హాలీవుడ్‌కు సంబంధించిన సమస్యలు కేవలం వినోద పరిశ్రమకే పరిమితం కావు. వాటి ప్రభావం నగర ఆర్థిక వ్యవస్థపైనా ఉంటుంది.
రోడ్లపై గుంతలు.. గత మేయర్ల హామీలు కూడా నెరవేరలేదు!
లాస్ ఏంజెలెస్‌లో ట్రాఫిక్, గుంతలు, పనిచేయని వీధి దీపాలు చాలాకాలంగా సమస్యలుగా కొనసాగుతున్నాయి. కరెన్ బాస్ హయాంలో రోడ్లను పూర్తిగా పునర్నిర్మించడం కంటే గుంతలను పూడ్చడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు నిత్యా రామన్ ఈ విధానాన్ని మార్చాలని భావిస్తున్నారు. అయితే రోడ్ల పునర్నిర్మాణానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు? ఎన్ని రోడ్లను అభివృద్ధి చేస్తారు? పనులు ఎంత వేగంగా పూర్తవుతాయి? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
రాజకీయ సిద్ధాంతం ఒకటి.. నగర అవసరాలు మరొకటి!
నిత్యా రామన్ డెమోక్రటిక్ సోషలిస్ట్ భావజాలానికి చెందిన నాయకురాలు. అమెరికాలో ఈ తరహా నాయకులకు నగర రాజకీయాల్లో ఆదరణ పెరుగుతున్న సమయంలో ఆమె విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ, సియాటిల్ మేయర్ కేటీ విల్సన్ వంటి నేతల సరసన చేరబోతున్నారు.
అయితే డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా (DSA) సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ తాను అనుసరించబోనని ఆమె స్పష్టం చేశారు. నగర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ఆ సంస్థ వైఖరితో విభేదించడానికి కూడా సిద్ధమని చెప్పారు. తన స్వతంత్ర నిర్ణయాలకే ప్రాధాన్యత ఉంటుందని సెప్టెంబర్‌లో జరిగిన అభ్యర్థుల చర్చలో వెల్లడించారు.
కరెన్ బాస్ ఓటమి వెనుక పాలిసేడ్స్ అగ్నిప్రమాదం!
నిత్యా రామన్ విజయం వెనుక ఆమె ప్రచారంతోపాటు కరెన్ బాస్ ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయి. పాలిసేడ్స్ ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం కరెన్ బాస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
అగ్నిప్రమాదం చెలరేగిన సమయంలో కరెన్ బాస్ విదేశాల్లో ఉండటం, అగ్నిమాపక విభాగం ముందస్తు సన్నద్ధతపై ప్రశ్నలు తలెత్తడం ఆమెకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. విపత్తు సమయంలో నగర యంత్రాంగం స్పందించిన తీరుపై విమర్శలు వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో మార్పు కోరుకున్న ఓటర్లకు నిత్యా రామన్ ప్రత్యామ్నాయంగా కనిపించారు. అయితే కరెన్ బాస్‌పై ఉన్న అసంతృప్తి ఎన్నికల్లో ఆమెకు అనుకూలంగా మారినా.. మేయర్‌గా తన పనితీరుతోనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.
హార్వర్డ్, MIT నుంచి మేయర్ కార్యాలయం వరకు!
కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన నిత్యా రామన్ హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చదువుకున్నారు. అర్బన్ ప్లానర్‌గా పనిచేశారు. నిరాశ్రయులకు సహాయం అందించే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.
ఆమె భర్త టెలివిజన్ రచయిత, నిర్మాత. వీరికి పదేళ్ల కవల పిల్లలు ఉన్నారు. సిల్వర్ లేక్ ప్రాంతంలో నివసిస్తున్న నిత్యా రామన్ రాజకీయ ప్రయాణం భారతీయ సంతతికి చెందిన వారిలోనూ ఆసక్తిని పెంచుతోంది.
ఏదైమైనా…
ఒకప్పుడు లాస్ ఏంజెలెస్ తన సినిమాలతో ప్రపంచానికి కలలు చూపించింది. ఇప్పుడు అదే నగరం తన సమస్యలకు పరిష్కారం కోసం ఒక కొత్త మేయర్ వైపు చూస్తోంది. నిత్యా రామన్ ఎన్నికల పోరాటంలో గెలిచారు. కానీ ఆమె ముందున్న అసలైన పోరాటం ఇప్పుడిప్పుడే మొదలు కాబోతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







