కర్నూలు జడ్పీ పీఠం ఎవరికి..?
రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఇప్పుడు అందరి దృష్టి జిల్లా పరిషత్ (ZP) ఛైర్మన్ పీఠాలపై పడింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీలోని ఆశావహుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక పీఠం కోసం కౌతాళం జెడ్పీటీసీ చుడీ ఉలిగయ్య మరియు దేవనకొండ జెడ్పీటీసీ షేక్ సాదిక్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతలూ తమ తమ సామాజికవర్గ సమీకరణాలు, నియోజకవర్గాల బలాన్ని చూపిస్తూ అధిష్టానం పెద్దల వద్ద ముమ్మరంగా లాబీయింగ్ సాగిస్తుండటంతో కూటమి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ రేసులో కౌతాళం జెడ్పీటీసీ చుడీ ఉలిగయ్యకు మద్దతుగా వాల్మీకి సామాజికవర్గ సంఘాలు గట్టిగా రంగంలోకి దిగాయి. కర్నూలు జిల్లాలో అత్యంత కీలకమైన వాల్మీకి సామాజికవర్గానికి న్యాయం చేయాలంటూ, చుడీ ఉలిగయ్యకు జడ్పీ ఛైర్మన్ పదవిని కేటాయించాలని కోరుతూ వాల్మీకి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా లేఖలు రాశారు. జిల్లా రాజకీయాల్లో ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న ఉలిగయ్య లాంటి వెనుకబడిన వర్గాల నేతకు ఈ అత్యున్నత పదవి ఇస్తే జిల్లా వ్యాప్తంగా పార్టీకి భారీ మైలేజ్ వస్తుందని వారు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, పశ్చిమ కర్నూలు జిల్లా పరిధిలోని మంత్రాలయం నియోజకవర్గానికి ఈసారి ఎలాగైనా జడ్పీ ఛైర్మన్ పదవిని ఇవ్వాలని స్థానిక నాయకత్వం గట్టిగా పట్టుబడుతోంది. భౌగోళిక సమీకరణాల పరంగా చూసినా మంత్రాలయం బెల్ట్‌కు ప్రాధాన్యత ఇస్తేనే బాగుంటుందని స్థానిక లీడర్లు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, దేవనకొండ జెడ్పీటీసీ అయిన షేక్ సాదిక్ కూడా మైనారిటీ సమీకరణాలను బేస్ చేసుకుని పదవిని ఆశిస్తుండటంతో అధినేత చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక బ్యాలెన్స్, రాబోయే రాజకీయ ప్రయోజనాలను లెక్కగట్టి చంద్రబాబు తీసుకునే తుది నిర్ణయం కోసమే కర్నూలు తమ్ముళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







