వలసలపై కాస్త కఠినంగా ఉన్నానేమో.. ట్రంప్ లో ఆత్మవిమర్శ.. !
మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రిపబ్లికన్లలో అంతర్మథనం తీవ్రమైంది. అధ్యక్షుడు ట్రంప్ వలసలపై కఠిన వైఖరి, ఇరాన్ యుద్ధం సహా పలు అంశాలను వారు చర్చిస్తున్నారు. మరోవైపు… డెమొక్రాట్లు అయితే ఏకంగా ట్రంప్ పై కత్తులు నూరుతున్నారు. న్యాయస్థానంలో నిలబెడతామని హెచ్చరిస్తున్నారు కూడా. అయితే తాము అన్నింటికీ సిద్ధమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది అధ్యక్షుడు ట్రంప్ బృందం.
మరోవైపు…మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా తాను ఎంతో కఠినంగా వ్యవహరించిన వలస విధానంపై ఆయన మెత్తబడ్డారు. తన విధానం “కొంత కఠినంగా ఉందేమో” అని అంగీకరించారు. సీబీఎస్ ఛానల్‌కు చెందిన ’60 మినిట్స్’ కార్యక్రమానికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ పలు కీలక అంశాలపై మనసు విప్పారు.
వలస విధానంపై పునరాలోచన
తన వలస విధానంలో కొన్ని అంశాలు ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి నష్టం కలిగించాయని ట్రంప్ అంగీకరించారు. సరిహద్దు భద్రత, నేరస్థులను దేశం నుంచి పంపించే విషయంలో ప్రజలు తనకు ‘A+’ గ్రేడ్ ఇచ్చారని చెబుతూనే, ఏళ్లుగా అమెరికాలో ఉంటూ, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని వెనక్కి పంపించడం కొంత వ్యతిరేకతకు కారణమైందని అంగీకరించారు. “ఈ విధానం కొంత కఠినంగా ఉందేమోనని నేను భావిస్తున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడని వారి విషయంలో డెమోక్రాట్లతో కలిసి ఒక రాజీ ఫార్ములాకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఓటమికి ఇరాన్ యుద్ధం కూడా కారణం
ఇరాన్‌తో యుద్ధం కూడా మధ్యంతర ఎన్నికల ఓటమికి ఒక కారణమని అభిప్రాయపడిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఏకీభవిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా మారకుండా అడ్డుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని, దీర్ఘకాలంలో ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తారని ఆయన తన చర్యను సమర్థించుకున్నారు. ఇరాన్ అణు సామగ్రిని పూర్తిగా నిర్వీర్యం చేశామని, హర్మూజ్ జలసంధిని తెరిచే ఉంచామని స్పష్టం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందం దగ్గర్లో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అప్పట్లో తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధమే వచ్చి ఉండేది కాదని పునరుద్ఘాటించారు. తన కేబినెట్లో కొందరిని మార్చే అవకాశం ఉందని, “కొన్ని మార్పులు చేయొచ్చు” అని సూచనప్రాయంగా తెలిపారు.







