కరీంనగర్ ‘మహా పాదయాత్ర’కు నితిన్ నబీన్!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. అయితే, ఈ ఆరోపణలను కేవలం ప్రకటనలతోనే కాకుండా, నేరుగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని బీజేపీ సంకల్పించింది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా అసత్యాలను వ్యాప్తి చేస్తూ రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తోందనే వాదనతో దేశవ్యాప్తంగా ప్రతిఘటన ర్యాలీలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా తెలంగాణను తన ప్రధాన రాజకీయ వేదికగా మలుచుకుంటూ బీజేపీ దూకుడు పెంచింది.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మహా పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరై విపక్ష కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజా పరిణామాలతో తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. హైదరాబాద్ తర్వాత ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉత్తర తెలంగాణ కేంద్రమైన కరీంనగర్‌ను పార్టీ తదుపరి లక్ష్యంగా ఎంచుకుంది. నవంబర్ 18న కరీంనగర్లో నిర్వహించనున్న భారీ మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్వయంగా పాల్గొననున్నారు.
నితిన్ నబీన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేస్తుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని గాంధీ సర్కిల్, వైశ్య భవన్ నుంచి ప్రారంభమై టవర్ సర్కిల్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు సాగే ఈ పాదయాత్రలో దాదాపు లక్ష మంది ప్రజలు, కార్యకర్తలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యాత్రలో నితిన్ నబీన్‌తో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, బండి సంజయ్ ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారు.
ఈ భారీ పాదయాత్ర కేవలం ఈసీ ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణ పారదర్శకంగా జరుగుతోందని, ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ సంస్థల ప్రతిష్టను మంటగలుపుతోందని ప్రజలకు వివరించడం బీజేపీ ప్రధాన ఉద్దేశం. ఇక బూత్ స్థాయి కమిటీలు, శక్తి కేంద్రాలు, మండల స్థాయిల్లో ఇప్పటికే విస్తృత సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అట్టడుగు స్థాయి కేడర్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా రాబోయే రాజకీయ పోరాటాలకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక తర్వాత దక్షిణాదిలో పార్టీకి విస్తృత అవకాశాలున్న రాష్ట్రంగా తెలంగాణను బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను రాబోయే అసెంబ్లీ సమరానికి పునాదిగా మార్చుకోవాలనేది పార్టీ కేంద్ర వ్యూహం.
ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే.. విపక్షాల దాడిని కాపాడుకోవడానికే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యర్థి తామేనని నిరూపించుకోవడానికి బీజేపీ ఈ వేదికను వాడుకుంటోంది. రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతపై సాగుతున్న ఈ దేశవ్యాప్త పాదయాత్రలలో కరీంనగర్ వేదికగా నితిన్ నబీన్ చేయబోయే ప్రసంగం జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధమైన ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.







