చైనా గూఢచారి సంస్థ ‘చిప్ టీమ్’లో ఆలిస్ హ్వాంగ్? అసలు స్కెచ్ ఇదేనా?
ఒకవైపు అమెరికా.. మరోవైపు చైనా! ప్రపంచాన్ని శాసించే AI టెక్నాలజీ కోసం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇక్కడ యుద్ధం సరిహద్దుల్లో లేదు. తుపాకులు, క్షిపణులు కూడా లేవు. కానీ ప్రపంచ టెక్నాలజీ భవిష్యత్తును మార్చగల ఎన్విడియా చిప్స్ చుట్టూ మాత్రం పెద్ద వ్యూహమే నడుస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దగ్గరున్న అత్యాధునిక చిప్ టెక్నాలజీని చైనా ఎలా అందిపుచ్చుకోవాలనుకుంటోంది? అందుకోసం వ్యాపార సంస్థలను, పెట్టుబడులను, వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించుకుంటోందా?
ఈ ప్రశ్నల మధ్య ఇప్పుడు ఆలిస్ హ్వాంగ్ పేరు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఎన్విడియా మాజీ CEO జెన్సన్ హ్వాంగ్‌తో సన్నిహితంగా కనిపించిన ఆమెకు చైనా ప్రభుత్వ నిఘా సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలు బయటకు వచ్చాయి. చైనా నిఘా సంస్థలో సెమీకండక్టర్ రంగం కోసం ప్రత్యేకంగా పనిచేసే ‘చిప్ టీమ్’లో ఆమె సభ్యురాలిగా ఉన్నారన్నది ఈ ఆరోపణల్లో అత్యంత కీలకమైన అంశం. అంతేకాదు.. ఎన్విడియా చిప్స్ సరఫరా వ్యవస్థలో జోక్యం చేసుకోవడం, హువావే, డీప్‌సీక్ వంటి సంస్థలతో పరోక్ష వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం వెనుక పెద్ద వ్యూహం ఉందా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.
అయితే ఇవన్నీ ప్రస్తుతం మీడియా కథనాలు, దర్యాప్తులో ఉన్న ఆరోపణలే. వీటిపై ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. మరి ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు కథేంటి?
ఇవి కూడా చదవండి
చైనా ఏర్పాటు చేసిన రహస్య ‘Chip Team’ ఏం చేస్తుంది?
తైవాన్‌కు చెందిన లిబర్టీ టైమ్స్ కథనాల ప్రకారం.. చైనా ప్రభుత్వ అత్యున్నత నిఘా సంస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (MSS)లో సెమీకండక్టర్ రంగంపై ప్రత్యేకంగా పనిచేసే ‘చిప్ టీమ్’ ఉందని, అందులో ఆలిస్ హ్వాంగ్ సభ్యురాలిగా ఉన్నారనే అనుమానాలు అమెరికా అధికారులకు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా, చైనా మధ్య AI ఆధిపత్య పోరు తీవ్రమవుతున్న సమయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేకంగా ఒక ‘AI గ్రూప్’ను ఏర్పాటు చేసిందని, అందులో భాగంగానే నిఘా సంస్థ కూడా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించిందని తైవాన్ మీడియా పేర్కొంది. అత్యాధునిక అమెరికా చిప్ టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఎగుమతి ఆంక్షలను అధిగమించే మార్గాలను అన్వేషించడం ఈ బృందం లక్ష్యాలుగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. అమెరికా టెక్నాలజీని నేరుగా దొంగిలించడం కంటే, చైనాతో సంబంధం లేని కంపెనీల సరఫరా వ్యవస్థల్లోకి ప్రవేశించడం, వ్యాపార సంబంధాలను ఉపయోగించుకోవడం, కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులపై ప్రభావం చూపడం వంటి వ్యూహాలకు ఈ బృందం ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అమెరికాలోని ప్రముఖ బిగ్టెక్ కంపెనీల్లోనూ చైనా మహిళా ఏజెంట్లు వివిధ స్థాయిల్లోకి చొరబడినట్లు ఆరోపించాయి. అయితే ఈ వాదనలకు స్వతంత్ర ధ్రువీకరణ లేదు.
జెన్సన్ హ్వాంగ్‌తో పరిచయం వెనుక కూడా వ్యూహం ఉందా?
ఈ వ్యవహారంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అంశం ఆలిస్ హ్వాంగ్కు ఎన్విడియా మాజీ CEO జెన్సన్ హ్వాంగ్‌తో ఉన్నట్లు ప్రచారంలోకి వచ్చిన సన్నిహిత సంబంధాలు. ఒకవేళ చైనా నిఘా సంస్థతో ఆమెకు నిజంగా సంబంధాలుంటే, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన AI చిప్ కంపెనీ అధినేతతో పరిచయం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. జెన్సన్ హ్వాంగ్ నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరించడంతో పాటు, చైనాకు AI చిప్స్ విక్రయించే విషయంలో ఆయన ఆలోచనలను ప్రభావితం చేసేందుకు ఆలిస్ హ్వాంగ్ను చైనా నిఘా సంస్థ ఉపయోగించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇక్కడ లక్ష్యం కేవలం టెక్నాలజీ సమాచారాన్ని సేకరించడం మాత్రమే కాకుండా, కీలక నిర్ణయాలపై ప్రభావం చూపడం కూడా కావచ్చన్నది ఈ ఆరోపణల సారాంశం.
అయితే అమెరికా అధికారులు ఈ ఆరోపణలను ఇంకా నిర్ధారించలేదు. అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ మాట్లాడుతూ.. ఆలిస్ హ్వాంగ్కు చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై FBI దర్యాప్తు చేస్తోందని, ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేశారు. గూఢచర్యం కోణంలోనూ విచారణ జరుగుతోందా అని ప్రశ్నించగా ‘తప్పకుండా’ అని సమాధానమిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమె నిజంగా గూఢచారిగా పనిచేశారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
Huawei డేటా సెంటర్లో 27 శాతం వాటా.. ఇదీ మరో లింక్!
ఆలిస్ హ్వాంగ్ వ్యవహారంలో మరో కీలకమైన మలుపు హువావేతో సంబంధాలు. అమెరికా ఎగుమతి ఆంక్షలు ఎదుర్కొంటున్న ఈ చైనా టెక్నాలజీ సంస్థకు ఎన్విడియా చిప్స్ చేరే మార్గంలో ఆమెకు సంబంధించిన వ్యాపార సంస్థలు పాత్ర పోషించాయా? అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
CNBC వెల్లడించిన ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ టెసారీ విశ్లేషణ ప్రకారం.. ఆలిస్ హ్వాంగ్ తన భర్త కాంగ్ వీతో కలిసి షాంఘై హెక్సీ అనే చైనా ఆర్థిక సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. ఈ సంస్థ 2021లో షాంఘై సెంచరీ లాంగ్టెంగ్ అనే డేటా సెంటర్ అభివృద్ధి సంస్థలో 27 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు కార్పొరేట్ రికార్డుల విశ్లేషణలో వెల్లడైంది.
ఇక్కడే మరో లింక్ బయటపడింది. లాంగ్టెంగ్కు షెన్జెన్ యిఫెంగ్ అనే చైనా డేటా సెంటర్ సంస్థలో 50.1 శాతం వాటా ఉంది. ఈ సంస్థకు హువావే క్లౌడ్ ప్రధాన కస్టమర్‌గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దీంతో ఆలిస్ హ్వాంగ్కు సంబంధించిన పెట్టుబడుల నెట్‌వర్క్‌కు, హువావే ఉపయోగించే డేటా సెంటర్ వ్యవస్థకు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయనే విషయం చర్చకు వచ్చింది.
ఇప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు తెలుసుకోవాలనుకుంటున్న కీలకమైన విషయం.. ఈ వ్యాపార మార్గాల ద్వారా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న హువావేకు ఎన్విడియా GPUలు చేరాయా? అన్నదే. అయితే ఈ మార్గం ద్వారా చిప్స్ సరఫరా జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
DeepSeek లోనూ రహస్య పెట్టుబడులా?
హువావేతో సంబంధాల ఆరోపణలు ఒకవైపు ఉంటే, మరోవైపు చైనా AI రంగంలో సంచలనం సృష్టించిన డీప్‌సీక్ పేరు కూడా ఈ వివాదంలో వినిపిస్తోంది. ది ఇన్ఫర్మేషన్ కథనం ప్రకారం.. ఆలిస్ హ్వాంగ్కు సంబంధం ఉన్న కొన్ని కంపెనీలు ఎన్విడియా అత్యాధునిక AI చిప్స్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత డీప్‌సీక్‌లో వాటాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇది అమెరికాకు మరింత ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే చైనా AI కంపెనీలకు అత్యాధునిక GPUలు అందుబాటులోకి వస్తే, వాటి AI మోడళ్ల అభివృద్ధికి అవసరమైన కీలక వనరులు లభిస్తాయి. అమెరికా ఒకవైపు చైనాకు అత్యాధునిక చిప్స్ అందకుండా ఎగుమతి ఆంక్షలు విధిస్తుంటే, మరోవైపు పరోక్ష వ్యాపార మార్గాల ద్వారా అవి చేరుతున్నాయనే అనుమానాలు రావడం ఆంక్షల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇదే సమయంలో షాంఘై హెక్సీకి వ్యాపార భాగస్వామిగా ఉన్న జెజియాంగ్ సెంచరీ హువాటోంగ్ గ్రూప్ కూడా ఈ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సంస్థ 2023 నుంచి ఎన్విడియా GPUలను కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు నివేదిక పేర్కొంది. ఆలిస్ హ్వాంగ్, జెన్సన్ హ్వాంగ్ ఇద్దరూ బహిరంగంగా కలిసి కనిపించిన కాలంతో ఈ పరిణామాలు సరిపోవడం కూడా అనుమానాలకు కారణమైంది.
అయితే పెట్టుబడులు, వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న కారణంతోనే అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు చెప్పలేం. ఈ కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలు, చిప్స్ సరఫరా ఎక్కడికి జరిగింది, వాటి వెనుక ఎవరున్నారు అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఇప్పుడు అమెరికా వాణిజ్య కార్యదర్శి పదవికీ సెగ!
ఈ వ్యవహారం ఆలిస్ హ్వాంగ్, జెన్సన్ హ్వాంగ్లకే పరిమితం కాలేదు. ట్రంప్ ప్రభుత్వంలోని వాణిజ్య విధానాలపైనా ప్రశ్నలు మొదలయ్యాయి. చైనాకు అత్యాధునిక చిప్స్ ఎగుమతులపై నియంత్రణలు విధించే విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అమెరికా కాంగ్రెస్‌లోని డెమొక్రాట్లు అధికారిక దర్యాప్తు ప్రారంభించారు.
సెనేట్ ఫైనాన్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున కీలక సభ్యుడైన రాన్ వైడెన్, హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున కీలక సభ్యుడైన రిచర్డ్ నీల్.. వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌కు లేఖ రాశారు. ట్రంప్ ప్రభుత్వం, ఎన్విడియా మధ్య జరిగిన వ్యవహారాలపై విచారణ చేపడుతున్నట్లు ప్రకటించారు.
మరోవైపు, చైనాకు చిప్స్ ఎగుమతులపై నియంత్రణలు ఆలస్యం కావడంపై వైట్‌హౌస్‌లోనూ చర్చ జరుగుతున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. లుట్నిక్‌ను పదవి నుంచి తొలగించే అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు.
జెన్సన్ హ్వాంగ్ను కూడా విచారించనున్నారా?
ఆలిస్ హ్వాంగ్పై ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటికీ అమెరికా కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. CNN కథనం ప్రకారం.. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, జెన్సన్ హ్వాంగ్ కీలక కాంగ్రెస్ కమిటీల ముందు రహస్యంగా వాంగ్మూలం ఇచ్చేందుకు ప్రాథమికంగా అంగీకరించారు.
ఎన్విడియా చిప్స్ చైనాకు ఎలా చేరుతున్నాయి? ఎగుమతి ఆంక్షలను అధిగమించే ప్రయత్నాలు జరిగాయా? కంపెనీకి సంబంధం ఉన్న వ్యాపార సంస్థల ద్వారా చిప్స్ ఇతర కంపెనీలకు చేరాయా? వంటి ప్రశ్నలు ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది.
అసలు స్కెచ్ ఇదేనా?
ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. AI ప్రపంచంలో ఆధిపత్యం సాధించడానికి చైనాకు కేవలం సొంతంగా అత్యాధునిక చిప్స్ తయారు చేసుకోవడమే మార్గం కాకపోవచ్చు. ఇప్పటికే ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, దాని సరఫరా వ్యవస్థలోకి ప్రవేశించడం, పెట్టుబడుల ద్వారా వ్యాపార సంబంధాలను విస్తరించడం కూడా ఒక వ్యూహంలో భాగమై ఉండొచ్చనే అనుమానాలు ఈ కేసుతో తెరపైకి వస్తున్నాయి.
ఒకవేళ ఆలిస్ హ్వాంగ్పై వస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని దర్యాప్తులో తేలితే, అది ఒక్క వ్యక్తికి సంబంధించిన గూఢచర్య వ్యవహారంగా మిగిలిపోదు. ప్రపంచంలోనే కీలకమైన AI చిప్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని, వాటి వ్యాపార నెట్‌వర్క్‌లు, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థల ద్వారా టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నాలు జరిగాయా? అన్న దిశగా ప్రపంచ దేశాలు ఆలోచించాల్సి వస్తుంది.
ఇప్పటివరకు బయటపడినది కొన్ని పెట్టుబడుల వివరాలు, వ్యాపార సంబంధాలు, వ్యక్తిగత పరిచయాలపై వచ్చిన ఆరోపణలు మాత్రమే. కానీ వాటి వెనుక నిజంగా ఒక వ్యవస్థీకృత వ్యూహం ఉందా? జెన్సన్ హ్వాంగ్‌తో ఆలిస్ హ్వాంగ్ పరిచయం కూడా అందులో భాగమేనా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ అనుమానాలన్నీ నిజమైతే, చైనా-అమెరికా AI యుద్ధంలో ఇప్పటివరకు బయటకు కనిపించని మరో కోణం వెలుగులోకి వచ్చినట్లే. ఎందుకంటే ఈ పోరులో అసలు లక్ష్యం కేవలం చిప్స్‌ను సొంతం చేసుకోవడం కాదు.. ప్రపంచ AI భవిష్యత్తును నియంత్రించే శక్తిని ఎవరు దక్కించుకుంటారన్నదే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







