ఎల్‌నినో భీకర రూపం.. డిసెంబర్లోనే గరిష్ఠ స్థాయికి! 2027లో వాతావరణ విలయం తప్పదా?
మనకు నీళ్ళు కావాలంటే వర్షాలు పడాలి.. వేడి తగ్గాలంటే చల్లటి వాతావరణం రావాలి. కానీ ప్రకృతి ఎప్పుడూ మనం కోరుకున్నట్టుగా నడుచుకోదు. భూమికి ఒకవైపు భారీ వర్షాలు కురిపిస్తూ, మరోవైపు కరువుతో అల్లాడించగలదు. ఇప్పుడు ప్రపంచ వాతావరణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నది కూడా ఇలాంటి పరిణామమే.
పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ఎల్‌నినో (El Niño) సాధారణ స్థాయిని దాటి అత్యంత బలమైన దశలోకి వెళ్లిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇది ఇంకా తన గరిష్ఠ స్థాయికి చేరుకోలేదు. 2026 డిసెంబర్లో ఎల్‌నినో ప్రభావం పతాక స్థాయికి చేరుకోవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనా వేస్తోంది. అంటే ఈ ఏడాది చివర్లో మొదలయ్యే వాతావరణ మార్పుల ప్రభావం 2027లోనూ ప్రపంచ దేశాలను వెంటాడే అవకాశం ఉందన్నమాట.
పసిఫిక్ సముద్రంలో అసలేం జరుగుతోంది?
ఎల్‌నినో గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ దీని వెనుక జరిగే అసలు ప్రక్రియ గురించి తెలుసుకుంటే ఇప్పుడు ఎందుకింత ఆందోళన వ్యక్తమవుతోందో అర్థమవుతుంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల కదలికలు, వర్షపాత నమూనాలు మారిపోతాయి.
ఈ మార్పుల ప్రభావం ఒక దేశానికో, ఒక ఖండానికో పరిమితం కాదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో కూడా వాతావరణ పరిస్థితులను మార్చగలదు. ఎక్కడో వర్షాలు ఎక్కువ కావచ్చు.. మరెక్కడో వర్షాలు ముఖం చాటేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వేడి తీవ్రత పెరిగితే, ఇంకొన్ని చోట్ల వరదల ముప్పు పొంచి ఉండొచ్చు.
ఈసారి పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేగం నిపుణులను మరింత ఆశ్చర్యపరుస్తోంది. NOAA ప్రమాణాల ప్రకారం ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికే ఎల్‌నినో ‘వెరీ స్ట్రాంగ్’ కేటగిరీలోకి వెళ్లిపోయింది.
అయితే రానున్న నెలల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబర్ 2026 నుంచి జనవరి 2027 మధ్య సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3.8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని WMO అంచనా వేస్తోంది. ఈ పెరుగుదల డిసెంబర్లో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని చెబుతోంది.
గత నాలుగు దశాబ్దాల లెక్కలే సరిపోవడం లేదా?
ఈ పరిణామం ఎంత అసాధారణమైనదో చెప్పడానికి WMO సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. గత నాలుగు దశాబ్దాలుగా ఎల్‌నినోను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న ప్రమాణాల పరిధిని కూడా ప్రస్తుత ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయని ఆమె పేర్కొన్నారు. 2026 చివరి నాటికి ఎల్‌నినో తన గరిష్ఠ స్థాయికి చేరుకున్నా, దాని ప్రభావాలు మాత్రం అంత త్వరగా ముగిసిపోవని స్పష్టం చేశారు. అంటే డిసెంబర్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయంటే జనవరి నుంచి పరిస్థితులు సాధారణమైపోతాయని అనుకోవడానికి లేదు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఎల్‌నినో తీవ్రతను కొలవడానికి శాస్త్రవేత్తలు రెండు రకాల ప్రమాణాలను ఉపయోగిస్తున్నారు. NOAA 2026 ఫిబ్రవరిలో కొత్తగా ప్రవేశపెట్టిన Relative Oceanic Niño Index (RONI) పద్ధతిలో సముద్రాల్లో ఇప్పటికే ఉన్న సాధారణ ఉష్ణోగ్రతల పెరుగుదలను కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఈ పద్ధతిలో తాజా ఉష్ణోగ్రతల పెరుగుదల 2 డిగ్రీలుగా నమోదైంది. పాత Oceanic Niño Index (ONI) పద్ధతిలో మాత్రం జూలై-సెప్టెంబర్ మధ్యే ఈ పెరుగుదల 2.2 డిగ్రీలకు చేరగా, ఆగస్టు-అక్టోబర్ మధ్య 2.5 డిగ్రీలకు పెరిగింది. రెండు లెక్కలూ చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా మారుతోందో అర్థమవుతుంది.
NOAA అంచనాలు కూడా అంతగా ఊరటనిచ్చేలా లేవు. 2027 జనవరి నుంచి మార్చి వరకు బలమైన లేదా అత్యంత బలమైన ఎల్‌నినో కొనసాగవచ్చని చెబుతోంది. అంతేకాదు, నవంబర్ 2026 నుంచి జనవరి 2027 మధ్య 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్నినోగా ఇది చరిత్ర సృష్టించే అవకాశం 70 శాతంగా అంచనా వేసింది. అంటే ఇప్పటివరకు ప్రపంచం చూసిన బలమైన ఎల్‌నినో ఘటనల రికార్డులను కూడా ఈసారి అధిగమించే అవకాశం ఉందన్నమాట.
ఒకచోట వరదలు.. మరోచోట కరువు!
ఎల్‌నినో ప్రభావంలో అసలు సమస్య ఇదే. ప్రపంచమంతా ఒకే రకమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోదు. ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుంటే, మరో ప్రాంతంలో చినుకు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావచ్చు. WMO తాజా అంచనాల ప్రకారం దక్షిణ ఆఫ్రికాలో వర్షాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆగ్నేయాసియాలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య అమెరికా, అమెజాన్ ప్రాంతాల్లో కరువు ముప్పు పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాలు తగ్గితే అక్కడి ప్రజలకు తాగునీటి సమస్యతో పాటు వ్యవసాయంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. పంటల దిగుబడులు తగ్గితే ఆహార సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. చివరికి ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.
అంటే ఎల్‌నినో ప్రభావం కేవలం వాతావరణానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు.. వ్యవసాయం నుంచి ఆహార ధరల వరకు, ప్రజల జీవనోపాధి నుంచి ప్రభుత్వాల ఆర్థిక ప్రణాళికల వరకు చాలా విషయాలను ప్రభావితం చేయగలదు.
2027 కోసం ప్రపంచం ఇప్పటి నుంచే సిద్ధం కావాలా?
అయితే ఎల్‌నినో వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా తప్పనిసరిగా విపత్తులే సంభవిస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదని WMO చెబుతోంది. ముందస్తు వాతావరణ హెచ్చరికలు అందుబాటులో ఉన్నప్పుడు ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. ఎక్కడ వర్షాలు తగ్గే అవకాశం ఉందో అక్కడ నీటి నిల్వలు, వ్యవసాయ ప్రణాళికలపై దృష్టి పెట్టవచ్చు.
భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే ఆర్థిక స్థోమత లేని పేద, బలహీన వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడం అత్యంత కీలకం. ఈ విషయాలని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జెంటీనాకు చెందిన ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సెలెస్టే సౌలో సూచించి హెచ్చరించారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







