రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విరమణే లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో రెండు రోజుల పాటు త్రైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి.
యూఏఈ రాజధాని అబుధాబీ వేదికగా చర్చలు కొనసాగుతున్నాయి.. భవిష్యత్తు భద్రతపై రెండు దేశాలకూ హామీలు ఇవ్వడంపై ఈసారి చర్చలు సాగుతున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. నాటోతో తమకు ముప్పు ఉందని రష్యా భావిస్తోంది. రష్యా మరోసారి తమపైకి విరుచుకుపడకుండా హామీ కావాలని ఉక్రెయిన్ కోరుకుంటోంది. ఇరుపక్షాల మధ్య పెరిగిన దూరం దృష్ట్యా శాంతి ఒప్పందం రాత్రికి రాత్రే సాధ్యం కాకపోవచ్చని, ఓపికగా చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని అమెరికా ఉన్నతాధికారులు అంటున్నారు.
తొలిరోజు ఎవరి వాదనను వారు బలంగా వినిపించారు. నాటోలో చేరే ప్రయత్నాలను ఉక్రెయిన్ విరమించుకోవాలని, ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాల నుంచి ఆ దేశ బలగాలు వైదొలగాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్టుబడుతున్నారు. సైనికులు, ఆయుధాల పరంగా ఆంక్షలకు అంగీకరించాలని చెబుతున్నారు. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ససేమిరా అంటున్నారు. రెండు దేశాల మధ్య విభేదాలను ఎలా పరిష్కరించాలో కొన్ని మంచి ఆలోచనలు వచ్చినట్లు భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ఆ దేశ ప్రతినిధి జేర్డ్ కుష్నర్ చెప్పారు. అగ్రరాజ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్తో కలిసి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. పుతిన్ సన్నిహితుడైన మెదిన్స్కీ రష్యా తరఫున ప్రధానంగా చర్చలు సాగిస్తున్నారు.
చర్చలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో అత్యంత సవాలుతో కూడిన కాల్పుల విరమణ అమలు తీరుతెన్నులపై దృష్టి సారిస్తారు. తాత్కాలికంగా యుద్ధం ఆపిన సమయంలో ఏ పక్షమూ తిరిగి సైనిక బలగాలను మోహరించుకోకుండా, ఆయుధాలు సమకూర్చుకోకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది మొదటి అంశం. ఇరు దేశాల పరస్పర అనుమానాలే శాంతికి ప్రధాన అవరోధమని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు.
రెండో దశ చర్చల్లో ప్రధాన అంశం- భూభాగం. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న దొనెట్స్క్ ప్రాంతం మొత్తాన్ని తమకే ఇవ్వాలని రష్యా పట్టుబడుతుండగా, ప్రస్తుత సరిహద్దుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ఉక్రెయిన్ ప్రతిపాదిస్తోంది. ఉక్రెయిన్ భవిష్యత్తు భద్రతా వ్యవహారం కొలిక్కి వచ్చేవరకు సరిహద్దుల అంశం తేలదని అమెరికా భావిస్తోంది.
బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీతో పాటు నాటో, ఈయూ ప్రతినిధులతో ఉక్రెయిన్ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. రష్యాపై ఆర్థిక ఆంక్షలను దశలవారీగా ఎత్తివేయడం, ఒప్పందం ఉల్లంఘిస్తే తిరిగి వాటిని అమల్లోకి తేవడం వంటి సున్నితమైన ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఒకపక్క చర్చలు జరుగుతుండగా మరోపక్క రష్యా, ఉక్రెయిన్ దాడులు కొనసాగిస్తున్నాయి.







