కన్నవారిని విస్మరిస్తే వేతనంలో కోత.. తెలంగాణ ప్రభుత్వ కీలక అడుగు
ఆధునిక జీవనశైలి, ఉరుకుల పరుగుల ఉద్యోగ బాధ్యతల మధ్య మానవ సంబంధాలు బలహీనపడుతున్న ప్రస్తుత తరుణంలో, వృద్ధుల సంరక్షణ ఒక తీవ్రమైన సామాజిక సవాలుగా మారింది. ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడిన పిల్లలు సైతం, తమను పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో గాలికొదిలేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సామాజిక రుగ్మతకు అడ్డుకట్ట వేస్తూ, వయోవృద్ధులకు ఆర్థిక భరోసాతో పాటు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఆచరణలోకి తెస్తోంది. “తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ చట్టం-2026” అమలుకు సంబంధించిన ముసాయిదా విధివిధానాలను సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ తాజాగా ఖరారు చేసి, ప్రభుత్వ తుది ఆమోదం కోసం పంపింది.
గత ఏప్రిల్లో గవర్నర్ ఆమోదముద్ర వేసిన ఈ చట్టం, కేవలం నైతిక బాధ్యతగానే కాకుండా చట్టపరమైన జవాబుదారీతనంతో ప్రభుత్వ ఉద్యోగులను కట్టడి చేయనుంది. తాజా నిబంధనల ప్రకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ వేతనంలో 15 శాతం లేదా రూ.10,000 (ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది) నేరుగా కోత విధిస్తారు. ఇలా మినహాయించిన మొత్తాన్ని సంబంధిత శాఖలే నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాయి. ఒకవేళ ఒకే కుటుంబానికి చెందిన ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే, తల్లిదండ్రుల పోషణ బాధ్యతను వారి మధ్య సమానంగా లేదా నిబంధనల ప్రకారం విభజిస్తారు. కుమారులతో పాటు వివాహిత కుమార్తెలు, దత్తత తీసుకున్న పిల్లలు సైతం ఈ చట్టం పరిధిలోకి రావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
బాధిత తల్లిదండ్రులు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, జిల్లా స్థాయిలోనే వేగవంతమైన పరిష్కారానికి ప్రభుత్వం యంత్రాంగాన్ని రూపొందించింది. తమకు సరైన జీవనాధారం లేదని, పిల్లలు పట్టించుకోవడం లేదని భావించే తల్లిదండ్రులు తమ ఆదాయ వనరుల వివరాలను జతచేస్తూ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక అథారిటీకి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందిన 10 రోజుల్లోగా సంబంధిత ఉద్యోగికి ఫిర్యాదు కాపీలతో కూడిన నోటీసులను అథారిటీ జారీ చేస్తుంది. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఉద్యోగి తన వాదన వినిపించుకునే అవకాశం కల్పిస్తారు. అయితే, ఉద్దేశపూర్వకంగా నోటీసులకు స్పందించకపోయినా, విచారణకు గైర్హాజరైనా ఉద్యోగి వేతనంలో కోత విధిస్తూ ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేసే విశేషాధికారాలను అథారిటీకి కల్పించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో జాప్యానికి తావులేకుండా ఈ ప్రక్రియకు కచ్చితమైన గడువు విధించారు. ఫిర్యాదు అందిన నాటి నుంచి 60 రోజుల్లోగా జిల్లా అథారిటీ విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలి. ఉత్తర్వులు వెలువడిన తర్వాత, సంబంధిత ప్రభుత్వ విభాగాలు మరో 60 రోజుల్లోగా జీతంలో కోత ప్రక్రియను అమలు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి అథారిటీ తీర్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, బాధితులు లేదా ఉద్యోగులు రాష్ట్ర స్థాయి సీనియర్ సిటిజన్స్ కమిషన్ను ఆశ్రయించి అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ చట్టం పూర్తిస్థాయి విధివిధానాలు అధికారికంగా అమల్లోకి రాకముందే, రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు ఇప్పటికే 5 ఫిర్యాదులు అందడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో హైదరాబాద్ నుంచి మూడు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన ‘తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007’ కంటే భిన్నంగా, తెలంగాణ చట్టం నేరుగా జీతం నుంచే కోత విధించే కఠిన నిబంధనను తీసుకురావడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో తెచ్చిన ఈ చట్టం, ఇతర రంగాల ఉద్యోగులకు కూడా ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. అయితే, క్షేత్రస్థాయిలో అథారిటీలు ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా 60 రోజుల గడువులోగా నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే ఈ చట్టం అసలు లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వ తుది ఆమోదంతో ఈ నిబంధనలు అమల్లోకి వస్తే, వృద్ధాప్యంలో ఆదరణ కరువైన ఎందరో తల్లిదండ్రులకు ఇది ఒక బలమైన రక్షణ కవచంగా మారనుంది.







