విశాఖలో సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన..!
విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit 2026) ప్రారంభోత్సవ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు భరోసానిచ్చే అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా కక్షపూరిత రాజకీయాల కారణంగా గత ప్రభుత్వాల ఒప్పందాలను రద్దు చేయడం, రాయితీలను నిలిపివేయడం వల్ల పెట్టుబడిదారుల్లో అభద్రతాభావం నెలకొంటోందని ఆయన పేర్కొన్నారు.
ఈ రాజకీయ అనిశ్చితికి శాశ్వతంగా ముగింపు పలుకుతూ, భవిష్యత్ ప్రభుత్వాలు సైతం ఒప్పందాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా ‘పెట్టుబడుల భద్రతా చట్టం’ (Investment Protection Act) తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ చట్టాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపుతామని తెలిపిన చంద్రబాబు, దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకు సావరిన్ గ్యారెంటీ కల్పించేలా కేంద్ర స్థాయిలోనూ ఇటువంటి చట్టం తీసుకురావాలని సదస్సులో పాల్గొన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా, పారిశ్రామిక రాయితీల చెల్లింపుల్లో జాప్యం లేకుండా ఒప్పందం కుదిరిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎస్క్రో ఖాతా ద్వారా నిధులు విడుదలయ్యే విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. 2024 జూన్ నుండి ఇప్పటివరకు రూ.22.6 లక్షల కోట్ల విలువైన 714 ఎంఓయూలు కుదుర్చుకోగా, తాజా సదస్సులో రూ.9.89 లక్షల కోట్ల విలువైన మరో 303 ఒప్పందాలు జరుగుతున్నాయని సీఎం వివరించారు. అపార అవకాశాలకు ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా మారుతోందని పేర్కొన్న చంద్రబాబు, భవిష్యత్ సాంకేతిక రంగాల్లో ఏపీ వేస్తున్న విషయాలను ప్రస్తావించారు.
విశాఖపట్నం సమీపంలో త్వరలోనే అత్యాధునిక సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని, అలాగే దేశంలోనే మొట్టమొదటి ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’కి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుందని ఆయన ప్రకటించారు. వీటితో పాటు, అమరావతి వేదికగా దక్షిణాసియాలోనే మొట్టమొదటి ‘క్వాంటం కంప్యూటర్’ను 2027 ఫిబ్రవరి నాటికి ప్రారంభించబోతున్నామని, రాబోయే రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదుగుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.







