అమెరికా కొత్త నిబంధనలతో అనిశ్చితి.. మిషిగన్ వర్సిటీ అభ్యంతరం..!
అమెరికాకు అక్రమ వలసలను తగ్గించాలన్న లక్ష్యంతో ట్రంప్ సర్కార్ తెస్తున్న నూతన నిబంధనలు.. అభ్యర్థులకు తలనొప్పులు తెస్తున్నాయి. మరికొందరికి వీసా రాకుండా పోయే ప్రమాదం చోటు చేసుకుంటోంది.దీనితో స్థానిక సంస్థలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై స్థానికంగా ఉన్న సంస్థలు, కంపెనీలు, వర్సిటీల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. అయితే ట్రంప్ సర్కార్ వాటిని పట్టించుకోవడం లేదు.
అమెరికాలో ఉద్యోగ ఆధారిత వీసాల పొడిగింపు ప్రక్రియను మరింత సంక్లిష్టం చేసేలా అక్కడి ప్రభుత్వం ప్రతిపాదించిన నిబంధనల మార్పుపై మిషిగన్ యూనివర్సిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మార్పు వల్ల దరఖాస్తుదారులలో అనవసరమైన అనిశ్చితి పెరిగి, వారిపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)ని కోరింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఒకే యజమాని, ఒకే ఉద్యోగికి సంబంధించిన వీసా పొడిగింపు దరఖాస్తును పరిశీలించేటప్పుడు, గతంలో ఇచ్చిన ఆమోదాన్నే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అధికారులు ప్రామాణికంగా తీసుకుంటారు. పాత దరఖాస్తులోని వాస్తవాలు, పరిస్థితులలో ఎలాంటి మార్పు లేనంత వరకు ఈ వెసులుబాటు ఉంటుంది.
అయితే, అక్టోబర్ 14న డీహెచ్ఎస్ ప్రతిపాదించిన కొత్త మార్పు ప్రకారం, ఈ ‘వెసులుబాటు’ను తొలగించాలని చూస్తున్నారు. దీనివల్ల ప్రతి పొడిగింపు దరఖాస్తును అధికారులు మొదటి నుంచి కొత్తగా సమీక్షించే అవకాశం ఉంటుంది. గతంలో ఆమోదం తెలిపినప్పటికీ, ఇప్పుడు భిన్నమైన నిర్ణయం తీసుకోవచ్చు.
మిచిగన్ యూనివర్సిటీ అభ్యంతరాలు
ఈ మార్పు వల్ల వీసా పొడిగింపు కోసం ఎదురుచూస్తున్న వారిలో తీవ్ర గందరగోళం, అనిశ్చితి నెలకొంటాయని మిషిగన్ యూనివర్సిటీ ఆందోళన వ్యక్తం చేసింది. యూఎస్సీఐఎస్ అధికారులు గత నిర్ణయానికి ఎందుకు కట్టుబడలేదో వివరించాల్సిన అవసరం లేకుండానే దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
దీనివల్ల దరఖాస్తుదారులపై, యజమానులపై పరిపాలనా భారం పెరుగుతుందని తన అభిప్రాయాన్ని రాతపూర్వకంగా తెలియజేసింది. దరఖాస్తుల పూర్తిస్థాయి సమీక్షకు తాము వ్యతిరేకం కాదని, అయితే పొరపాటున ఆమోదం పొందిన దరఖాస్తులను సరిదిద్దే అధికారం యూఎస్సీఐఎస్కు ఇప్పటికే ఉందని, అందువల్ల ఈ కొత్త నిబంధన అనవసరమని స్పష్టం చేసింది.
మరోవైపు ప్రతి దరఖాస్తుదారుడు ప్రతీసారి తమ అర్హతను నిరూపించుకోవాలనే నిబంధనను బలోపేతం చేయడానికే ఈ మార్పు అని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాదిస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే హెచ్-1బీ, ఎల్-1, ఓ-1, ఈ-3, టీఎన్ వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాలపై ఉన్నవారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది.







