ఇరాన్ తో యధాతథస్థితి.. ట్రంప్ కీలక కామెంట్స్…!
పశ్చిమాసియాలో దాడులకు అమెరికా విరామమిస్తోందా..ఇరాన్ పై సైనిక దాడి ప్రయత్నాలను అమెరికా పక్కన పెడుతోందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్నటి దాకా ప్రశ్నేలేదు.. ఇరాన్ ను నాశనం చేసేస్తాం అంటూ హుంకరించిన ట్రంప్(TRUMP).. ఇప్పుడు లేటెస్టుగా ఇరాన్‌తో సైనిక ఘర్షణ దాదాపు ముగిసినట్లేనని సంచలన ప్రకటన చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీతో సోమవారం వైట్‌హౌస్‌లో భేటీ అయిన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భేటీ తర్వాత అనూహ్యంగా వైట్‌హౌస్ బ్రీఫింగ్ రూమ్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. “సైనికంగా ఇరాన్ పని దాదాపు ముగిసింది. మేం ప్రస్తుత యథాతథ స్థితిని కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించేందుకు దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని ఆయన నొక్కిచెప్పారు.
ఇవి కూడా చదవండి
ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు కూడా సైనిక ఘర్షణకు బదులుగా.. హర్మూజ్ జలసంధిలో అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని కొనసాగించే యథాతథ స్థితికే మొగ్గు చూపుతున్నాయని ట్రంప్ వివరించారు. చర్చలు సఫలమైతే ఇరాన్‌పై భారీ దాడులు జరిగే అవకాశం లేదని ఆయన సంకేతాలిచ్చారు. అయితే, పరిస్థితులు మారితే తాము “లాక్ అండ్ లోడ్”తో సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు.
గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి కూడా ఇది ఒక కారణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ట్రంప్ చేసిన తాజా ప్రకటన కీలక పరిణామంగా భావిస్తున్నారు.







