అమెరికాలోనూ దీపావళికి సెలవు ఇవ్వబోతున్నారా? ఈ బిల్లు వెనుక ఉన్న ఐదుగురు భారతీయ-అమెరికన్లు ఎవరో తెలుసా?
అమెరికాలో దీపావళి పండుగకు కూడా క్రిస్మస్, థాంక్స్ గివింగ్ తరహాలో అధికారిక సెలవు రావచ్చా? ఈ ప్రశ్న ఇప్పుడు అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీపావళిని అమెరికా ఫెడరల్ హాలిడేగా గుర్తించాలంటూ మరోసారి బిల్లు తెరపైకి వచ్చింది. ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన 19 మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్లో ఐదుగురు భారతీయ మూలాలున్న నేతలే. ఇంతకీ వాళ్లెవరు? ఈ బిల్లు వెనుక ఉన్న అసలు కథేంటి?
అమెరికాలో దీపావళి వేడుకలు జరగడం కొత్తేమీ కాదు. వైట్‌హౌస్‌లోనూ దీపావళి సంబరాలు జరుగుతున్నాయి. అధ్యక్షులు స్వయంగా దీపాలు వెలిగించి పండుగలో పాల్గొంటున్నారు. భారతీయులు ఎక్కువగా నివసించే నగరాల్లో అయితే దీపావళి సందడి ప్రత్యేకంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడో చిన్న తేడా ఉంది. పండుగను ఘనంగా జరుపుకోవడం ఒక ఎత్తయితే.. ఆ పండుగకు దేశవ్యాప్తంగా అధికారిక సెలవుదినం హోదా కల్పించడం మరో ఎత్తు. ఇప్పుడు అమెరికాలో ప్రయత్నం జరుగుతున్నది ఆ రెండో విషయంపైనే.
న్యూయార్క్ కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మెంగ్ మరోసారి ‘Diwali Day Act’ పేరుతో ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈసారి ఆమెకు 19 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు లభించింది. వీరిలో రాజా కృష్ణమూర్తి, సుహాస్ సుబ్రహ్మణ్యం, శ్రీ థానేదార్, రో ఖన్నా, అమీ బేరా అనే ఐదుగురు భారతీయ-అమెరికన్లు ఉండటం విశేషం.
భారతీయ మూలాలున్న ఆ ఐదుగురు నేతలు ఎవరు?
ఈ ఐదుగురి పేర్లు చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ సంతతికి చెందిన వారి ప్రాతినిధ్యం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. వీళ్ల మద్దతు ఈ బిల్లుకు ఎందుకు ఆసక్తికరంగా మారిందంటే.. అమెరికాలో భారతీయ సమాజం కేవలం వ్యాపారాలు, ఉద్యోగాలు, టెక్నాలజీ రంగాలకే పరిమితం కావడం లేదు. రాజకీయ నిర్ణయాల్లోనూ తన ఉనికిని చాటుకుంటోంది. భారతీయ పండుగలు, సంప్రదాయాలు, సాంస్కృతిక గుర్తింపునకు సంబంధించిన అంశాలు ఇప్పుడు అమెరికా చట్టసభల్లో చర్చకు వస్తున్నాయి.
దీపావళికి సెలవు ఇవ్వాలని ఎందుకు కోరుతున్నారు?
సాధారణంగా దీపావళి అంటే మనకు గుర్తొచ్చేవి దీపాలు, పటాకులు, కొత్త బట్టలు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం. కానీ అమెరికాలో ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యత కొంచెం విస్తృతమైనది. అక్కడ హిందువులతోపాటు సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా తమ తమ సంప్రదాయాల ప్రకారం దీపావళిని జరుపుకుంటారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఇండో-కరీబియన్ సమాజాల్లోనూ ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది.
అందుకే దీపావళిని ఒక మతానికి చెందిన పండుగగా మాత్రమే చూడకూడదని, అమెరికాలోని భిన్నమైన సంస్కృతులకు ప్రతీకగా గుర్తించాలని ఈ బిల్లు మద్దతుదారులు కోరుతున్నారు. దీపావళి అంటే చెడుపై మంచి విజయం సాధించడం, అజ్ఞానంపై జ్ఞానం గెలవడం. ఈ విలువలు ఏ ఒక్క మతానికో, ప్రాంతానికో పరిమితం కావని వారి వాదన.
ఈ బిల్లును ప్రవేశపెట్టిన గ్రేస్ మెంగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అమెరికన్లకు దీపావళి ప్రాముఖ్యతను పరిచయం చేయడంతోపాటు, దేశంలోని విభిన్న సంస్కృతులను గౌరవించే వాతావరణం ఏర్పడాలని ఆమె అభిప్రాయపడ్డారు.
పండుగకు గుర్తింపు మాత్రమే కాదు.. విద్వేషానికి వ్యతిరేకంగా ఒక సందేశం!
ఈ బిల్లు వెనుక మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది. అమెరికాలో హిందువులు, దక్షిణాసియా వాసులపై జరుగుతున్న విద్వేషపూరిత ఘటనల గురించి అక్కడి కొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందూ దేవాలయాలపై దాడులు, మతపరమైన వేడుకలకు అంతరాయం కలిగించడం వంటి ఘటనలు చర్చకు వస్తున్నాయి.
ఇల్లినాయిస్లోని ఓ హిందూ దేవాలయంలో నవరాత్రి వేడుకల సందర్భంగా సామూహిక కాల్పులకు ప్రయత్నం జరగడం, వాషింగ్టన్ స్టేట్‌లో దీపావళి వేడుకలను జాత్యహంకార ధోరణితో అడ్డుకోవడం వంటి ఘటనలను Congressional Asian Pacific American Caucus ప్రస్తావించింది. ఇలాంటి చర్యలను సాధారణ ఘటనలుగా తీసుకోకుండా, ఫెడరల్ అధికారులు తీవ్రంగా పరిగణించాలని కోరింది.
ఈ నేపథ్యంలో దీపావళికి అధికారిక సెలవుదినం హోదా కల్పించడం ఒక గుర్తింపుగా మాత్రమే కాకుండా, అమెరికాలో నివసిస్తున్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా ఈ దేశ సామాజిక జీవితంలో ముఖ్యమైన భాగమనే సందేశాన్ని పంపుతుందని గ్రేస్ మెంగ్ భావిస్తున్నారు.
ప్రతి ఒక్కరికీ తమ పండుగలను ఎలాంటి భయం లేకుండా జరుపుకునే స్వేచ్ఛ ఉండాలని, మతం లేదా సంస్కృతి ఆధారంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోకూడదని ఆమె స్పష్టం చేశారు.
బిల్లు ఆమోదమైతే ఏం మారుతుంది?
ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొంది చట్టంగా మారితే దీపావళికి ఫెడరల్ హాలిడే హోదా లభిస్తుంది. అప్పుడు అమెరికా అధికారిక ఫెడరల్ సెలవుదినాల జాబితాలో దీపావళి కూడా చేరుతుంది. ఈ ప్రతిపాదన ప్రకారం అది 12వ ఫెడరల్ హాలిడే అవుతుంది.
అంటే దీపావళి రోజున ఫెడరల్ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కల్పించే అవకాశం ఉంటుంది. అయితే ఫెడరల్ హాలిడే ప్రకటించినంత మాత్రాన అమెరికాలోని ప్రతి ప్రైవేట్ కంపెనీ, స్కూల్, వ్యాపార సంస్థ తప్పనిసరిగా సెలవు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆయా సంస్థల విధానాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ ప్రతిపాదనకు భారతీయ, ఆసియా-అమెరికన్ సంస్థల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. Asian Americans Advancing Justice, Coalition of Hindus of North America, Hindus for Human Rights, Indian American Impact, The Sikh Coalition వంటి సంస్థలు ఈ ప్రయత్నానికి అండగా నిలిచాయి.
దీపావళితో ఆగడం లేదు.. లూనార్ న్యూ ఇయర్పైనా మరో బిల్లు!
గ్రేస్ మెంగ్ కేవలం దీపావళి విషయంలోనే కాదు, ఇతర సంస్కృతులకు సంబంధించిన పండుగలకు కూడా అమెరికాలో అధికారిక గుర్తింపు రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే లూనార్ న్యూ ఇయర్‌కు ఫెడరల్ హాలిడే హోదా కల్పించాలంటూ ‘Lunar New Year Day Act’ను కూడా ప్రవేశపెట్టారు.
మొత్తానికి అమెరికాలో దీపావళి వేడుకలు ఇప్పటికే వైట్‌హౌస్ వరకు చేరాయి. ఇప్పుడు ఆ పండుగకు దేశవ్యాప్తంగా అధికారిక సెలవు హోదా తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే, అమెరికాలోని భారతీయ సమాజానికి అది ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా నిలుస్తుంది. అదే సమయంలో భారతీయ సంస్కృతి అమెరికా ప్రధాన స్రవంతిలో మరింతగా భాగమవుతోందనే చర్చకూ ఇది కొత్త ఊపునిస్తుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







