వృద్ధిలో భారత్ భేష్… చైనాను దాటేస్తుందన్న గోల్డ్ మన్ శాక్స్..!
భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూల పరిస్థితుల్లోనూ వేగంగా వృద్ధి చెందుతోందని అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ వెల్లడించింది. 2027 నాటికి భారత్ 7.2 శాతం జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసి, పొరుగున ఉన్న చైనా కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని తమ తాజా రీసెర్చ్ నివేదికలో స్పష్టం చేసింది. ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అగ్రగామిగా నిలవనుందని తెలిపింది.
గోల్డ్మన్ శాక్స్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 2027లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2.8 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది 2026లో అంచనా వేసిన 2.7 శాతం కంటే స్వల్పంగా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కఠిన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఇంధన ధరలు తగ్గడం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారీ పెట్టుబడులు వస్తుండటం ఆర్థిక రంగానికి ఊతమిస్తాయని నివేదిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి
ఈ క్రమంలో భారత్ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. మార్కెట్ సాధారణ అంచనా అయిన 6.8 శాతం కంటే ఇది అధికం కావడం గమనార్హం. కాగా, 2026 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును 7.9 శాతంగా అంచనా వేశారు. మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ 2027లో 4.5 శాతానికే పరిమితం కావచ్చని నివేదిక పేర్కొంది. చైనాలో రియల్ ఎస్టేట్ రంగ సమస్యలు, దేశీయ వినియోగం మందగించినప్పటికీ, ఎగుమతులు ఆ దేశానికి కొంతవరకు అండగా నిలుస్తాయని విశ్లేషించింది.
అమెరికా, జపాన్, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు మార్కెట్ అంచనాల కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేస్తాయని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ఏఐ ఎగుమతులకు అంతర్జాతీయంగా ఉన్న బలమైన డిమాండ్ కారణంగా దక్షిణ కొరియా, తైవాన్ దేశాలు బాగా లబ్ధి పొందనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో పెట్టుబడులు 2026 నాటి 1.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2027 నాటికి ఏకంగా 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని నివేదిక అంచనా వేసింది. ప్రధానంగా అమెరికాలో హార్డ్వేర్ రంగంలోనే 500 బిలియన్ డాలర్లకు పైగా వ్యయం పెరగనుంది. ఇది ప్రపంచ జీడీపీ వృద్ధికి 0.4 శాతం మేర దోహదం చేస్తుందని నిపుణులు విశ్లేషించారు.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడం ఆర్థిక కార్యకలాపాలకు కలిసిరానుంది. 2027 చివరి నాటికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 78 డాలర్లకు దిగివస్తుందని, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ధరలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయని గోల్డ్మన్ శాక్స్ కమోడిటీ నిపుణులు అంచనా వేశారు.







