ఆర్య సమాజ్ గ్రేటర్ హ్యూస్టన్ (ASGH) ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ఆర్య సమాజ్ గ్రేటర్ హ్యూస్టన్ (ASGH) ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు వాలెంటీర్లు, స్థానికులు, శ్రేయోభిలాషులు, DAV సంస్కృతి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. సత్సంగ్ హాలులో జరిగిన ఈ వేడుకలు హవనంతో ప్రారంభమయ్యాయి.
అనంతరం ఆచార్య సూర్య నంద జీ స్ఫూర్తిదాయకమైన ప్రవచనం (ప్రసంగం) చేశారు. ఆర్య సమాజ్‌కు దీపావళి పండుగ ప్రగాఢమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శరదీయ నవ-సస్యేష్టిగా జరుపుకునే ఈ పండుగ, జీవితంలోని ఆశీర్వాదాలకు మరియు శరదృతువు పంటకాలంలో ప్రకృతి ప్రసాదించే సమృద్ధికి ఈశ్వరునికి (దేవుడికి) కృతజ్ఞతలు తెలిపే సందర్భమని వివరించారు.
ఆర్య సమాజ్ స్థాపకుడైన మహర్షి స్వామి దయానంద సరస్వతి జీవితాన్ని, వారసత్వాన్ని గౌరవిస్తూ, దీపావళి పండుగను ఋషి నిర్వాణ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. సనాతన ధర్మానికి మూల గ్రంథాలైన వేదాల వైపు తిరిగి రావాలన్న ఆయన పిలుపు, మానవాళిలో ఆధ్యాత్మిక మరియు సామాజిక చైతన్యాన్ని ప్రేరేపించి, వారిని అజ్ఞానమనే చీకటి నుండి సత్యజ్ఞానం మరియు ధర్మమనే వెలుగులోకి నడిపించింది.
సూర్య నంద జీ ఉపన్యాసం తర్వాత భజనలు కూడా చేశారు. అలాగే నృత్యాలు, తబలా కచేరీలు, పోటీ విజేతల ప్రసంగాలు, విద్యార్థుల కళాకృతుల ప్రదర్శనతో పాటు రామాయణ నాటికను కూడా ప్రదర్శించారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. పురాణ పాత్రల వేషధారణలో ఉన్న చిన్నారులు, పిల్లలు, ఉపాధ్యాయులు మరియు స్వచ్ఛంద కార్యకర్తల ఉత్సాహాన్ని, అంకితభావాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.







