గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ సమరశంఖం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) సమరశంఖం పూరించింది. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనలతో ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇద్దరు గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు విజయసూచికగా వీరతిలకం దిద్దిన కవిత, ప్రచార రథాలను జెండా ఊపి క్షేత్రస్థాయిలోకి పంపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువత, విద్యావంతుల భాగస్వామ్యంతో సరికొత్త ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మిస్తామని తేల్చిచెప్పారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బలహీన వర్గాలకు, విద్యావంతులకు ప్రాధాన్యం కల్పిస్తూ టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నలమాస శ్రీకాంత్ గౌడ్, హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానం నుంచి కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన కొల్లూరు ఆకాశ్‌లను బరిలోకి దించింది. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా కుమ్మరి వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, తమ పార్టీ ఆ అణగారిన వర్గాల ప్రతినిధులను చట్టసభలకు పంపేందుకు నడుం బిగించిందని కవిత స్పష్టం చేశారు. యువత, జర్నలిస్టులు, ఉద్యమకారులు చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే ప్రజా సమస్యలపై నిజమైన చర్చ జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యావంతుల సంఖ్య లక్షల్లో ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కనీసం 10 లక్షలకు కూడా చేరుకోకపోవడంపై కవిత విచారం వ్యక్తం చేశారు. అర్హులైన పట్టభద్రులందరూ చేతులు జోడించి కోరుతున్నానని, వెంటనే ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత, విద్యావంతులు రాజకీయాల పట్ల ఉదాసీనంగా ఉండకుండా చురుగ్గా పాల్గొన్నప్పుడే వ్యవస్థలో మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఉన్న గ్రాడ్యుయేట్లను చైతన్యవంతం చేసి, ఓటు హక్కు నమోదుతో పాటు ఎన్నికల్లో సరైన నాయకత్వానికి ఓటు వేసేలా చూడాలని సూచించారు.
పాలక కాంగ్రెస్ వైఖరిపై కవిత ఘాటుగా స్పందించారు. “ప్రభుత్వ అభ్యర్థులను గెలిపించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రూ. 200 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారట… కానీ తెలంగాణ యువత, మేధావులు తమ ఓట్లను డబ్బులకు అమ్ముకునే స్థితిలో లేరు” అని ఆమె హెచ్చరించారు. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ ఫ్యూజ్ ఎగిరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పట్టభద్రులు తమ ఓటుతోనే గట్టిగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.
కేవలం సంప్రదాయ ప్రచారానికే పరిమితం కాకుండా, విస్త్రృత ప్రజానీకాన్ని, ప్రజాసంఘాలను ఏకం చేసే సరికొత్త ప్రణాళికను పార్టీ సిద్ధం చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ప్రజలను మోసం చేశాయని, ఈ రెండు పార్టీలకు ఝలక్ ఇవ్వాలంటే విద్యావంతులైన ఓటర్లు ఏకం కావాలని కోరారు. ఖమ్మం, నల్గొండ వంటి ప్రజా ఉద్యమాల గడ్డపై కమ్యూనిస్ట్ పార్టీల నేతలను కలిసి మద్దతు కోరతామని కవిత వెల్లడించారు. పెద్ద ఎత్తున నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సమాఖ్యలు, విద్యా సంస్థలు, మేధావి వర్గాలతో వరుస భేటీలు నిర్వహించేందుకు ప్రత్యేక వార్‌రూమ్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు.
పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ల వ్యవహారం, ప్రైవేటు ఉద్యోగుల హక్కులపై శాసనమండలిలో గళం విప్పేందుకు నికార్సైన పోరాట యోధులు అవసరమని టీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేస్తోంది. అధికార పక్షానికి తలొగ్గని, ప్రతిపక్షంగా విఫలమైన పార్టీలను పక్కనపెట్టి, ప్రజా పక్షాన పోరాడే టీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన తనదైన బలమైన ముద్ర వేసేందుకు ఈ ఎన్నికలను ప్రధాన వేదికగా మలుచుకుంటోంది.







