షాకింగ్ నిజం: రోబోల కోసం ప్రత్యేక జిమ్.. అక్కడ జరిగేది ఇదే!
సాధారణంగా జిమ్ అంటే మనుషులు కండలు పెంచుకోవడానికి, ఫిట్నెస్ పెంచుకోవడానికి వెళ్లే ప్రదేశం. కానీ ఇప్పుడు రోబోల కోసం కూడా ప్రత్యేకంగా జిమ్‌లు వస్తున్నాయి. అయితే అక్కడ డంబెల్స్ ఉండవు.. ట్రెడ్మిల్స్ కనిపించవు. అయినా సరే, రోబోలు మాత్రం అక్కడ గంటల తరబడి శిక్షణ తీసుకుంటాయి. ఒక వస్తువును ఎలా పట్టుకోవాలి? కిందపడకుండా ఎలా ఎత్తాలి? మనుషుల్లా పనులు ఎలా చేయాలి? ఇలాంటి విషయాలన్నీ నేర్చుకుంటాయి. అసలు రోబోలకు ప్రత్యేకంగా జిమ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ వాటికి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు? ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు ఆలోచన ఏమిటి?
అసలు ఈ RoboGymలో ఏం జరుగుతుంది?
జర్మనీకి చెందిన NEURA Robotics, మ్యూనిచ్‌లోని Technical University of Munich (TUM) కలిసి ఈ RoboGymను ఏర్పాటు చేశాయి. Munich Airport సమీపంలోని LabCampusలో అక్టోబర్ 22న దీన్ని ప్రారంభించారు. పేరులో జిమ్ ఉన్నప్పటికీ, ఇది సాధారణ జిమ్‌లా ఉండదు. ఇక్కడ రోబోలు తమ శారీరక సామర్థ్యాలను పెంచుకోవడం కంటే, నిజ జీవితంలో మనుషులు చేసే పనులను నేర్చుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడతాయి.
ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీలో కార్మికుడు కార్డ్బోర్డ్ బాక్సులను ఒకచోట నుంచి మరోచోటికి తరలిస్తున్నాడనుకుందాం. ఇంకోచోట బాటిళ్లలో ద్రవాలను నింపుతున్నారు. మరొక పరిశ్రమలో చెక్క వస్తువులను యంత్రాల్లోకి పంపించి, తయారైన తర్వాత బయటకు తీస్తున్నారు. ఇలాంటి పనులన్నింటినీ రోబోలు ఎలా చేయాలో ఇక్కడ నేర్పిస్తారు. అంతేకాదు, ఒక వస్తువును పట్టుకున్నప్పుడు ఎంత బలం ఉపయోగించాలి? అది జారిపోకుండా ఎలా పట్టుకోవాలి? పని మధ్యలో పరిస్థితులు మారితే ఎలా స్పందించాలి? వంటి విషయాల్లోనూ శిక్షణ ఇస్తారు.
ఇవి కూడా చదవండి
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి కంపెనీలు తమ నిజమైన పనులనే ఇక్కడికి తీసుకొస్తాయి. వాటి అవసరాలకు తగ్గట్టుగా రోబోలను పరీక్షిస్తాయి. అంటే ఒక రోబోను కొనుక్కొని ఫ్యాక్టరీలో పెట్టిన తర్వాత అది పనిచేస్తుందో లేదో చూడటం కాకుండా, ముందుగానే దాని సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చన్నమాట.
మనుషులను చూసి రోబోలు నేర్చుకుంటాయా?
ఈ RoboGymలో రోబోలకు శిక్షణ ఇచ్చే విధానం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేసి రోబోలకు పనులు నేర్పించడం కాకుండా, మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
మొదటిది.. రోబోలతో నిజంగానే పనులు చేయించడం. ఒక వస్తువును ఎత్తడం, కదిలించడం, పట్టుకోవడం వంటి పనులు చేస్తున్నప్పుడు వాటిలోని సెన్సార్లు ప్రతి కదలికను రికార్డు చేస్తాయి. ఎంత బలంతో వస్తువును పట్టుకున్నాయి? ఎక్కడ తాకాయి? పని సరిగ్గా పూర్తయిందా? వంటి వివరాలు డేటాగా మారతాయి.
రెండోది.. మనుషుల నుంచి నేరుగా నేర్చుకోవడం. ప్రత్యేక సెన్సార్లు ఉన్న దుస్తులు, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా మనుషులు చేసే కదలికలను రికార్డు చేస్తారు. అవసరమైనప్పుడు టెలీఆపరేషన్ ద్వారా మనుషులే రోబోలను నడిపిస్తూ పనులను నేర్పిస్తారు. ఒక మనిషి వస్తువును ఎలా పట్టుకుంటున్నాడు? ఎలా తిప్పుతున్నాడు? ఎలా అమర్చుతున్నాడు? అనే విషయాలను రోబోలకు అర్థమయ్యే డేటాగా మారుస్తారు.
మూడోది.. సిమ్యులేషన్. అంటే నిజ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను కంప్యూటర్లోనే సృష్టించి రోబోలకు ముందుగా శిక్షణ ఇస్తారు. ఒకే పనిని వివిధ పరిస్థితుల్లో చేయడం నేర్పిస్తారు. ఆ తర్వాత నిజమైన రోబోలపై పరీక్షిస్తారు. ఈ మూడు పద్ధతుల వల్ల రోబోలు కేవలం ఒకే రకమైన పనికి పరిమితం కాకుండా, కొత్త పరిస్థితులకు కూడా అలవాటు పడేలా చేయాలన్నది లక్ష్యం.
ఒక రోబో నేర్చుకున్నది.. మరో రోబోకు కూడా!
ఈ RoboGymలో మరో కీలకమైన అంశం ఉంది. ఒక రోబో ఏదైనా కొత్త పనిని నేర్చుకుందని అనుకుందాం. ఆ జ్ఞానం దానితోనే ఆగిపోకూడదు. అదే నైపుణ్యం ఇతర రోబోలకు కూడా అందాలి. ఇందుకోసం NEURA Robotics Neuraverse అనే సాఫ్ట్వేర్ వ్యవస్థను ఉపయోగిస్తోంది.
దీనికి అనుసంధానమైన Neuron AI ద్వారా రోబోలు నేర్చుకున్న నైపుణ్యాలను ఇతర రోబోలకూ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రోబోలు ఒకదానికొకటి నేర్పించుకున్నట్టే. ఒక రోబో కొత్త పనిని నేర్చుకోవడానికి పట్టిన సమయం, మిగతా రోబోలకూ అదే పని నేర్పించడంలో ఉపయోగపడుతుంది.
ఇక్కడే ఈ జిమ్ అసలు ప్రాధాన్యత కనిపిస్తుంది. ఒక్కో రోబోకు ఒక్కోసారి మొదటి నుంచి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. అనుభవం పెరిగే కొద్దీ వాటి పనితీరును మరింత మెరుగుపరచవచ్చు.
20 శాతం తక్కువ బరువుతో కొత్త హ్యూమనాయిడ్ రోబోట్!
ఈ RoboGym ప్రారంభోత్సవం సందర్భంగా NEURA Robotics తన కొత్త హ్యూమనాయిడ్ రోబోట్ 4NE1 Gen 4ను కూడా పరిచయం చేసింది. గత మోడల్‌తో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ బరువుతో, మరింత సన్నని ఆకృతిలో రూపొందింది. బయటిభాగానికి నల్లటి ఫ్యాబ్రిక్ కవరింగ్ ఇచ్చారు. మనుషులతో కలిసి పనిచేసేలా దీన్ని రూపొందించడమే కాకుండా, మరింత సహజంగా కదిలేలా ప్రత్యేక సాంకేతికతను జోడించారు.
దీని చేతులు వస్తువులను మరింత కచ్చితంగా పట్టుకోగలవు. Smart Limbs అనే వ్యవస్థ ద్వారా శరీరంలోని అవయవాలు తమకు ఎదురయ్యే పరిస్థితులకు స్వతంత్రంగా స్పందించగలవు. దీనివల్ల రోబో కదలికలు మరింత సహజంగా ఉండటంతో పాటు, పనులు చేస్తున్నప్పుడు ఎదురయ్యే మార్పులకు వెంటనే స్పందించగలదు.
ఈ రోబోట్‌కు మెదడులా పనిచేసేది Neuron AI. ఇది కేవలం కెమెరాతో పరిసరాలను చూసి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదు. చూపు, స్పర్శ, బలం, శబ్దం, తన శరీర స్థితి వంటి సమాచారాన్ని కూడా ఉపయోగించుకుంటుంది. ఉదాహరణకు ఒక బోల్ట్‌ను బిగించినప్పుడు అది సరిగ్గా అమరిందా లేదా అన్నది గుర్తించగలగాలి. అలాంటి సూక్ష్మమైన పనుల కోసం ఈ AI వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ రోబోట్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కూడా కంపెనీ సిద్ధమవుతోంది.
రూ.180 కోట్లకు పైగా పెట్టుబడి.. మరిన్ని దేశాలకు విస్తరణ!
ఈ ప్రాజెక్టును చిన్నపాటి ప్రయోగంగా చూడలేం. TUM RoboGym కోసం మొత్తం 17 మిలియన్ యూరోలు పెట్టుబడి పెడుతున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.180 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో NEURA Robotics వాటా 11 మిలియన్ యూరోలు. ఈ భాగస్వామ్యాన్ని తొలుత మూడేళ్ల కాలానికి ఏర్పాటు చేశారు.
మ్యూనిచ్‌లో ప్రారంభమైన ఈ కేంద్రంతోనే ఆగిపోకుండా యూరప్, అమెరికా, చైనాలోనూ మరిన్ని NEURA Gyms ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. జర్మనీలోని RWTH Aachen యూనివర్సిటీతో కలిసి మరో కేంద్రాన్ని కూడా నిర్మిస్తోంది. అంటే భవిష్యత్తులో వివిధ దేశాల్లో రోబోలకు శిక్షణ ఇచ్చే కేంద్రాల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్నది ప్రణాళిక.
ఆటోమొబైల్, ఫార్మా, వ్యవసాయం, లాజిస్టిక్స్, వైద్య రంగం వంటి పరిశ్రమల్లో ఈ రోబోలను ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత, వృద్ధాప్య జనాభా పెరుగుదల వంటి సమస్యలకు రోబోటిక్స్ ఒక పరిష్కారంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.
రేపటి ప్రపంచంలో రోబోలకు కూడా ట్రైనింగ్ సెంటర్లు అవసరమే!
ఇప్పటివరకు మనం AI గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా గుర్తొచ్చేది ప్రశ్నలకు సమాధానాలు చెప్పే చాట్బాట్లు, కథలు రాసే టూల్స్, చిత్రాలు తయారుచేసే సాఫ్ట్వేర్లు. కానీ తదుపరి దశలో AI మనుషులు పనిచేసే భౌతిక ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు కంప్యూటర్‌కు పని నేర్పించడానికి కోడింగ్ అవసరమయ్యేది. ఇప్పుడు రోబోలకు మనుషుల అనుభవాన్ని, కదలికలను, పనితీరును నేర్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఈ మార్పు ఒక కొత్త ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. రోబోలు మనుషుల పనులను నేర్చుకుని ఫ్యాక్టరీల్లో పనిచేయడం మొదలుపెడితే, భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపం ఎలా మారుతుంది? కొన్ని పనుల్లో మనుషుల అవసరం తగ్గుతుందా? లేక మనుషులు మరింత క్లిష్టమైన పనులపై దృష్టి పెట్టే అవకాశం వస్తుందా? అన్నది చూడాలి.
ఏదేమైనా…
జర్మనీ ఏర్పాటు చేసిన ఈ RoboGym కేవలం రోబోట్లకు శిక్షణ ఇచ్చే కేంద్రం మాత్రమే కాదు. భవిష్యత్తులో మనుషులు, యంత్రాలు కలిసి పనిచేయబోయే ప్రపంచానికి ఒక ప్రయోగశాల లాంటిది. ఇప్పటివరకు మనుషులు జిమ్‌కు వెళ్లి తమ శరీరాన్ని సిద్ధం చేసుకున్నారు. రేపటి ఫ్యాక్టరీల్లో పనిచేయబోయే రోబోలు కూడా ప్రత్యేక జిమ్‌లలో శిక్షణ తీసుకుంటున్నాయి. తేడా ఒక్కటే.. మనుషులు కండలు పెంచుకుంటే, రోబోలు తమ తెలివితేటలకు పనితీరును జోడించుకుంటున్నాయి!
— సూర్య ప్రకాష్ జోశ్యుల







