చైనా స్పై తో ఎఫైర్.. ఇప్పుడు సొంత కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌తో ? Nvidia CEO కథలో కొత్త ట్విస్ట్
ఒకప్పుడు జెన్సన్ హువాంగ్ వేదికపైకి వస్తే ప్రపంచం AI భవిష్యత్తు గురించి వినడానికి సిద్ధమయ్యేది. ఇప్పుడు ఆయన గురించి కొత్త విషయాలు బయటపడితే Nvidia బోర్డు ఏం వినాల్సి వస్తుందోనని ఎదురుచూస్తోంది.
AIకి కొత్త ప్రపంచాన్ని చూపించిన ఈ 63 ఏళ్ల టెక్ దిగ్గజం.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒకటి తర్వాత మరొక చిక్కుముడిని విప్పుకోలేకపోతున్నట్టున్నారు. మొదట చైనా గూఢచర్య ఆరోపణలతో ముడిపడిన ఓ మహిళ పేరు బయటకొచ్చింది. ఆ కథ ఇంకా ముగియకముందే ఇప్పుడు మరో మహిళ తెరపైకి వచ్చింది. విశేషమేమిటంటే.. ఆమె హువాంగ్‌కు బయటి ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన సొంత కంపెనీలోనే వైస్ ప్రెసిడెంట్!
18 ఏళ్లుగా Nvidiaలో పనిచేస్తున్న కింబర్లీ పావెల్‌తో హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ ది న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. చిప్స్ తయారుచేసే కంపెనీలో ఇప్పుడు అసలు వేడి ఎక్కడ పుడుతోందో అర్థం చేసుకోవడానికి GPU అవసరం లేదు. అయితే ఈ వ్యవహారంలో బోర్డు మాత్రం చాలా జాగ్రత్తగా లెక్కలు వేయాల్సి వస్తోంది. ఎందుకంటే ఇది మరో ఎఫైర్ కథ మాత్రమే కాదు.. CEO అధికారాలు, కంపెనీ నైతిక నియమాలు, చివరకు ప్రపంచ AI సామ్రాజ్యానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం!
ఇవి కూడా చదవండి
18 ఏళ్లుగా Nvidiaలోనే.. అసలు ఎవరీ కింబర్లీ పావెల్?
కింబర్లీ పావెల్ పేరు ఇప్పటివరకు సాధారణ టెక్ వార్తల్లో పెద్దగా వినిపించి ఉండకపోవచ్చు. కానీ Nvidiaలో ఆమె స్థానం మాత్రం చిన్నదేమీ కాదు. 48 ఏళ్ల పావెల్ కంపెనీ హెల్త్‌కేర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. వైద్య రంగంలో Nvidia చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించే కార్యక్రమాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ ఇమేజింగ్, వైద్య పరిశోధనల్లో AI వినియోగాన్ని పెంచడంపై దృష్టి పెడుతున్నారు.
బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె 1999లోనే తన కెరీర్ ప్రారంభించారు. మొదట DOME Imaging Systemsలో హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత Planar Systemsలోని మెడికల్ బిజినెస్ విభాగంలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలకు ఉపయోగించే డిస్ప్లేలు, ఇమేజింగ్ టెక్నాలజీపై పనిచేశారు. 2008లో Nvidiaలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ప్రయాణం మరో స్థాయికి చేరింది.
2016లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా ప్రమోషన్ పొందారు. మరుసటి ఏడాదే వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగే టెక్నాలజీ సమావేశాల్లో Nvidia తరఫున పాల్గొంటున్నారు. ఒక పాడ్‌కాస్ట్‌లో తన ఉద్యోగం గురించి మాట్లాడుతూ.. Nvidiaలో పనిచేయడం తన కల నిజమైనట్లుగా ఉందని చెప్పారు. హెల్త్‌కేర్ రంగం గురించి తాను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటానని కూడా గతంలో వెల్లడించారు.
బాస్‌ను ప్రశంసించిన ఉద్యోగి.. ఇప్పుడు ఇద్దరి పేర్లూ ఒకే వివాదంలో!
పావెల్, హువాంగ్ మధ్య పరిచయం ఈ మధ్య మొదలైంది కాదు. దాదాపు 18 ఏళ్లుగా ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో హువాంగ్‌పై పావెల్ పలుమార్లు ప్రశంసలు కురిపించారు. 2016లో X వేదికగా ఆయనను అమెరికాలోని అత్యుత్తమ CEOలలో ఒకరిగా అభివర్ణించారు. Nvidiaలో పనిచేయడం అద్భుతమైన అనుభవమని, ఇతరులు కూడా కంపెనీలో చేరాలని అప్పట్లో పోస్టు చేశారు.
ఇటీవల ఆగస్టులో Lifersకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ హువాంగ్ గురించి గొప్పగా మాట్లాడారు. హెల్త్‌కేర్ రంగంపై ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా ఆసక్తి ఉందని, వైద్య పరిశోధకులు తమ కలలను నిజం చేసుకునేందుకు అవసరమైన టెక్నాలజీని అందించాలనే ఆలోచనతో ఆయన ఈ రంగంపై దృష్టి పెట్టారని వివరించారు.
అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందనే ఆరోపణలు రావడంతో పాత ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులు కూడా మళ్లీ చర్చలోకి వచ్చాయి. అయితే ఆ సంబంధం ఎప్పుడు మొదలైందనే విషయంపై స్పష్టత లేదు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, Nvidiaలో పనిచేసిన ఐదుగురు వ్యక్తులు ఈ వ్యవహారం గురించి వెల్లడించారు.
హోటల్లో కెమెరాకు చిక్కిన సన్నిహిత దృశ్యాలు?
ఈ కథలో మరో ఆసక్తికరమైన మలుపు శాన్‌జోస్‌లోని ఓ హోటల్ దగ్గర మొదలవుతుంది. ఈ ఏడాది మార్చిలో Nvidia కాన్ఫరెన్స్ సందర్భంగా హువాంగ్, పావెల్ అక్కడ సన్నిహితంగా కనిపించినట్లు ఇద్దరి గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు. ఇద్దరూ ఆప్యాయంగా ఉన్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియోలో చిత్రీకరించినట్లు కూడా సమాచారం. ఆ దృశ్యాలను చిత్రీకరించిన వ్యక్తిని హువాంగ్ భద్రతా సిబ్బంది పక్కకు తీసుకెళ్లారని, తర్వాత NDAపై సంతకం చేయించేందుకు ప్రయత్నించారని కూడా తెలుస్తోంది.
ఇక్కడ ఇంకో విషయం ఉంది. హువాంగ్‌కు 63 ఏళ్లు కాగా, పావెల్‌కు 48 ఏళ్లు. ఇద్దరికీ వేర్వేరుగా వివాహమైంది. హువాంగ్ 1985లో లోరీ మిల్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి స్పెన్సర్, మాడిసన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ Nvidiaలోనే పనిచేస్తున్నారు. మరోవైపు పావెల్ భర్త గ్రాహం గెరాడ్ వైద్య ఇమేజింగ్‌కు సంబంధించిన అప్లికేషన్ సహ ఆవిష్కర్తగా అమెరికా పేటెంట్ కార్యాలయంలో నమోదయ్యారు.
వ్యక్తిగత వ్యవహారం కాస్తా కంపెనీకి తలనొప్పిగా ఎందుకు మారింది?
ఇద్దరు పెద్దవాళ్ల మధ్య వ్యక్తిగత సంబంధం ఉంటే అది వారి సొంత విషయం అనుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఇద్దరి హోదాల్లో ఉంది. ఒకరు కంపెనీకి CEO. మరొకరు అదే CEOకు నేరుగా రిపోర్ట్ చేసే వైస్ ప్రెసిడెంట్. అంటే ఉద్యోగుల ప్రమోషన్లు, బాధ్యతలు, కెరీర్ అవకాశాలపై ప్రభావం చూపగల వ్యక్తితోనే వ్యక్తిగత సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే పావెల్‌తో సంబంధం ఉందనే ఆరోపణలను కంపెనీ బోర్డు ఎలా పరిగణిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.
హువాంగ్ను పదవి నుంచి తప్పిస్తారా?
ఇప్పటివరకు Nvidia అంటే జెన్సన్ హువాంగ్ అనే స్థాయిలో కంపెనీ ఎదిగింది. 1993లో సహ వ్యవస్థాపకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. మూడు దశాబ్దాల్లో Nvidiaను దాదాపు 4 ట్రిలియన్ డాలర్ల విలువైన సంస్థగా నిలబెట్టింది. AI రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోటీలో Nvidia చిప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కంపెనీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి చుట్టూ ఇన్ని వివాదాలు రావడం పెట్టుబడిదారులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
హువాంగ్ మౌనం.. పావెల్ కూడా కార్యక్రమం నుంచి దూరం!
ఈ వివాదంపై జెన్సన్ హువాంగ్ను న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు నేరుగా ప్రశ్నించారు. కింబర్లీ పావెల్‌తో సంబంధం ఉందనే ఆరోపణలపై మీ స్పందన ఏమిటని అడిగితే.. “మీరు నేరుగా నన్ను అడగకూడదని నేను అనుకుంటున్నాను” అంటూ ఫోన్ పెట్టేశారని ఆ పత్రిక వెల్లడించింది. Nvidia మాత్రం ఈ ఆరోపణలపై తక్షణమే స్పందించలేదు. పావెల్ కూడా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.
ఇక పావెల్ గురువారం జరగాల్సిన Milken Future of Health Summitలో ఓ ప్యానెల్ చర్చలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆమె తన షెడ్యూల్ చేసిన కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి.







