మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న కొత్త వైరస్.. భారత్‌కూ ముప్పు ఉందా?
కరోనా కథ ముగిసిపోయిందని అనుకుంటున్న సమయంలో మరో కొత్త వేరియంట్ తెరపైకి వచ్చింది. అమెరికా నుంచి యూరప్ వరకు, ఆస్ట్రేలియా నుంచి ఆసియాలోని కొన్ని ప్రాంతాల వరకు వ్యాపిస్తోంది. స్పైక్ ప్రోటీన్‌లో అనూహ్యమైన మార్పులు.. మనిషి కణాల్లోకి మరింత సులభంగా ప్రవేశించే అవకాశం! అసలు ఈ కొత్త వైరస్ వెనుక కథేంటి? భారత్‌కు కూడా ముప్పు పొంచి ఉందా?
కరోనా పేరు వినగానే ఇప్పటికీ చాలామందికి ఆ పాత రోజులు గుర్తుకొస్తాయి. లాక్డౌన్లు, ఆసుపత్రుల ముందు క్యూలు, ఆక్సిజన్ కోసం పడిన ఇబ్బందులు, మాస్కులతో గడిచిన జీవితం.. ఇవన్నీ నిన్న మొన్న జరిగినట్టుగానే అనిపిస్తాయి. కరోనా ప్రభావం తగ్గడంతో ప్రపంచం కూడా క్రమంగా సాధారణ జీవితంలోకి వచ్చేసింది. కానీ వైరస్ మాత్రం తన పని తాను చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో బయటపడుతూనే ఉంది.
ఇప్పుడు అలాంటి మరో కొత్త వేరియంట్ పేరు PJ.2.1. కెనడాలో తొలిసారిగా బయటపడిన ఈ వేరియంట్ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా పలు దేశాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా దీని స్పైక్ ప్రోటీన్‌లో వచ్చిన మార్పులు శాస్త్రవేత్తలను ఆసక్తిగా పరిశీలించేలా చేస్తున్నాయి. ఈ మార్పుల వల్ల వైరస్ మనిషి శరీరంలోని కణాల్లోకి మరింత సులభంగా ప్రవేశించే అవకాశం ఉందని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి.
అయితే కొత్త వేరియంట్ అంటే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఇది గత కరోనా వేరియంట్ల కంటే ఎక్కువ ప్రాణాంతకమని చెప్పడానికి ఆధారాలు లేవు. అయినప్పటికీ కొన్ని దేశాల్లో దీని వ్యాప్తి పెరుగుతుండటంతో అసలు PJ.2.1 ఏంటి? ఎందుకు దీన్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
కెనడాలో మొదలై.. ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న కొత్త వేరియంట్!
PJ.2.1 అనేది కరోనా వైరస్‌కు చెందిన కొత్త జన్యు వంశం (Lineage). పరిశోధకులు మార్కస్ హాఫ్మన్ తదితరులు ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఇది గతంలో వ్యాప్తిలో ఉన్న JN.1 వేరియంట్ కుటుంబానికి చెందిన MC.10.1.7 నుంచి పరిణామం చెందింది.
2026 మే 2న కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో తొలిసారిగా ఈ వేరియంట్‌ను గుర్తించారు. అక్కడి నుంచి క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. జూన్ 30న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో తొలి కేసు బయటపడింది. ఆ తర్వాత కాలిఫోర్నియా, అరిజోనా, న్యూజెర్సీ, వర్జీనియా, నార్త్ కరోలినా, మిస్సోరి, ఓక్లహోమా, కొలరాడో, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లోనూ దీని ఉనికి కనిపించింది.
అమెరికాకే పరిమితం కాకుండా సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకూ చేరుకుంది. ముఖ్యంగా స్పెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే అక్కడక్కడా ఒకటి రెండు కేసులు కనిపించడం మాత్రమే కాకుండా, స్థానికంగా కూడా ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న సూచనలు ఉన్నాయి.
అంటారియో పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన గణాంకాలు మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాయి. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 17 మధ్య జన్యు పరీక్షలు నిర్వహించిన కరోనా నమూనాల్లో PJ.2.1 వాటా ఏకంగా 25.2 శాతానికి చేరింది. అంతకుముందు నాలుగు వారాలతో పోలిస్తే దీని వాటా 16.9 శాతం పెరిగింది. ఒకప్పుడు గుర్తించిన కొత్త వేరియంట్ ఇప్పుడు అక్కడ గణనీయమైన ప్రాబల్యాన్ని సాధిస్తోందన్నమాట.
వైరస్‌లో వచ్చిన మార్పులే అసలైన మేటర్!
PJ.2.1 గురించి శాస్త్రవేత్తలు ఎందుకు ఇంతగా కంగారుపడుతున్నారంటే…. దాని స్పైక్ ప్రోటీన్‌లో జరిగిన మార్పుల వల్లే. కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి ఈ స్పైక్ ప్రోటీన్ ఒక తాళంచెవిలా పనిచేస్తుంది. మన శరీరంలోని కణాలపై ఉండే ACE2 అనే రిసెప్టర్‌తో అనుసంధానమై వైరస్ లోపలికి ప్రవేశిస్తుంది.
ఇప్పుడు PJ.2.1లో ఈ స్పైక్ ప్రోటీన్ నిర్మాణంలో అనేక మ్యుటేషన్లు కనిపించాయి. ఈ మార్పులు వైరస్ ACE2 రిసెప్టర్‌తో అనుసంధానమయ్యే విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయా? ఒకవేళ ప్రభావితం చేస్తే వైరస్ మనిషి కణాల్లోకి మరింత సులభంగా ప్రవేశించగలదా? అనే అంశాలపై పరిశోధకులు దృష్టి పెట్టారు.
Journal of Infection లో ప్రచురితమైన ప్రాథమిక పరిశోధన ప్రకారం.. PJ.2.1కు ACE2తో అనుసంధానమయ్యే సామర్థ్యం పెరిగి ఉండవచ్చని సూచనలు కనిపించాయి. అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది.
వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఈ వైరస్ సోకుతుందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల







