పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు..!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగిన వేళ నామినేషన్ల స్వీకరణ కేంద్రాల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ కేంద్రాలను అధికారికంగా నోటిఫై చేయాల్సిన పూర్తి బాధ్యత కేవలం రిటర్నింగ్ అధికారి (RO)కి మాత్రమే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (MPDO) జారీ చేసే ప్రొసీడింగ్స్ తుది ఎన్నికల నోటిఫికేషన్ కాదని తేల్చి చెప్పిన హైకోర్టు, కేంద్రాల ఎంపిక విషయంలో అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది.
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలను గ్రామాల పరిధిలో కాకుండా, రాయచోటి పట్టణంలో ఒకే చోట కేంద్రీకరిస్తూ నవంబర్ 6న ఎంపీడీవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ మండవ కిరణ్మయి విచారణ జరిపారు. నామినేషన్ కేంద్రాలన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో పాటు తీవ్ర అసౌకర్యానికి గురవుతారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై విచారణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పందిస్తూ, ఒక క్లస్టర్ పరిధిలో రెండు నుంచి నాలుగు పంచాయతీలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నామని, కేంద్రాల ఎంపికలో దూరంతో పాటు శాంతిభద్రతల పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వివరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఎన్నికల నిబంధనల్లోని రూల్-6 ప్రకారం రిటర్నింగ్ అధికారి ‘ఫారం-1’ ద్వారా అధికారిక ఎన్నికల నోటీసును జారీ చేయాలని ఆదేశించింది.
ఆ నోటీసులోనే నామినేషన్ స్వీకరణ కేంద్రం ఎక్కడ ఉంటుంది, ఏ తేదీల్లో మరియు ఏ సమయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు అనే పూర్తి వివరాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. అలాగే రిటర్నింగ్ అధికారులకు సహాయంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను (ARO) నియమించుకునేందుకు అనుమతించిన హైకోర్టు, వారు తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి నియంత్రణలోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తాజా ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల ఏర్పాటుపై నెలకొన్న అస్పష్టతకు తెరపడినట్లయింది.







