ప్రపంచ వేదికపై తెలంగాణ ‘భారత్ సమ్మిట్ 2026’
అంతర్జాతీయ దౌత్య, ఆర్థిక, విధాన రంగాల్లో సరికొత్త చర్చలకు వేదికగా నిలిచేందుకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. కాంగ్రెస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘భారత్ సమ్మిట్ 2026’ సదస్సును నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70 దేశాల నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, ఆర్థికవేత్తలు, ప్రగతిశీల ఆలోచనాపరులు ఈ సదస్సుకు హాజరుకానుండటం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో రూపుదిద్దుకుంటున్న నూతన ప్రపంచ వ్యవస్థ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, సమాఖ్య స్ఫూర్తి, ఎన్నికల విశ్వసనీయత వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో లోతైన మేధోమథనం జరగనుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఇందులో పాలుపంచుకోనున్నారు.
భారత్ సమ్మిట్ ద్వారా రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ విదేశాంగ దృక్పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పనున్నట్టు కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విభాగం ఛైర్మన్ సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్య విలువలు, గ్లోబల్ సౌత్-గ్లోబల్ నార్త్ దేశాల మధ్య పరస్పర సహకారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సందర్భంగా ‘అవర్ వరల్డ్’ పేరుతో అంతర్జాతీయ స్థాయి సరికొత్త థింక్-ట్యాంక్‌ను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కేవలం సిద్ధాంత చర్చలకే పరిమితం కాకుండా, తెలంగాణ అభివృద్ధి నమూనాను విశ్వవేదికపై ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను ఒక గొప్ప అవకాశంగా మలుచుకుంటోంది. సదస్సులో మొత్తం 12 అంతర్జాతీయ సెషన్లతో పాటు ప్రత్యేకంగా ‘తెలంగాణ రైజింగ్’ పేరిట 8 కీలక సెషన్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’, వేగవంతమైన పట్టణీకరణ, సంక్షేమ పథకాలు, సామాజిక-ఆర్థిక న్యాయం వంటి అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో చర్చలు సాగుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రామిక సంక్షేమంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన చారిత్రాత్మక ‘ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు’ను ప్రపంచ దేశాల ప్రతినిధులకు ప్రత్యేకంగా పరిచయం చేయనున్నారు. రాహుల్ గాంధీ సైతం గిగ్ కార్మికులతో నేరుగా ముఖాముఖి నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు.
ఈ సదస్సు నిర్వహణ వెనుక బహుముఖ వ్యూహం దాగి ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్య, ప్రగతిశీల భావజాలానికి గొంతుకగా నిలవడం ఒక ఎత్తయితే.. తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మార్చడం మరో ప్రధాన లక్ష్యం. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ఈ భారత్ సమ్మిట్ ఒక బలమైన పునాదిగా పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలు, విదేశీ విధాన నిపుణులతో ముందస్తుగా చర్చలు జరిపి, భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.
హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా ఉన్న ఐటీ, ఫార్మా బలానికి తోడు పాలనా సంస్కరణలు, సంక్షేమ నమూనాను జోడించి ప్రపంచ దేశాల ముందుంచాలనే రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన ఈ సదస్సుతో కార్యాచరణకు నోచుకోనుంది. మొత్తంగా, భారత్ సమ్మిట్ తెలంగాణ రాజకీయ, పారిశ్రామిక రూపురేఖలను సరికొత్త శిఖరాలకు చేర్చే ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.







