స్థానికులు సరే.. మరి సమన్వయం మాట ఏమిటి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తాజా స్థానిక సంస్థలు, పరిషత్ ఎన్నికల ఫలితాలు అధికార కూటమికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (Jana Sena), భారతీయ జనతా పార్టీ (BJP) కలిసి సాధించిన విజయాలు రాష్ట్ర రాజకీయాల్లో తమకు ఉన్న బలాన్ని మరోసారి చాటిచెప్పాయి. అయితే ఈ విజయంతోనే భవిష్యత్తు రాజకీయాలు తమకు అనుకూలంగా ఉంటాయని భావిస్తే పొరపాటే అవుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా 2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుంటే కూటమి ఇప్పటి నుంచే కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
తాజా ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ తన పట్టును నిరూపించుకుంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 59 స్థానాల్లో విజయం సాధించగా, జనసేన కూడా తన ప్రభావాన్ని చాటుకుంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కేవలం మూడు స్థానాలకే పరిమితం కావడం రాజకీయంగా ఆ పార్టీకి ఎదురైన గట్టి ఎదురుదెబ్బగా మారింది.
జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి పార్టీల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టీడీపీ 229 స్థానాలు, జనసేన 36, బీజేపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. వైసీపీ 20 స్థానాలకే పరిమితమైంది. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ 4,823 స్థానాలను సాధించగా, జనసేన 644, బీజేపీ 130 స్థానాలను దక్కించుకున్నాయి. వైసీపీ 1,711 స్థానాలతో వెనుకబడింది. ఒకప్పుడు వైసీపీకి బలమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందిన చోట్ల కూడా కూటమి అభ్యర్థులు విజయాలు సాధించడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.
అయితే ఈ విజయాల వెనుక మూడు పార్టీల మధ్య పూర్తిస్థాయి సమన్వయం ఉందని చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో టికెట్ల కేటాయింపు, స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ప్రచార బాధ్యతల విషయంలో భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పడిన అసంతృప్తి భవిష్యత్తులో సమస్యగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. బీజేపీ నాయకులను కూడా కూటమి కార్యక్రమాల్లో మరింత చురుగ్గా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల సమయంలో అధిష్ఠానాలు ఇచ్చే పిలుపుతో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేసినా.. ఆ ఐక్యతను ఐదేళ్ల పాటు కొనసాగించడం అంత సులభం కాదు. అధికారంలో ఉన్న సమయంలో స్థానిక నాయకుల మధ్య పోటీలు, పదవుల పంపకాలు, అభివృద్ధి పనుల విషయంలో విభేదాలు సహజంగానే తలెత్తుతుంటాయి. వీటిని ప్రారంభ దశలోనే పరిష్కరించకపోతే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంటుంది.
మరోవైపు వైసీపీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రస్తుత ఎన్నికల్లో పరాజయం ఎదురైనా కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ తన ఉనికిని నిలబెట్టుకుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే కూటమి నాయకత్వం ప్రతిపక్ష రాజకీయాలను కూడా నిశితంగా గమనించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలే రాబోయే రోజుల్లో కూటమికి అసలైన బలంగా మారనున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో కలిసి ప్రచారం చేయడం కాకుండా, నిరంతరం ప్రజల్లో ఉంటూ మూడు పార్టీల నాయకులు పరస్పర సహకారంతో పనిచేయాలి. అప్పుడే తాజా విజయాలను 2029లోనూ పునరావృతం చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే అంతర్గత విభేదాలే ప్రత్యర్థులకు అవకాశంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







