ఉత్తరకొరియా కాబోయే అధ్యక్షురాలు కిమ్ జు-ఏ..!
నియంతృత్వ దేశం ఉత్తరకొరియాలో పాలనపగ్గాలు మారనున్నాయా.. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఆదిశగా అడుగులు వేస్తున్నారా.. మరీ ముఖ్యంగా తన కూతురు 13 ఏళ్ల కిమ్ జు-ఏను భావి అధినేతగా తయారు చేస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులు! వారితో పాటు దక్షిణ కొరియా నిఘా వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం.. కిమ్ తన కుమార్తె కిమ్ జు-ఏ (13)ను నాలుగేళ్లుగా క్షిపణి పరీక్షలు, సైనిక కవాతులకు వెంటబెట్టుకుని వెళ్తున్నారు. ఇది భావి నాయకురాలిగా ఆమెను తీర్చిదిద్దే వ్యూహంలో భాగమేనట. 1948లో ఏర్పడిన ఉత్తర కొరియాలో ఇప్పటివరకూ మూడు తరాలుగా కిమ్ కుటుంబమే నియంతృత్వ పాలన సాగిస్తోంది.
ప్రస్తుతం కిమ్ జు-ఏకు ఇస్తున్న ప్రొటోకాల్‌ను చూస్తుంటే.. కిమ్ వారసురాలిగా ఆమెకు అధికారిక ముద్ర పడినట్లేనని ఉత్తర కొరియా మాజీ దౌత్యవేత్త తే యోంగ్-హో తెలిపారు. గతంలో కిమ్ జోంగ్ ఉన్ను వారసుడిగా ప్రకటించినప్పుడు ఇలాంటి గౌరవ మర్యాదలే ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అధికార వర్కర్స్ పార్టీలోని 17 విభాగాల్లో ఒకే ఒక్క మహిళ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె- కిమ్ సోదరి కిమ్ యో జోంగ్.
ఉత్తరకొరియా పూర్తిగా పురుషాధిక్య సమాజం ఉన్న దేశం. అక్కడ ఓ స్త్రీని అత్యున్నత పదవిలో ఉండడాన్ని ఎవరూ అంగీకరించే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉత్తరకొరియాలో కొందరికి ఈ పరిణామాలు మింగుడుపడడం లేదంటున్నారు. అయితే .. ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబాన్ని.. మనుషులను ఏలే దేవుళ్లుగా భావిస్తారని, కాబట్టి అక్కడ లింగ భేదం పెద్ద సమస్య కాదని మరికొందరు విశ్లేషిస్తున్నారు.







