కూటమి విజయంపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి సృష్టించిన ప్రభంజనంపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అతి తక్కువ సమయంలోనే ప్రజలు ఇంతటి అఖండ తీర్పు ఇవ్వడం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ ఎన్నికల తీర్పు ప్రజలు ఇచ్చిన బలమైన సంకేతమని, దీనిని గౌరవిస్తూ మరింత బాధ్యతగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
కూటమి సాధించిన ఈ అద్భుత విజయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనే ప్రధాన కారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కేవలం ఐదు నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల్లో నింపిన నమ్మకానికి ఈ ఓటింగ్ సరళే నిదర్శనమన్నారు. మరోవైపు యువనేత, మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. యువతకు ఉద్యోగ కల్పన కోసం నిరంతరం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించారని, అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి వైపు ఓటర్లు భారీగా తరలివచ్చారని ఆయన వివరించారు.
“రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే తరాల ప్రయోజనాల కోసమే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా వెళ్ళాం.. అదే స్ఫూర్తిని స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే బంధాన్ని ముందుకు తీసుకెళ్తాం” అని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వంతో కలిసి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో బరిలో నిలిచారని, ప్రజలంతా ఏకాభిప్రాయంతో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు.
కూటమి అంచనా వేసి కొన్ని స్థానాలను కోల్పోవడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విశ్లేషించారు. ఆయా చోట్ల ఓడిపోవడానికి ప్రజల మద్దతు లేకపోవడం కారణం కాదని, కేవలం చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ మాత్రమేనని చెప్పారు. కూటమి అభ్యర్థులకు కేటాయించిన కొత్త సింబల్స్ పూర్తిస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఓటర్లలోకి వెళ్లకపోవడం వల్లే కొన్ని స్థానాలను నష్టపోయామని, అయినప్పటికీ అక్కడ కూడా ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని గుర్తుచేశారు.
ఎన్నికల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ నాయకత్వం ఖచ్చితంగా గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని మరింత బలపరుస్తూ, గెలిచిన ప్రజాప్రతినిధులంతా బాధ్యతాయుతంగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.







