ట్రంప్ ఒకవైపు.. కాంగ్రెస్ మరోవైపు! భారత్‌కు కొత్త చిక్కులు!
ఒక నిర్ణయం. రెండు అధికార కేంద్రాలు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దేశం తీసుకునే నిర్ణయంతో మరో దేశంలోని కోట్ల మంది జీవితాలు ప్రభావితం కాబోతున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడి కుర్చీలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. మరోవైపు ఆయన నిర్ణయాలను ప్రశ్నించే రాజకీయ శక్తి కాంగ్రెస్‌లో బలపడింది. ఈ రెండింటి మధ్య ఇప్పుడు భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉదాహరణకి. ట్రంప్ ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌కు వెసులుబాటు కల్పించింది. కానీ కాంగ్రెస్‌లోని డెమొక్రాట్లు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ అందుకు అంగీకరించడం లేదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు సుంకాల రూపంలో ఒత్తిడి పెరుగుతోంది. ఒకే దేశం నుంచి రెండు రకాల సంకేతాలు వస్తే, వాటిలో దేన్ని నమ్మాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరిని ఒప్పించాలి?
ఇది కేవలం ఊహాజనిత పరిస్థితి కాదు. అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత రూపుదిద్దుకుంటున్న కొత్త రాజకీయ వాస్తవం!
ఇన్నాళ్లూ భారత్‌కు అమెరికాతో సంబంధాలు అంటే ప్రధానంగా వైట్‌హౌస్‌తో దౌత్యం, అధ్యక్షుడితో స్నేహం అనే లెక్క ఉండేది. మోదీ-ట్రంప్ వ్యక్తిగత సంబంధాలు కూడా రెండు దేశాల మధ్య బంధానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ లెక్కలో మరో అధికార కేంద్రం చేరింది. అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగుతుండగా, కాంగ్రెస్‌పై డెమొక్రాట్ల ఆధిపత్యం ఏర్పడింది. అంటే ఒకవైపు నిర్ణయాలు తీసుకునే అధికారం, మరోవైపు ఆ నిర్ణయాలను ప్రశ్నించే రాజకీయ బలం.. రెండూ ఒకేసారి పనిచేయబోతున్నాయి.
ఇక్కడే భారత్‌కు అసలైన పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే వాషింగ్టన్లో జరిగే రాజకీయ పోరు కేవలం అమెరికా నాయకుల మధ్య ఆధిపత్య పోరు కాదు. దాని ప్రభావం మన చమురు బిల్లుల నుంచి ఐటీ ఉద్యోగాల వరకు, చైనాతో వ్యూహాత్మక సంబంధాల నుంచి మన ఎగుమతుల వరకు విస్తరించవచ్చు. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు రాబిందర్ సచ్దేవ్ ఫస్ట్‌పోస్ట్‌తో మాట్లాడుతూ ఈ కొత్త సమీకరణాలపై కీలక విషయాలు వెల్లడించారు. భారత్-అమెరికా సంబంధాల దిశ మారకపోయినా, వాటి రాజకీయ స్వభావం మాత్రం మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైట్‌హౌస్‌లో ట్రంప్.. కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు.. అసలు సమస్య ఇదే!
అమెరికాలో అధ్యక్షుడికి ఎంత అధికారం ఉన్నా, కాంగ్రెస్ పాత్రను తక్కువగా అంచనా వేయలేం. ప్రభుత్వ విధానాల పర్యవేక్షణ, చట్టాల రూపకల్పన, బడ్జెట్, వాణిజ్య వ్యవహారాలు వంటి అంశాల్లో కాంగ్రెస్‌కు కీలకమైన పాత్ర ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో కొనసాగుతుండగా, కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో కొన్ని అంశాల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు, వాణిజ్య సుంకాలు, వలస విధానాల విషయంలో ట్రంప్ ప్రభుత్వాన్ని డెమొక్రాట్లు ప్రశ్నించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఒకవైపు అధ్యక్షుడితో సంబంధాలు కొనసాగిస్తూనే, మరోవైపు కాంగ్రెస్‌లోని కీలక నాయకులతోనూ మాట్లాడాల్సి ఉంటుంది.
సచ్దేవ్ అభిప్రాయం ప్రకారం డెమొక్రాట్ల విజయం భారత్‌కు ఆటోమేటిక్‌గా మేలు చేయదు. అలాగే పూర్తిగా నష్టం కూడా కలిగించదు. కొన్ని విషయాల్లో భారత్‌కు ఊరట లభించవచ్చు. మరికొన్ని అంశాల్లో కొత్త ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. అంటే ఒక సమస్య పరిష్కారమవుతుందనుకునేలోపే మరో సమస్య తలుపు తట్టే అవకాశం ఉంది.
రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై మళ్లీ ఆంక్షల ముప్పు?
ఈ కొత్త రాజకీయ సమీకరణాల్లో భారత్‌కు అత్యంత కీలకమైన అంశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా రష్యాపై అనేక ఆంక్షలు విధించింది. అయినప్పటికీ భారత్ తన ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ ధరకు చమురు లభిస్తే భారత్‌కు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. అందుకే ఈ విషయంలో మన దేశం తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం రష్యా చమురుకు సంబంధించి భారత్‌కు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో ఆ మినహాయింపులను వెనక్కి తీసుకోవాలని ట్రంప్‌పై ఒత్తిడి రావచ్చు. రష్యాపై మరింత కఠినంగా వ్యవహరించాలని వారు పట్టుబడితే, దాని ప్రభావం భారత్‌పై కూడా పడుతుంది.
అదే జరిగితే భారత్ ముందు మరో చిక్కు వచ్చి పడుతుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే అమెరికా నుంచి ఆంక్షలు లేదా అదనపు సుంకాల ముప్పు ఎదురుకావచ్చు. కొనుగోళ్లు తగ్గిస్తే మన ఇంధన అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. చమురు ధరల్లో మార్పులు వస్తే దాని ప్రభావం రవాణా ఖర్చుల నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకు కనిపించవచ్చు.
అంటే అమెరికాలోని రాజకీయ పరిణామాలు చివరకు మన సామాన్యుడి జేబుపైనా ప్రభావం చూపగలవు. ఉక్రెయిన్ యుద్ధం ఎలా కొనసాగుతుంది? రష్యాపై అమెరికా ఆంక్షలు ఎంత కఠినంగా మారతాయి? అన్న అంశాలు భారత్‌కు కీలకంగా మారనున్నాయి.
భారత్‌తో ట్రేడ్ డీల్‌కు ట్రంప్ తొందరపడతారా?
అమెరికా కాంగ్రెస్‌లో మారిన రాజకీయ సమీకరణాలు భారత్‌కు కొంత వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్న మరో రంగం వాణిజ్యం. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతిదారులకు ఇతర దేశాలతో పోటీపడేలా మెరుగైన అవకాశాలు కల్పించాలని భారత్ భావిస్తోంది.
.
అమెరికాలో భారతీయులపై దాడులు.. డెమొక్రాట్లు ఏం చేయగలరు?
అమెరికాలో భారతీయ అమెరికన్లపై జాతి, మతపరమైన విద్వేష దాడులు జరుగుతున్న అంశం కూడా కొత్త కాంగ్రెస్‌లో ప్రాధాన్యత పొందవచ్చు. ముఖ్యంగా హిందూ ఆలయాలపై దాడులు, భారతీయులపై విద్వేష వ్యాఖ్యలు, జాతి వివక్షకు సంబంధించిన ఘటనలపై డెమొక్రాట్లు మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది.
అమెరికాలో ఇప్పటికే జాతి, మతం, జాతీయత ఆధారంగా జరిగే నేరాలను అడ్డుకోవడానికి ఫెడరల్ చట్టాలు ఉన్నాయి. కాబట్టి భారతీయుల కోసమే ప్రత్యేకంగా కొత్త చట్టాలు తీసుకురావడం కంటే, ప్రస్తుతం ఉన్న చట్టాలను సమర్థంగా అమలు చేయించడమే ముఖ్యమని సచ్దేవ్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఇల్లినాయిస్లోని ఒక హిందూ ఆలయంపై జరిగిన సామూహిక కాల్పుల ప్రయత్నాన్ని ఎఫ్‌బీఐ విచారించాలని రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో 105 మంది కాంగ్రెస్ సభ్యులు కోరారు. ఇలాంటి ఘటనలపై కాంగ్రెస్ కమిటీలు విచారణ చేపడితే న్యాయశాఖ, ఎఫ్‌బీఐ వంటి సంస్థలపై ఒత్తిడి పెరుగుతుంది.
అయితే సభల్లో చర్చలు జరగడం, అధికారులు సమాధానాలు చెప్పడం మాత్రమే సరిపోదు. నిందితులపై కేసులు నమోదు కావాలి. విచారణలు సమర్థంగా జరగాలి. బాధితులకు భద్రత కల్పించాలి. అప్పుడే కాంగ్రెస్‌లో జరిగే చర్చలకు నిజమైన అర్థం ఉంటుందని సచ్దేవ్ స్పష్టం చేశారు.
2029 అధ్యక్ష ఎన్నికల వరకు భారత్‌కు ఇదే అసలైన పరీక్ష!
అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం ఇప్పటితో ముగిసిపోదు. 2029 అధ్యక్ష ఎన్నికల రాజకీయాలపైనా ఈ ఫలితాలు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో ట్రంప్‌కు ఎదురయ్యే అడ్డంకులు పెరిగితే, విదేశాంగ విధానాల్లో విజయాలు సాధించి తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆయన ప్రయత్నించవచ్చు. మరోవైపు అమెరికా రాజకీయ పార్టీలు తదుపరి అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తమ వ్యూహాలను సిద్ధం చేసుకునే అవకాశం ఉంది.
–సూర్య ప్రకాష్ జోశ్యుల







