టాటా గ్రూప్ లో కీలకమార్పు.. ముగిసిన నోయెట్ టాటా శకం..!
టాటా గ్రూప్ లో ఇటీవల తీవ్రమైన విభేదాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ .. రీ పోస్టింగ్ విషయంలో నోయెల్ టాటా తీవ్రంగా విభేదించారు. ఈ పరిణామం ఓ రకంగా చెప్పాలంటే టాటా గ్రూప్ ను సైతం ప్రభావితం చేసింది. అంతేకాదు… ఇది దేశ నాయకత్వం వరకూ వెళ్లింది. దీంతో ఈపరిణామంపై గ్రూప్ , అసోసియేట్ సంస్థల్లోనూ పెను చర్చ జరిగింది. అలాంటి సమయంలో గ్రూప్ లో కీలక మార్పు చోటు చేసుకుంది.
సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, టాటా కుటుంబ సభ్యుడు నోయెల్ టాటా, గ్రూపులోని పలు కంపెనీల నుంచి పదవీ విరమణ చేశారు. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (టీఐసీ) చైర్మన్, డైరెక్టర్ పదవుల నుంచి ఆయన వైదొలగడంతో 16 ఏళ్లకు పైగా సాగిన ఆయన సారథ్య శకం ముగిసింది. ఆయన సేవలకు గుర్తింపుగా కంపెనీ బోర్డు ఆయన్ను ‘చైర్మన్ ఎమెరిటస్’గా గౌరవప్రదంగా నియమించింది.
టాటా గ్రూప్ పాలనా మార్గదర్శకాల ప్రకారం.. నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లకు 70 ఏళ్లు పదవీ విరమణ వయసుగా నిర్దేశించారు. ఈ నెలలో నోయెల్ టాటా 70వ పడిలోకి అడుగుపెట్టడంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. నిన్నటితో ఆయన పదవీకాలం ముగియగా, ఆయన స్థానంలో ప్రముఖ కార్పొరేట్ న్యాయవాది, ఏజడ్బీ & పార్ట్నర్స్ సహ వ్యవస్థాపకుడు బహ్రామ్ వాకిల్ నేటి నుంచి కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. నోయెల్ టాటా నాయకత్వంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించిందని, వాటాదారులకు సుస్థిరమైన విలువను అందించిందని కంపెనీ ఒక ప్రకటనలో కొనియాడింది.
కొత్త నాయకత్వం..
కొత్త చైర్మన్‌గా నియమితులైన బహ్రామ్ వాకిల్ కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ, దివాలా చట్టాలు, ప్రాజెక్ట్ ఫైనాన్స్ వంటి రంగాల్లో నిపుణుడిగా పేరుగాంచారు. ఆయన ఇప్పటికే ఈ ఏడాది మార్చి నుంచి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వైస్-చైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఆయనతో పాటు నియోస్ట్రాట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పి వ్యవస్థాపకుడు అబిజర్ షబ్బీర్ దివాంజీని అదనపు నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఐదేళ్ల కాలానికి బోర్డు నియమించింది.
ఈ మార్పులు కేవలం టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్‌కే పరిమితం కాలేదు. నోయెల్ టాటా తన వయోపరిమితి కారణంగా ట్రెంట్, వోల్టాస్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీల చైర్మన్ పదవుల నుంచి కూడా తప్పుకున్నారు. ట్రెంట్ కొత్త చైర్మన్‌గా బహ్రామ్ వాకిల్, వోల్టాస్ సారథిగా సునీల్ డిసౌజా, టాటా ఇంటర్నేషనల్ చైర్మన్‌గా టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అయితే, గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్‌గా, టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్ టాటా కొనసాగుతారని తెలుస్తోంది.







