వైసీపీకి విజయభాస్కర్ రెడ్డి గుడ్‌బై..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి విజయవాడలో మరో భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వైసీపీకి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన తన మెడలో ఉన్న వైసీపీ పార్టీ కండువాను తీసివేసి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “వైసీపీలో అసలు ఎవరికీ అధికారికంగా పార్టీ సభ్యత్వాలు అనేవే ఉండవు. సంతకాలు లేని కేవలం లెటర్ ప్యాడ్లపై మాత్రమే ఇష్టమొచ్చినట్లు పదవుల పంపకాలు ఇస్తారు” అంటూ పార్టీ సంస్థాగత లోపాలను ఎండగట్టారు. గతంలో సామాన్య ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan) పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన పూర్తిగా ఒమ్ము చేసుకున్నారని, అందుకే క్యాడర్ అంతా పార్టీకి దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇదే క్రమంలో తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికను కూడా విజయభాస్కర్ రెడ్డి బహిరంగ పరిచారు. ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూ స్థానంలో ఉండి, రెండేళ్ళ క్రితం బయటకు వచ్చిన రాజ్యసభ మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి త్వరలోనే స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీలో తాను చేరబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 11వ తేదీన విజయసాయి రెడ్డి తన సరికొత్త పార్టీ పేరు, అజెండాను ప్రకటించనున్న నేపథ్యంలో.. వైసీపీ నుంచి వలసలు ఇప్పుడే ఊపందుకోవడం ఏపీ రాజకీయంలో సరికొత్త కలకలానికి తెరతీసింది.







