మళ్లీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూకుడు పెంచిన దిల్ రాజు!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil raju) ఇటీవల కాలంలో డిస్ట్రిబ్యూటర్గా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. ఆయన భారీ అంచనాలతో తీసుకున్న పలు సినిమాలు నష్టాలను మిగల్చడంతో ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అయితే తాజా పరిణామాలు ఆయనకు కొంత ఊరటనిస్తున్నాయి. రణ్బీర్ కపూర్(Ranbir kapoor) నటించిన రామాయణ(ramayana) సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన దిల్ రాజుకు ఈ సినిమా మంచి కలెక్షన్లను అందిస్తోంది. మరోవైపు యష్(Yash) నటించిన టాక్సిక్(Toxic) సినిమా వల్ల ఎదురైన నష్టాల్లో కొంత భాగాన్ని కూడా తిరిగి రాబట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఫ్యూచర్ లో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేస్తానని యష్ హామీ ఇవ్వడం మరో ఆసక్తికర పరిణామం.
ఈ పరిణామాలతో మళ్లీ డిస్ట్రిబ్యూషన్ రంగంపై దృష్టి సారించిన దిల్ రాజు, భారీ సినిమాల రైట్స్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న కాకా(Kaaka) సినిమా నైజాం రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకునేందుకు డిస్కషన్స్ జరుపుతున్నట్లు సమాచారం. అలాగే అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh), కళ్యాణ్ రామ్(Kalyan Ram) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న జనవరి 12 రిలీజ్ సినిమా థియేట్రికల్ రైట్స్ ను కూడా దక్కించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ రెండు ప్రాజెక్టులు ఆయన నెక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్స్ లో కీలకంగా మారనున్నాయి.
ఇక నాగచైతన్య(Naga chaitanya) నటిస్తున్న వృషకర్మ(Vrusha karma) సినిమాను డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రిలీజ్ చేసే బాధ్యతను దిల్ రాజు చేపట్టనున్నారు. కొంతకాలంగా మైత్రీ మూవీ మేకర్స్(mythi movie makers) నుంచి డిస్ట్రిబ్యూషన్ రంగంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఆయన, ఇప్పుడు తిరిగి తన పట్టును పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వరుసగా భారీ సినిమాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దక్కించుకోవడం ద్వారా పూర్వ వైభవాన్ని సాధించాలనే టార్గెట్ తో ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో దిల్ రాజు ఎలాంటి క్రేజీ ప్రాజెక్టులను తన అకౌంట్ లో వేసుకుంటారో చూడాలి.







