చైనా సరిహద్దుల్లో భారత్ కదనభేరీ.. భారీ యుద్ధవిన్యాసాలకు రంగం సిద్దం..!
పొరుగున ఉన్న కమ్యూనిస్టు చైనా.. ఎప్పుడు పొరుగుదేశాల్ని కవ్విస్తూనే ఉంటుంది. సమయం కలిసొస్తే, సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తుంది. కొంత ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. తర్వాత అక్కడ గ్రామాలు వెలుస్తాయి. ఇది చైనా యుద్ధతంత్రం.. ఓ రకంగా చెప్పాలంటే డ్రాగన్ యుద్దవ్యూహమిది. అయితే .. లేటెస్టుగా అలాంటి చైనాకు గట్టి హెచ్చరిక పంపేదిశగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. సరిహద్దుల్లో వైమానిక దళ విన్యాసాలకు రంగం సిద్ధం చేసింది.
ఉత్తరాఖండ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో నవంబర్ 13 నుంచి 21 వరకు వారం రోజుల పాటు భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించనుంది. ఈ మేరకు సంబంధిత ప్రాంతంలోని గగనతలానికి సంబంధించి NOTAM (Notice to Airmen) జారీ చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం హిమాలయాల వంటి అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో భారత వైమానిక దళం పోరాట సామర్థ్యాన్ని, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వేగాన్ని పరీక్షించడం. ముఖ్యంగా చైనా సరిహద్దుకు సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో వైమానిక కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా ఫ్రంట్‌లైన్ యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొననున్నాయి. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే బియాండ్ విజువల్ రేంజ్ (BVR) సామర్థ్యాలు, యుద్ధ విమానాల వేగం, అధిక ఎత్తులో ఇంజిన్ల పనితీరును అధికారులు పరిశీలించనున్నారు. శత్రు విమానాలు లేదా ఇతర ముప్పులను గుర్తించి సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపైనా దృష్టి సారించనున్నారు.
మరోవైపు, ఈ విన్యాసాల్లో అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ (ALG) వినియోగం కూడా కీలకంగా ఉండనుంది. పర్వత ప్రాంతాల్లోని చిన్న రన్‌వేలపై విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సామర్థ్యాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సైనిక బలగాలను వేగంగా తరలించడం, అవసరమైన ఆయుధాలు, ఇతర సామగ్రిని చేరవేయడం వంటి అంశాలను పరీక్షించనున్నారు. ఉత్తరాఖండ్‌లోని మధ్య హిమాలయ ప్రాంతంలో సైనిక మౌలిక సదుపాయాలు, నిఘా వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ విన్యాసాలకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఏర్పడింది.
విమాన ప్రయాణికులకు అలర్ట్..
ఈ సైనిక విన్యాసాల కారణంగా కొన్ని పౌర విమానాల రాకపోకలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో విమానయాన సంస్థలు ముందుగానే వైమానిక దళంతో సమన్వయం చేసుకుని విమాన మార్గాలు, షెడ్యూళ్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.







