విమానాలు నిలిచిపోవడానికి బైడెనే కారణమా? ట్రంప్ వ్యాఖ్యల్లో నిజమెంత?
అమెరికాలో వేలాది విమానాలు రద్దవడం, ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటం.. గత కొన్ని రోజులుగా అక్కడి విమానయాన రంగంలో ఇదే పరిస్థితి. అసలు ఒకేసారి ఇన్ని విమానాలు ఎందుకు రద్దయ్యాయి? సాంకేతికంగా ఎక్కడ సమస్య వచ్చింది? అన్న ప్రశ్నలు ఇంకా చర్చలో ఉండగానే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించారు. అయితే ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మరో కొత్త చర్చకు తెరతీశాయి. ఇంతకీ ఈ విమానాల గందరగోళం మేటర్ లోకి బైడన్ ని ఎందుకు ..ట్రంప్ తీసుకు వచ్చారు?
బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ నిందలు!
విమానాల రద్దు వ్యవహారంపై స్పందించిన ట్రంప్.. అమెరికా విమాన నియంత్రణ వ్యవస్థ ఈ స్థితికి చేరడానికి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తన ట్రూత్ సోషల్ వేదికలో ఈ విషయంపై పోస్టు పెట్టిన ఆయన, బైడెన్ హయాంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) పనితీరు పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు. అప్పటికే పాతబడిపోయిన వ్యవస్థను బాగుచేయాల్సింది పోయి, భారీగా డబ్బు ఖర్చు చేసి మరింత అధ్వానంగా మార్చారని మండిపడ్డారు.
బైడెన్ ప్రభుత్వం ఏది ముట్టుకున్నా చెడిపోయిందన్న అర్థం వచ్చేలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విమాన నియంత్రణ వ్యవస్థను మెరుగుపరచడానికి గతంలో ఖర్చు చేసిన నిధులు సరిగ్గా ఉపయోగపడలేదని ఆరోపించారు. ఈ విషయంలో అమెరికా ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. అయితే తన ప్రభుత్వం దగ్గర విమాన నియంత్రణ వ్యవస్థను ఆధునికీకరించడానికి అవసరమైన పరిజ్ఞానం, ప్రణాళిక రెండూ ఉన్నాయని, వాటిని అమలు చేయడానికి కాంగ్రెస్ వెంటనే నిధులు ఇవ్వాలని కోరారు.
ఇవి కూడా చదవండి
అసలు సమస్య ఎక్కడ వచ్చింది?
ట్రంప్ బైడెన్‌ను నిందిస్తున్నప్పటికీ, తాజా విమానాల అంతరాయానికి సంబంధించి బయటపడిన సాంకేతిక వివరాలు మరో విషయాన్ని సూచిస్తున్నాయి. అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. పాత కమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునికీకరించే పనిలో భాగంగా ఒక కాంట్రాక్టర్ పాత రాగి తీగల స్థానంలో ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేస్తున్న సమయంలో సమస్య తలెత్తింది. ఈ ప్రక్రియలో రూటర్ లేదా దాని ఇన్‌స్టాలేషన్‌లో లోపం ఏర్పడటంతో విమాన నియంత్రణ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్యలు వచ్చాయి.
విమానాల రాకపోకలను నియంత్రించే కేంద్రాలకు అవసరమైన రాడార్ సమాచారం, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటంతో FAA దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వేలాది విమానాలు ప్రభావితమయ్యాయి. విమానాలు రద్దవడంతో పాటు, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. అధికారులు సాంకేతిక సమస్యను గుర్తించి వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చినా, విమానాలు, సిబ్బంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోవడంతో సాధారణ పరిస్థితులు రావడానికి సమయం పట్టింది.
ఇక్కడ మరో మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది సైబర్ దాడి వల్ల జరిగిన ఘటన అని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొత్త టెక్నాలజీని పాత వ్యవస్థతో అనుసంధానించే క్రమంలోనే సమస్య తలెత్తినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అంటే ఆధునికీకరణ కోసం చేపట్టిన పనులే పాత వ్యవస్థపై అదనపు ఒత్తిడిని సృష్టించాయన్నది ప్రాథమిక విచారణలో కనిపిస్తున్న అంశం.
50 ఏళ్ల నాటి టెక్నాలజీతో విమానాల నియంత్రణ!
ఈ ఘటనతో అమెరికా విమాన నియంత్రణ వ్యవస్థలోని మరో బలహీనత కూడా చర్చకు వచ్చింది. ట్రంప్ చెబుతున్న ప్రకారం, ఈ వ్యవస్థలోని చాలా భాగాలు ఇప్పటికీ 50 ఏళ్ల నాటి టెక్నాలజీపై ఆధారపడి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక విమానయాన వ్యవస్థను నిర్వహిస్తున్నామని చెప్పుకునే అమెరికాలో, విమానాల రాకపోకలను నియంత్రించే కీలక పరికరాలు ఇంత పాతబడిపోవడం ఆందోళన కలిగించే విషయమే.
అయితే ఈ వ్యవస్థను ఆధునికీకరించే ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మౌలిక సదుపాయాల ప్రణాళికలో భాగంగా FAA ఆధునికీకరణ కోసం సుమారు రూ.2.36 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. ట్రంప్ ప్రభుత్వం కూడా గత ఏడాది సుమారు రూ.1.18 లక్షల కోట్ల నిధులను ఆమోదింపజేసింది. అయినప్పటికీ వ్యవస్థలో ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడు మరో రూ.4.71 లక్షల కోట్లు కావాలట!
ఈ విమానాల సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ముందు మరో భారీ ప్రతిపాదన పెట్టింది. అమెరికా విమాన నియంత్రణ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించడానికి సుమారు రూ.4.71 లక్షల కోట్లు కేటాయించాలని కోరుతోంది. ఈ నిధులతో పాతబడిపోయిన పరికరాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, కంట్రోల్ టవర్లు, విమానాశ్రయాల్లోని కీలక మౌలిక సదుపాయాలను ఆధునికీకరించాలన్నది ప్రణాళిక.
కాంగ్రెస్ ఈ నిధులను త్వరగా ఆమోదిస్తే, ప్రపంచంలోనే అత్యుత్తమ విమాన నియంత్రణ వ్యవస్థను నిర్మిస్తామని ట్రంప్ చెబుతున్నారు. చిన్నచిన్న విడతల్లో కాకుండా, మొత్తం వ్యవస్థను ఒకేసారి ఆధునికీకరించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ కూడా ఈ నిధుల అవసరాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు.
అయితే ఇక్కడే రాజకీయంగా మరో ప్రశ్న మొదలైంది. ఇప్పటికే విమానయాన వ్యవస్థ ఆధునికీకరణ కోసం భారీగా నిధులు కేటాయించినప్పుడు, ఇప్పుడు మళ్లీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు కావాలన్నది డెమోక్రాట్ల ప్రశ్న. ఇప్పటికే ఇచ్చిన నిధులను ప్రభుత్వం ఎంతవరకు ఖర్చు చేసింది? వాటితో ఏయే పనులు పూర్తయ్యాయి? కొత్తగా అడుగుతున్న డబ్బు దేనికి ఉపయోగిస్తారు? అనే వివరాలు చెప్పాలని వారు కోరుతున్నారు.
అసలు బాధ్యత ఎవరిది?
ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. విమానాల నిలిపివేతకు తక్షణ కారణంగా సాంకేతిక సమస్య బయటపడింది. కానీ అలాంటి సమస్య దేశవ్యాప్తంగా విమాన రాకపోకలను ప్రభావితం చేసేంత బలహీనంగా వ్యవస్థ ఎందుకు ఉందన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రస్తుత ప్రభుత్వం మాత్రమే కాదు.. గత ప్రభుత్వాల నిర్ణయాలు, ఖర్చులు, ఆధునికీకరణ పనుల పురోగతి కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
ట్రంప్ మాత్రం ఈ అవకాశాన్ని బైడెన్ ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తూ, కొత్తగా భారీ నిధుల కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. మరి ఈసారి ఆ నిధులు ఆమోదం పొందుతాయా? అమెరికా విమానయాన వ్యవస్థ నిజంగానే పూర్తిగా మారుతుందా? లేక వేలాది విమానాలు రద్దయిన ఈ ఘటన కూడా అమెరికా రాజకీయాల్లో మరో ఆరోపణల యుద్ధంగా మిగిలిపోతుందా? అన్నది చూడాలి.
— సూర్య ప్రకాశ్ జోశ్యుల







