కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్‌లో ఏఐఏ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు..
శాక్రమెంటోలోని కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్ వెస్ట్ స్టెప్స్‌పై మొట్టమొదటిసారిగా జరిగిన దీపావళి వేడుకలతో నిర్వాహకులు చరిత్ర సృష్టించారు. ఈ వేడుకకు కాలిఫోర్నియా నలుమూలల నుంచి రాష్ట్ర శాసనసభ్యులు, భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నాయకులు, సాంస్కృతిక సంస్థలు, కుటుంబాలు పెద్దఎత్తున తరలివచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) తో పాటు కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యులు యాష్ కాల్రా, డా.దర్శనా పటేల్, శాన్ డిగోకు చెందిన ఎఫ్ఐఏ, ఇతర కమ్యూనిటీ సంస్థల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, పలువురు రాష్ట్ర శాసనసభ్యులు, ప్రముఖులు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అద్భుతమైన భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు, అల్పాహారాలు, బీఏపీఎస్ (BAPS) అందించిన ప్రత్యేక అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాయంత్రం వేళ కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్ భవనం దీపావళి రంగుల కాంతులతో అద్భుతంగా ప్రకాశించింది. సిలికాన్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, శాన్ డిగో, శాక్రమెంటో, స్టాక్టన్, పొరుగున ఉన్న నెవాడా నుంచి కూడా పెద్దఎత్తున ప్రజలు పనిదినం అయినప్పటికీ ఇక్కడకు చేరుకుని చారిత్రక వేడుకల్లో పాలుపంచుకున్నారు.
ఇది కేవలం దీపావళి వేడుక మాత్రమే కాదని, తాము చరిత్ర సృష్టించామని ఏఐఏ కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్ వెస్ట్ స్టెప్స్‌పై జరిగిన మొట్టమొదటి దీపావళి వేడుకలో భాగం కావడం ఎప్పటికీ చిరస్మరణీయమని హాజరైనవారు పేర్కొన్నారు. ఈ వేడుక విజయవంతం కావడానికి కృషి చేసిన అసెంబ్లీ సభ్యులు యాష్ కాల్రా, డా.దర్శనా పటేల్, కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, ఇతర శాసనసభ్యులు, ఇతర సంస్థలు, సాంస్కృతిక కళాకారులు, వాలంటీర్లు , కమ్యూనిటీ సభ్యులకు ఏఐఏ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కాలిఫోర్నియాలో భారతీయ వారసత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఐక్యతను చాటిచెప్పే ఈ తొలి దీపావళి వేడుక భవిష్యతరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.







