డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం కీలక అడుగు..!
దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన డీలిమిటేషన్(Delimitation) బిల్లు, 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఇప్పటికీ రాష్ట్రపతి అధికారికంగా ముగించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. వర్షాకాల సమావేశాలు ఇంకా ప్రొరోగ్ కానందున, కొత్త సమావేశాల కోసం 14 రోజుల గడువు అవసరం లేకుండా కేవలం 48 గంటల ముందుగా ఎంపీలకు సమాచారం ఇచ్చి ప్రత్యేక భేటీని నిర్వహించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకేతాలు ఇచ్చారు.
సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన రెండు నుండి నాలుగు రోజుల్లోనే రాష్ట్రపతి సభను ప్రొరోగ్ చేస్తారు. కానీ, ఈసారి వర్షాకాల సమావేశాలు వాయిదా పడి 90 రోజులకు చేరువవుతున్నా సభను అధికారికంగా ముగించకపోవడంతో 2008 నాటి 87 రోజుల రికార్డు సైతం బద్దలైంది. గత ఏప్రిల్ 17న జరిగిన ప్రత్యేక సమావేశంలో లోక్‌సభ స్థానాలను 543 నుండి 850 వరకు పెంచేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో అది వీగిపోయింది.
ఈ నేపథ్యంలో, ఈసారి పక్కా సంఖ్యాబలాన్ని కూడగట్టుకుని, ఎప్పుడైనా సరే 48 గంటల షార్ట్ నోటీసుతో సభను సమావేశపరిచి బిల్లును గట్టెక్కించాలని కేంద్రం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన రెండు మూడొంతుల మెజారిటీని అడ్డదారిలో కూడగట్టుకునేందుకు అమిత్ షాకు సమయం ఇవ్వడానికే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్‌ను ప్రొరోగ్ చేయకుండా జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి(Narendra Modi) నాలుగుసార్లు లేఖలు రాసినా స్పందన లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లోనే ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.







