ముద్రగడ అంత్యక్రియల వివాదం.. కిర్లంపూడి పీఎస్లో మాజీ మంత్రి..!
కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu విచారణకు హాజరయ్యారు. గత జూలై 15న ఆయనపై నమోదైన ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన కేసు విషయమై పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించిన తరుణంలో..
అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నేతలు పోలీసులను అడ్డుకుని, నెట్టివేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై అప్పట్లో ఈ కేసు నమోదైంది. పోలీసుల స్టేషన్లో విచారణ ముగిసిన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న తనకు పోలీస్ స్టేషన్లకు రావడం, విచారణలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. అంత్యక్రియల సమయంలో ముద్రగడ పద్మనాభానికి ప్రభుత్వ పరంగా ఇచ్చే ‘గార్డ్ ఆఫ్ హానర్’ అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులే స్వయంగా తమకు చెప్పారని..
అందుకే తాము పోలీసుల ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సి వచ్చిందని వివరించారు. తాము ఎలాంటి నేరం చేయలేదని, కేవలం కుటుంబ సభ్యుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అధికార కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే పాత కేసులను తవ్వి తీస్తూ తమను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ముద్రగడ కుటుంబ సభ్యుల ఇష్టప్రకారం జరిగిన వ్యవహారాన్ని పోలీసుల విధులకు ఆటంకంగా చిత్రీకరించడం సరికాదని అంబటి రాంబాబు వాదించారు. ఈ విచారణ ప్రక్రియ కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో మరియు కాకినాడ జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపింది.







