ట్రంప్ కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కు కొత్త తలనొప్పి.. బయటపడ్డ ఆ రహస్య మెసేజ్‌లు!
ట్రంప్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తి.. ఇప్పుడు ఏకంగా వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్! అమెరికా రాజకీయాల్లో కీలకమైన స్థానానికి ఎదిగిన స్టీఫెన్ మిల్లర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆయన చేసినట్లుగా చెబుతున్న కొన్ని ప్రైవేట్ మెసేజ్‌లు ఇప్పుడు బయటకు వచ్చాయి. వాటిని లీక్ చేసింది మరెవరో కాదు.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో సంతానం కలిగిన యాష్లే సెయింట్ క్లెయిర్!
ఒకప్పుడు ట్రంప్, MAGA ఉద్యమానికి గట్టి మద్దతుదారుగా ఉన్న యాష్లే.. ఇప్పుడు అదే రాజకీయ వర్గానికి చెందిన కీలక వ్యక్తి ప్రైవేట్ సందేశాలను బయటపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆమె సోషల్ మీడియా వేదిక Threadsలో షేర్ చేసిన స్క్రీన్షాట్లలో ‘White Boy November’, ‘The Kens Strike Back’ అనే పదాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ స్టీఫెన్ మిల్లర్ ఏం ప్లాన్ చేశారు? యువ శ్వేతజాతీయ పురుషుల ఓట్ల కోసం ఎలాంటి వ్యూహం రచించారు? ఇప్పుడు ఆయనకు కొత్తగా వచ్చిన పదవికి ఈ లీక్ ఎలాంటి ఇబ్బందులు సృష్టించవచ్చు?
‘White Boy November’.. ఇదేం ఎన్నికల ప్రచారం!
యాష్లే సెయింట్ క్లెయిర్ బయటపెట్టిన స్క్రీన్షాట్ల ప్రకారం, 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు శ్వేతజాతీయ యువకులను ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేయించేలా ఒక ప్రచార వ్యూహంపై చర్చ జరిగినట్లు కనిపిస్తోంది. ఈ సందేశాలు సిగ్నల్ (Signal) యాప్‌లో ‘S M’ పేరుతో సేవ్ చేసిన కాంటాక్ట్ నుంచి వచ్చినట్లు ఉన్నాయి. అవి స్టీఫెన్ మిల్లర్ పంపినవేనని యాష్లే చెబుతున్నారు. అయితే వాటి ప్రామాణికత స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.
ఆ సందేశాల్లో సంప్రదాయవాద మహిళలంతా సోషల్ మీడియా వేదిక Xలో వీడియోలు పోస్ట్ చేసి, శ్వేతజాతీయ యువకులు ఓటు వేయడానికి ముందుకు రావాలని పిలుపునివ్వాలని సూచించినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, తమకు తెలిసిన పది మంది శ్వేతజాతీయ పురుషులకు ఫోన్ చేసి ఓటు వేయాలని కోరాలని, ఆ తర్వాత తమకు సమాచారం ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.
ఇక ఈ ప్రచారానికి పెట్టాలనుకున్న పేర్లు మరింత ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ‘White Boy November’, ‘The Kens Strike Back’ అంటూ రెండు నినాదాలను ప్రతిపాదించారు. ముఖ్యంగా ‘White Boy November’ అనే పదబంధం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. యువ శ్వేతజాతీయ పురుషులను లక్ష్యంగా చేసుకుని మహిళల సోషల్ మీడియా ప్రభావాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఈ సందేశాల్లో కనిపిస్తోంది.
యువకుల ఓట్ల కోసం ట్రంప్ ఎందుకంత ప్రయత్నించారు?
2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రచారంలో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. సంప్రదాయ రాజకీయ ప్రచారాలకు భిన్నంగా పాడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ షోలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా యువ పురుషులను ఆకర్షించేందుకు ట్రంప్, అప్పటి ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ప్రయత్నించారు. ముఖ్యంగా యువతలో ఉన్న ఆర్థిక, సామాజిక అసంతృప్తిని తమ ప్రచారానికి అనుకూలంగా మలుచుకునే వ్యూహాన్ని అనుసరించారు.
అయితే రెండేళ్ల తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందని అక్కడ లోకల్ మీడియా అంటోంది. 2026 మధ్యంతర ఎన్నికల్లో ఇతర జనాభా వర్గాలతో పోలిస్తే యువ పురుష ఓటర్లలో ఎడమపక్షాల వైపు మొగ్గ ఎక్కువగా కనిపించిందని తెలిపింది. అంటే 2024లో ట్రంప్ వైపు ఆకర్షితులైన యువ ఓటర్లలో కొంతమంది ఇప్పుడు తమ రాజకీయ వైఖరిని మార్చుకున్నారా అన్న చర్చ మొదలైంది.
ఒకప్పుడు MAGA మద్దతుదారు.. ఇప్పుడు అదే ఉద్యమంపై విమర్శలు!
ఈ వ్యవహారంలో యాష్లే సెయింట్ క్లెయిర్ పాత్రే అసలు ట్విస్ట్. ఒకప్పుడు ఆమె ట్రంప్, MAGA ఉద్యమానికి బలమైన మద్దతుదారు. సోషల్ మీడియాలో ఆ ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అదే ఉద్యమంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఎలాన్ మస్క్‌తో జరిగిన కస్టడీ వివాదం తర్వాత ఆమె రాజకీయ వైఖరిలోనూ మార్పు కనిపించింది.
జూలైలో డైలీ బీస్ట్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అసంతృప్తిని బయటపెట్టారు. ఫేస్బుక్లో ఆగ్రహం, భయాన్ని రెచ్చగొట్టే కంటెంట్ ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నారని, వివిధ సంస్థల నుంచి నిధులు తీసుకుంటున్నప్పటికీ వాటి మూలాలు ఏమిటో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు.
మార్చిలో ది బుల్వార్క్ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ MAGA ఉద్యమంలో మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా తప్పుబట్టారు. ఆ ఉద్యమాన్ని ఒక కల్ట్‌తో పోలుస్తూ, వ్యక్తులను ఇతరుల నుంచి వేరుచేసి ఉంచే ధోరణి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు అదే ఉద్యమంలో కీలకంగా ఉన్న స్టీఫెన్ మిల్లర్‌కు సంబంధించినవిగా చెబుతున్న మెసేజ్‌లను బయటపెట్టడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఒకప్పుడు అంతర్గతంగా ఉన్న వ్యక్తి నుంచే ఇలాంటి సందేశాలు బయటకు రావడం ట్రంప్ వర్గానికి ఇబ్బందికరమైన పరిణామంగా మారింది.
టైమ్ చూసి మరీ ఈ లీక్!
ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత ట్రంప్ తన వైట్‌హౌస్ టీమ్‌లో కీలక మార్పు చేశారు. ఇప్పటివరకు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన సుసీ వైల్స్ స్థానంలో స్టీఫెన్ మిల్లర్‌ను నియమించారు. దీంతో ట్రంప్ ప్రభుత్వంలో మిల్లర్ ప్రాధాన్యత మరింత పెరిగింది.
ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలం నుంచే మిల్లర్ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అమెరికా వలస విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. మొదటి ట్రంప్ ప్రభుత్వంలో అమలైన కుటుంబాల విభజన విధానం, ముస్లిం దేశాల పౌరుల ప్రయాణాలపై విధించిన నిషేధం వంటి వివాదాస్పద నిర్ణయాల వెనుక కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
మిల్లర్ నియామకంపై వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ స్పందిస్తూ, ట్రంప్ రాజకీయ ప్రయాణం ప్రారంభం నుంచే మిల్లర్ ఆయనతో ఉన్నారని, ట్రంప్ విధానాలకు ఆయన అతిపెద్ద మద్దతుదారుల్లో ఒకరని ప్రశంసించారు.
మరోవైపు మిల్లర్ భార్య కేటీ మిల్లర్ కూడా సంప్రదాయవాద పాడ్‌కాస్టర్‌గా గుర్తింపు పొందారు. భర్తకు వైట్‌హౌస్‌లో కొత్త బాధ్యతలు రావడంతో తన పాడ్‌కాస్ట్ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
ఈ లీక్‌తో మిల్లర్‌కు ఎలాంటి నష్టం జరగొచ్చు?
వైట్‌హౌస్‌లో అత్యంత కీలకమైన పదవిని చేపట్టిన సమయంలో ఇలాంటి ప్రైవేట్ మెసేజ్‌లు బయటకు రావడం మిల్లర్‌కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారవచ్చు. ముఖ్యంగా ట్రంప్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఆయనకున్న గుర్తింపుపై ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశం ఉంది.
మొదటగా, ఆయన రాజకీయ విశ్వసనీయతపై చర్చ మొదలవుతుంది. ఎన్నికల సమయంలో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎలాంటి వ్యూహాలు రూపొందించారు? వాటి వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? అనే ప్రశ్నలు ఎదురవుతాయి. సంప్రదాయవాద మహిళల సోషల్ మీడియా ప్రభావాన్ని ఉపయోగించుకుని శ్వేతజాతీయ పురుషులను ఓటింగ్‌కు ప్రోత్సహించాలన్నట్లు కనిపిస్తున్న ఈ సందేశాలు మహిళలను రాజకీయ ప్రచారానికి ఒక సాధనంగా ఉపయోగించుకున్నారనే విమర్శలకు కూడా అవకాశం కల్పించవచ్చు.
రెండోది.. వైట్‌హౌస్‌లో ఆయనపై ఉండే నమ్మకం. చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే అధ్యక్షుడికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి. ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలు, అధికారుల మధ్య సమన్వయం, అధ్యక్షుడి రాజకీయ వ్యూహాలు వంటి అనేక అంశాల్లో ఆయన పాత్ర ఉంటుంది. అలాంటి వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ సంభాషణలు బయటకు రావడం సహజంగానే ఆయన కమ్యూనికేషన్ల భద్రత, అంతర్గత విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది.
మూడోది.. రాజకీయ ప్రత్యర్థులకు కొత్త ఆయుధం దొరికినట్లవుతుంది. ముఖ్యంగా ట్రంప్ ప్రచార వ్యూహాలను విమర్శించే వర్గాలు ఈ మెసేజ్‌లను ప్రస్తావిస్తూ మిల్లర్‌ను ప్రశ్నించవచ్చు. ఆయన తీసుకునే భవిష్యత్ నిర్ణయాలను కూడా ఈ పాత సందేశాలతో ముడిపెట్టే అవకాశం ఉంది.
అయితే ఈ లీక్ వల్ల మిల్లర్‌కు వెంటనే పదవి పోతుందని చెప్పలేం. అలాగే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉందని చెప్పడానికి కూడా ప్రస్తుతానికి ఆధారాలు లేవు. ఎందుకంటే ఈ సందేశాల ప్రామాణికతే ఇంకా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ, కొత్త బాధ్యతలు చేపట్టిన సమయంలో పాత మెసేజ్‌లపై వివరణలు ఇవ్వాల్సిన పరిస్థితి రావడం ఆయనకు రాజకీయంగా అనవసరమైన ఒత్తిడిని సృష్టించవచ్చు.
ఏదైమైనా…
ఒకప్పుడు ట్రంప్ రాజకీయ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన యాష్లే సెయింట్ క్లెయిర్.. ఇప్పుడు అదే ఉద్యమంలోని అత్యంత కీలక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ సందేశాలను బయటపెట్టారు. పైగా, స్టీఫెన్ మిల్లర్ వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఈ స్క్రీన్షాట్లు వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మెసేజ్‌లు నిజంగా మిల్లర్ పంపినవేనని కూడా ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
—- సూర్య ప్రకాష్ జోశ్యుల







