మగాళ్లలోని ఓ రహస్య భయం.. ఇప్పుడు అమెరికాలో భారీ బిజినెస్! ‘Manhood’లో బయటపడ్డ నిజాలు!
ఒకప్పుడు అందం విషయంలో మహిళలే ఎక్కువ టెన్షన్ పడతారని అనుకునేవాళ్ళం.అందంగా కనిపించాలి, వయసు పైబడినా యవ్వనంగా ఉండాలి, శరీర ఆకృతి బాగుండాలి. ఇలాంటి ఆలోచనలతో బ్యూటీ, కాస్మెటిక్ పరిశ్రమలు భారీగా పెరిగాయి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ పురుషులకూ పాకింది. జుట్టు రాలకూడదు, ముఖంపై ముడతలు కనిపించకూడదు, సిక్స్ ప్యాక్ ఉండాలి.. వీటన్నింటికీ తోడు ఇప్పుడు మరో కొత్త అభద్రత కూడా వ్యాపారంగా మారింది. అదే పురుషాంగం పరిమాణం!
తమ అంగం ఆశించినంత పెద్దగా లేదని, లైంగికంగా భాగస్వామిని సంతృప్తిపరచలేమని కొందరు పురుషులు లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఈ భయాన్ని తొలగించుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి మానసిక పరిస్థితినే కొన్ని వెల్నెస్ క్లినిక్‌లు వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నాయి.
అంగం పొడవు పెంచలేకపోయినా, మందం పెంచుతామంటూ వేల డాలర్ల చికిత్సలను విక్రయిస్తున్నాయి. విచిత్రమేమిటంటే.. ఒక్కసారి ఈ చికిత్స మొదలుపెడితే సరిపోదు. కోరుకున్న ఫలితాన్ని కొనసాగించుకోవాలంటే మళ్లీ మళ్లీ డబ్బులు చెల్లించాల్సిందే!
ఈ వ్యవహారం వెనుక ఉన్న మనస్తత్వం, వ్యాపార ప్రయోజనాలు, పురుషుల్లో పెరుగుతున్న అభద్రతను ఆసక్తికరంగా చూపిస్తోంది దర్శకుడు డేనియల్ లోంబ్రోసో రూపొందించిన Manhood డాక్యుమెంటరీ. ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఆధునిక పురుషత్వం పేరుతో సాగుతున్న మరో కొత్త వ్యాపార ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది.
ఒక్కో విజిట్‌కు రూ.3.5 లక్షలు!
అమెరికాలోని టెక్సాస్‌లో డల్లాస్ నగరానికి వెళ్తే AdvancedYou అనే వెల్నెస్ క్లినిక్ కనిపిస్తుంది. యాంటీ ఏజింగ్, బయోహ్యాకింగ్, సౌందర్య చికిత్సలు అందించే ఈ క్లినిక్‌ను బిల్ మూర్ నిర్వహిస్తున్నాడు. అయితే అక్కడ అందించే చికిత్సల్లో ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి రేపుతున్నది మాత్రం పురుషాంగం మందం పెంచే PhalloFill విధానం.
ఈ చికిత్సలో పురుషాంగానికి డెర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్లు ఇస్తారు. దీనివల్ల పొడవు పెరగదు కానీ మందం పెరుగుతుందని చెబుతున్నారు. సాధారణంగా ముఖానికి వాల్యూమ్ తీసుకురావడానికి, పెదవుల ఆకృతిని మార్చడానికి ఉపయోగించే ఫిల్లర్ల తరహాలోనే ఈ విధానాన్ని కూడా రూపొందించారు. బిల్ మూర్కు ఈ చికిత్సపై చాలా నమ్మకం ఉంది.
ఒకప్పుడు జుట్టు తిరిగి పెరిగేందుకు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్సను ఉపయోగించిన తొలి వెల్నెస్ నిపుణుల్లో తానొకడినని చెప్పుకునే ఆయన.. ఇప్పుడు తన PhalloFill విధానాన్ని కూడా బొటాక్స్లాగా సాధారణ చికిత్సగా మార్చాలనుకుంటున్నాడు.
అంటే ముఖానికి బొటాక్స్ చేయించుకోవడం ఎంత సాధారణమైందో, పురుషులు కూడా తమ అంగం మందం పెంచుకోవడానికి క్లినిక్‌లకు వెళ్లడం అంతే సాధారణం కావాలన్నది అతడి ఆలోచన. ఈ వ్యాపారంలో ఉన్న అవకాశాలను చూస్తే అది అంత అసాధ్యమైన లక్ష్యంలా కూడా అనిపించదు.
ఈ చికిత్స చేయించుకుంటున్నది ఎవరు? షాకింగ్ విషయాలు!
ఈ చికిత్సల గురించి తెలుసుకోవడానికి దర్శకుడు లోంబ్రోసో బిల్ మూర్ క్లినిక్‌కు వెళ్లినప్పుడు రకరకాల వ్యక్తులను కలిశాడు. మెగాచర్చ్ పాస్టర్ నుంచి బోర్డర్ పెట్రోల్ అధికారులు, బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తి వరకు చాలామంది అక్కడికి వస్తున్నారు. వీళ్లందరి జీవితాలు వేరు, నేపథ్యాలు వేరు. కానీ తమ శరీరం విషయంలో మాత్రం ఒకే రకమైన అసంతృప్తి కనిపిస్తోంది.
ఈ డాక్యుమెంటరీలో డేవిడ్, రూబెన్ కథలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. డేవిడ్‌కు 24 ఏళ్లు. అతడు గే OnlyFans క్రియేటర్. మతపరమైన కారణాలతో తల్లి అతడిని దూరం పెట్టింది. గతంలో చేయించుకున్న ఒక చికిత్స వికటించడంతో సమస్యలు ఎదుర్కొంటున్న అతడు మళ్లీ AdvancedYou క్లినిక్‌ను ఆశ్రయిస్తాడు. మరోవైపు రూబెన్ ఐదుగురు పిల్లల తండ్రి. ఉద్యోగం లేకపోవడంతో అప్పుడప్పుడు స్టాండప్ కామెడీ చేస్తుంటాడు. జో రోగన్ పాడ్‌కాస్ట్‌లు వినే అతడికి కూడా తన శరీరం విషయంలో కొన్ని అభద్రతలు ఉన్నాయి.
అయితే దర్శకుడిని ఆశ్చర్యపరిచిన అసలు విషయం వేరే ఉంది. ఈ చికిత్స చేయించుకుంటున్న వారిలో సుమారు 75 శాతం మంది స్ట్రెయిట్ పురుషులేనని అతడు అంచనా వేశాడు. ఇలాంటి చికిత్సలపై ఆసక్తి స్వలింగ సంపర్కుల్లోనే ఎక్కువగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి సంప్రదాయవాద భావజాలం ఉన్న స్ట్రెయిట్ పురుషులు కూడా పెద్ద సంఖ్యలో ఈ క్లినిక్‌లకు వస్తున్నారని అతడు గుర్తించాడు.
పురుషత్వంపై అపోహలే అసలు సమస్యా?
వారి నేపథ్యాలు వేరైనా, తమ గురించి తాము తక్కువగా భావించడం, ఇతరులతో పోల్చుకుని సిగ్గుపడటం, సామాజికంగా ఒంటరిగా మిగిలిపోతామనే భయం మాత్రం అందరిలోనూ కనిపించిందని దర్శకుడు చెబుతున్నాడు. నిజానికి పురుషాంగం పరిమాణానికి, ఒక వ్యక్తి పురుషత్వానికి, ఆత్మవిశ్వాసానికి సంబంధం ఏమిటనే ప్రశ్న ఇక్కడ కీలకంగా మారుతుంది.
సమాజంలో చాలాకాలంగా కొనసాగుతున్న కొన్ని అపోహలు ఈ విషయంలో పురుషులపై తెలియకుండానే ఒత్తిడి పెంచుతున్నాయి. శరీర పరిమాణమే లైంగిక సామర్థ్యానికి కొలమానం అన్నట్లుగా మాట్లాడటం, అంగం పరిమాణాన్ని బలానికి చిహ్నంగా చూడటం వంటివి కొందరిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
డాక్యుమెంటరీలో రూబెన్ తన స్టాండప్ కామెడీ ప్రదర్శనకు ముందు ఓ బార్లో ఒక వ్యక్తితో సినిమా గురించి మాట్లాడతాడు. ఇది మానసిక ఆరోగ్యం గురించి, ఇలాంటి చికిత్సలను సాధారణంగా చూడాల్సిన అవసరం గురించి చెబుతున్న చిత్రమని వివరిస్తాడు. దానికి ఆ వ్యక్తి నవ్వుతూ స్పందిస్తాడు. చిన్న పరిమాణంలో ఉండటం వల్ల ఎవరైనా పిచ్చివాళ్లవుతారా? అన్నట్లుగా ప్రశ్నిస్తాడు.
ఈ చిన్న సందర్భంలోనే ఈ సమస్యపై సమాజంలో ఉన్న భిన్నమైన ఆలోచనలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరికీ ఈ పరిమాణంపై అభద్రత ఉంటుందని చెప్పలేం. కానీ కొందరిలో ఆ భావన ఎంత బలంగా పాతుకుపోయిందంటే, దాన్ని మార్చుకోవడానికి ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న వ్యాపారులకు అదే అసలైన పెట్టుబడిగా మారుతోంది.
ఒక్కసారి మొదలుపెడితే జీవితాంతం డబ్బులు కట్టాల్సిందే!
ఈ వ్యాపారంలో అత్యంత చిత్రమైన విషయం చికిత్స ధరలోనే ఉంది. ఒక్కోసారి PhalloFill చేయించుకోవడానికి సుమారు 2,500 నుంచి 4,000 డాలర్లు ఖర్చవుతుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు. అంత డబ్బు పెట్టి ఒకసారి చికిత్స చేయించుకుంటే సరిపోతుందా అంటే అదీ లేదు.
కావాల్సిన ఫలితం రావాలంటే మూడు, నాలుగు, ఐదు సార్లు కూడా క్లినిక్‌కు రావాలని బిల్ మూర్ ప్రోత్సహిస్తాడు. అంతేకాదు, పెంచుకున్న మందాన్ని కొనసాగించుకోవాలంటే ఏడాదికి ఒకసారి మళ్లీ చికిత్స చేయించుకోవాలని చెబుతాడు. అంటే ఒకసారి క్లినిక్‌లోకి అడుగుపెట్టిన వ్యక్తి అక్కడితో ఆగకుండా ఏటా డబ్బులు ఖర్చు చేసే కస్టమర్‌గా మారిపోతాడు.
దీన్ని చూస్తుంటే మొబైల్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ మోడల్ గుర్తుకు వస్తుంది. నెలకోసారి లేదా ఏడాదికోసారి డబ్బులు కడితేనే సేవలు కొనసాగినట్లుగా, ఇక్కడ కూడా కోరుకున్న శారీరక మార్పును కొనసాగించుకోవాలంటే మళ్లీ మళ్లీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి. అయితే ఇది సాధారణ సబ్స్క్రిప్షన్ కాదు. ఒక వ్యక్తి తన శరీరం గురించి కలిగిన అసంతృప్తిని ఆధారంగా చేసుకున్న వ్యాపారం.
ఈ విధానంపై యూరాలజీ నిపుణుడు పాల్ పెరిటో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి చికిత్సలు ఒకప్పుడు యూరాలజిస్టుల పరిధిలో ఉండేవని, ఇప్పుడు కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయని ఆయన విమర్శించాడు. PhalloFill ఇప్పటికే అమెరికాలో 32 క్లినిక్‌లకు విస్తరించినట్లు డాక్యుమెంటరీ వెల్లడించింది.
అందంగా కనిపించాలనే పోటీ.. పురుషులనూ వదలడం లేదు!
అమెరికాలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే విషయంలో పురుషులు అత్యంత వేగంగా పెరుగుతున్న జనాభా విభాగంగా మారుతున్నారని International Society of Aesthetic Plastic Surgery గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా Gen Z, మిలీనియల్స్‌లో శస్త్రచికిత్స అవసరం లేని కాస్మెటిక్ చికిత్సలు కూడా విస్తరిస్తున్నాయి.
శరీరాన్ని మార్చగలరు.. కానీ మనసులోని ఖాళీని?
డాక్యుమెంటరీలో ఒక వ్యక్తి ఆపరేషన్ టేబుల్‌పై పడుకుని ఉండగా బిల్ మూర్ అతడికి ఇంజెక్షన్లు ఇస్తుంటాడు. ఆ సమయంలో పురుషాంగం పరిమాణాన్ని బలానికి, పురుషత్వానికి చిహ్నంగా చూడటంపై ఆ వ్యక్తి తన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. సమాజంలో ఇలాంటి అపోహలు ఎంత బలంగా ఉన్నాయో వివరిస్తాడు.
అయితే ఈ చికిత్సలతో నిజంగా సమస్య పరిష్కారమవుతుందా? ఈ ప్రశ్నకు ప్రోస్తెటిక్ యూరాలజీ నిపుణుడు అలెక్స్ టాటెమ్ చెప్పిన సమాధానం డాక్యుమెంటరీలో బలంగా వినిపిస్తుంది. ఫిల్లర్లతో పురుషాంగానికి వాల్యూమ్ తీసుకురావచ్చని, కానీ ఒక వ్యక్తి మనసులో ఉన్న వెలితిని మాత్రం నింపలేమని ఆయన అంటాడు. శరీరంలో మార్పులు తీసుకురావడం సాధ్యమే కానీ ఆత్మవిశ్వాసాన్ని ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం సాధ్యం కాదన్నది ఆయన మాటల్లోని అసలు అర్థం.
చికిత్స కోసం ఇల్లు వదిలిన వ్యక్తి.. వ్యాపారం వెనుక మరో విషాదం!
ఈ డాక్యుమెంటరీలో రూబెన్ కథ మరింత ఆలోచింపజేస్తుంది. మొదట తనలోని అభద్రతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో చికిత్స ప్రారంభించిన అతడు, క్రమంగా దానిపై భారీగా డబ్బు ఖర్చు చేస్తాడు. చివరకు ఆ ఖర్చులు కుటుంబ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయి. భార్యతో కలిసి తమ ఇంటిని వదిలి ఫీనిక్స్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన మొదటి బిడ్డ తల్లితో కలిసి అక్కడికి మారిపోతాడు.
తమ అవసరాలన్నింటికీ సరిపడా డబ్బు సంపాదించలేకపోయామని రూబెన్ చెప్పే మాటలు ఈ వ్యవహారంలో అసలు విషాదాన్ని బయటపెడతాయి. ఒకప్పుడు తనలోని అసంతృప్తిని తొలగించుకోవడానికి మొదలుపెట్టిన ప్రయాణం, చివరకు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే స్థాయికి చేరింది.
చివరకు….
‘Manhood’ చెప్పే విషయం ఒక్కటే. పురుషులు తమ శరీరం గురించి అసంతృప్తిగా ఉండటం కొత్తేమీ కాదు. కానీ ఆ అసంతృప్తిని తొలగిస్తామంటూ ఒక పరిశ్రమ పుట్టుకొస్తే, మనిషి తన శరీరాన్ని మార్చుకోవడానికి మాత్రమే కాదు.. తన అభద్రతను కాపాడుకోవడానికి కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







