అది ‘యాంటీ భారత్ సమ్మిట్’: బీజేపీ
హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నిప్పులు చెరిగారు. ఇది తెలంగాణ అభివృద్ధి కోసమో లేదా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకో ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమం కాదని, కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ వేదికలను అడ్డం పెట్టుకుని దేశ వ్యతిరేక శక్తులతో కలిసి రచిస్తున్న రాజకీయ వ్యూహమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ‘భారత్ సమ్మిట్’ కాదని, ముమ్మాటికీ దేశ సమగ్రతను దెబ్బతీసే ‘యాంటీ భారత్ సమ్మిట్’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదట్లో ఈ సదస్సు ప్రకటన వచ్చినప్పుడు రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయని, తెలంగాణ పారిశ్రామిక రంగానికి మేలు జరుగుతుందని అంతా భావించారని రామచందర్ రావు పేర్కొన్నారు. అయితే తెరవెనుక ఉన్న వాస్తవాలు పరిశీలిస్తే, ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కాదని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అంతర్గత రాజకీయ ప్రచార కార్యక్రమమని తేటతెల్లమైందన్నారు. కేవలం రాహుల్ గాంధీ ఆలోచనలను ప్రతినిధుల ముందు ప్రవేశపెడతామని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ బాహాటంగానే ప్రకటించారని, దీని అసలు ఉద్దేశం రాహుల్ గాంధీని మళ్లీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రీ లాంచ్ చేయడమేనని ఆయన విమర్శించారు.
ఇవి కూడా చదవండి
శామ్ పిట్రోడా నేతృత్వంలోని ‘ప్రోగ్రెస్ అలయన్స్’ ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరవుతున్నారనే విషయాన్ని రామచందర్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. భారత్‌పై నిరంతరం వ్యతిరేక ప్రచారం చేసే జార్జ్ సొరోస్ వంటి వివాదాస్పద వ్యక్తుల ప్రభావం ఈ కూటమిపై ఉందని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసే రెజీమ్ చేంజ్ కుట్రల్లో ఇలాంటి సంస్థల ప్రమేయం ఉందని గుర్తుచేశారు. ఫ్రాన్స్, అల్బేనియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో తీవ్రమైన రాజకీయ అస్థిరతకు, హింసాత్మక పరిణామాలకు కారణమైన శక్తులతో కాంగ్రెస్ చేతులు కలపడం దేశ భద్రతకే గొడ్డలిపెట్టని హెచ్చరించారు. గాంధీ కుటుంబానికి.. ముఖ్యంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఈ అంతర్జాతీయ శక్తులతో ఉన్న రహస్య బంధాలేమిటో దేశ ప్రజలకు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సదస్సుకు 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, అందులో దాదాపు 42 దేశాలు ఇస్లామిక్ దేశాలు కాగా, మిగిలిన దేశాల నుంచి వచ్చే వారిలో అత్యధికులు తీవ్రవాద వామపక్ష భావజాలం కలవారేనని రామచందర్ రావు విమర్శించారు. వీటిలో అత్యధికం నిజమైన ప్రజాస్వామ్య విలువలు పాటించని దేశాలని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు నిలయమైన హైదరాబాద్‌ను దేశ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలకు, సమాజంలో అలజడులు రేపే ఆలోచనలకు అడ్డాగా మార్చేందుకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. స్థానికంగా జరిగే ఈ పరిణామాల వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలు బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చి 6 గ్యారెంటీలు ఇస్తామని మాయమాటలు చెప్పిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. హామీలను గాలికొదిలేసి ప్రజలను వంచించిన వీరికి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతిక అర్హత లేదన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతూ హైదరాబాద్‌లో అరాచకం సృష్టించేందుకు యత్నిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనను రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తామని, వారు ఎక్కడ అడుగుపెట్టినా ప్రజా క్షేత్రంలో నిరసనలతో అడ్డుకుంటామని రామచందర్ రావు స్పష్టం చేశారు.







