రాత్రంతా రోబోలకు కాపలా జాబ్.. గంటకు రూ.4,217 జీతం!
అమెరికాలో AI, రోబోటిక్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కొత్త రూపం తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు రోబోలను తయారు చేయడం, వాటికి ప్రోగ్రామింగ్ చేయడం, వాటి పనితీరును మెరుగుపరచడం వంటి ఉద్యోగాల గురించి విన్నాం. కానీ ఇప్పుడు రోబోలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో రాత్రంతా పర్యవేక్షించేందుకు కూడా కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇందుకోసం గంటకు ఏకంగా రూ.4,217 (45 డాలర్లు) వరకు చెల్లించేందుకు ఓ అమెరికన్ AI స్టార్టప్ సిద్ధమైంది.
కాలిఫోర్నియాకు చెందిన Figure AI అనే రోబోటిక్స్ కంపెనీ ఈ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. అయితే ఇది సాధారణ నైట్ షిఫ్ట్ ఉద్యోగం కాదు. రాత్రి వేళల్లో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోలను పర్యవేక్షించడం, వాటికి పనులు కేటాయించడం, ఏదైనా సాంకేతిక సమస్య వస్తే వెంటనే పరిష్కరించడం ఈ ఉద్యోగంలో ప్రధాన బాధ్యతలు. Business Insider కథనం ప్రకారం ఈ ఉద్యోగానికి గంటకు గరిష్ఠంగా 45 డాలర్లు చెల్లించనున్నారు.
అసలు ఏం చేయాలి? ఈ ఉద్యోగంలో బాధ్యతలేంటి?
ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి శాంటా క్లారాలోని కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. రోబోలను నిర్వహించే ఆపరేటర్లతో సమన్వయం చేసుకోవాలి. ఏ రోబోకు ఏ పని అప్పగించాలి? అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? ఏదైనా యంత్రంలో సాంకేతిక సమస్య తలెత్తిందా? అనే విషయాలను నిరంతరం గమనించాలి. రోబోలు పనిచేసే ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో కూడా చూసుకోవాలి.
ఈ ఉద్యోగం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రారంభమవుతుంది. పనితీరును బట్టి తర్వాత కంపెనీలో శాశ్వత ఉద్యోగిగా మారే అవకాశం ఉంటుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు షిఫ్ట్ ఉంటుంది. వారానికి ఐదు రోజులు పనిచేయాలి. ఇందులో ఒక వారాంతపు రోజు కూడా ఉంటుంది.
రోబోలను చూసుకోవడం అంత ఈజీ కాదు!
ఈ ఉద్యోగానికి కొన్ని ప్రత్యేక అర్హతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎనిమిది గంటలకు పైగా నిలబడి పనిచేయగలగాలి. దాదాపు 23 కిలోల బరువున్న పరికరాలు, రోబోటిక్ హార్డ్‌వేర్‌ను ఎత్తడం, నిర్వహించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
గతంలో టీమ్ లీడర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. రోబోటిక్స్, మెకానిక్స్‌పై ప్రాథమిక అవగాహన అవసరం. ఇంజినీరింగ్ బృందం అందుబాటులో లేని సమయంలోనూ సమస్యలను అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. ఈ ఉద్యోగంలో బాధ్యత ఎంత కీలకమో చెబుతూ కంపెనీ తన ప్రకటనలో ఒక ఆసక్తికరమైన మాట కూడా పేర్కొంది. ‘నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరే’ అని స్పష్టం చేసింది.
హ్యూమనాయిడ్ రోబోల రంగంలోకి భారీ పెట్టుబడులు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హ్యూమనాయిడ్ రోబోలపై పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. మనుషుల మాదిరిగా నడవడం, వస్తువులను పట్టుకోవడం, పరిశ్రమల్లో పనులు చేయడం వంటి సామర్థ్యాలున్న రోబోలను తయారు చేసేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి.
Business Insider వెల్లడించిన PitchBook గణాంకాల ప్రకారం, 2026 మొదటి ఆరు నెలల్లో రోబోటిక్స్, ఫిజికల్ AI రంగాల్లోని కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 33.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 2025 మొత్తం ఈ రంగానికి వచ్చిన 28.7 బిలియన్ డాలర్ల పెట్టుబడుల కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.
అసలు Figure AI కంపెనీ ఏం చేస్తోంది?
2022లో ప్రారంభమైన Figure AI హ్యూమనాయిడ్ రోబోల తయారీలో పనిచేస్తోంది. 2025 సెప్టెంబర్‌లో జరిగిన సిరీస్-C నిధుల సమీకరణలో ఈ కంపెనీకి 1 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ విలువ 39 బిలియన్ డాలర్లకు చేరింది. Parkway Venture Capital నేతృత్వంలో ఈ పెట్టుబడుల రౌండ్ జరిగింది.
తయారీ రంగం, లాజిస్టిక్స్, గిడ్డంగులు, రిటైల్ వంటి అనేక రంగాల్లో మనుషులతో కలిసి పనిచేసే రోబోలను ప్రవేశపెట్టడం Figure AI లక్ష్యం. ముఖ్యంగా ఉద్యోగుల కొరత ఎదుర్కొంటున్న పరిశ్రమల్లో ఈ రోబోలను ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది.
భవిష్యత్తులో రోబోలు మనుషుల సహాయం లేకుండానే పనిచేయడమే కాకుండా, మరో రోబోను కూడా తయారు చేయగల స్థాయికి చేరుకుంటాయని Figure AI అంచనా వేస్తోంది. అంటే ఒక దశలో రోబోలకు మనుషుల పర్యవేక్షణ కూడా అవసరం లేకుండా పోవచ్చన్నది కంపెనీ దీర్ఘకాలిక ఆలోచన.
అయితే ఆ స్థాయి వచ్చే వరకు రోబోలను పర్యవేక్షించడానికి, వాటి సమస్యలను పరిష్కరించడానికి మనుషుల అవసరం తప్పదు. అందుకే ఇప్పుడు AI కంపెనీలు రోబోలను తయారు చేసే ఇంజినీర్లతో పాటు, వాటిని రాత్రంతా కనిపెట్టుకుని చూసుకునే ఉద్యోగుల కోసం కూడా వెతుకుతున్నాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







