స్థానిక ఎన్నికల్లో కూటమి బలం మరింత పెరిగింది.. గణాంకాలతో వివరించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి మరింత రాజకీయ బలాన్ని ఇచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే తాజా స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓట్ల శాతం పెరిగిందని వెల్లడించారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతోందని, ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా ఓట్ల శాతం, గెలిచిన స్థానాల వివరాలను వెల్లడించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన( Janasena) , బీజేపీ (BJP)తో కూడిన ఎన్డీఏ కూటమికి 55.3 శాతం ఓట్లు వచ్చాయి. అయితే రెండు విడతల్లో నిర్వహించిన తాజా స్థానిక ఎన్నికల్లో ఈ సంఖ్య 58.9 శాతానికి చేరింది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం ఓట్ల పెరుగుదల నమోదైంది. మరోవైపు వైఎస్సార్సీపీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 2024 ఎన్నికల్లో 39.81 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ, ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో 33.56 శాతానికే పరిమితమైంది. గతంతో పోలిస్తే 6.25 శాతం ఓట్లను కోల్పోయింది. దీంతో రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం 25.34 శాతానికి చేరినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
పట్టణ ప్రాంతాల్లో కూటమి సాధించిన ఫలితాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏకు 59.9 శాతం ఓట్లు రాగా, వైఎస్సార్సీపీకి 34.3 శాతం మాత్రమే వచ్చాయి. ఇరు పక్షాల మధ్య 25.60 శాతం తేడా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం విజయానికి మరో నిదర్శనమని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ కూటమి ఆధిపత్యం కొనసాగిందని సీఎం వెల్లడించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏకు 57.6 శాతం ఓట్లు రాగా, వైఎస్సార్సీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయి. ఈ విభాగంలో కూటమికి 17.9 శాతం ఆధిక్యం లభించింది. పరిషత్ ఎన్నికల్లో 87.5 శాతం స్ట్రైక్ రేట్ సాధించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీటీసీ స్థానాలకు గాను కూటమి 575 స్థానాలను గెలుచుకుంది. అలాగే 9,818 ఎంపీటీసీ స్థానాల్లో 7,803 స్థానాలను కైవసం చేసుకుంది. దాదాపు 90 శాతం మండల అధ్యక్ష పదవులు కూడా కూటమి ఖాతాలోకి వచ్చే పరిస్థితి ఉందని వివరించారు.
జిల్లాల వారీగా చూస్తే 28 జిల్లాల్లో 27 చోట్ల కూటమి ఆధిక్యం సాధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైఎస్సార్సీపీ మెరుగైన ఫలితాలు సాధించింది. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది వేసిన పోస్టల్ బ్యాలెట్లలోనూ కూటమికి గణనీయమైన మద్దతు లభించిందని తెలిపారు. పట్టణ ఎన్నికల్లో ఎన్డీఏకు 65.7 శాతం, వైఎస్సార్సీపీకి 27.42 శాతం పోస్టల్ ఓట్లు వచ్చాయి. పరిషత్ ఎన్నికల్లో కూటమికి 62.83 శాతం, వైఎస్సార్సీపీకి 31.46 శాతం నమోదయ్యాయి. ప్రజలతో పాటు ఉద్యోగుల నుంచి కూడా ప్రభుత్వానికి మద్దతు లభించిందని సీఎం అన్నారు. ఈ ఫలితాలు కూటమి బాధ్యతను మరింత పెంచాయని, ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.







