తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…7 లక్షల మందికి ప్రయోజనం
ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులు తనఖా పెట్టిన పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు వెనక్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వ సబ్సిడీ, లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం (Bank loan) ద్వారా నిధులు సమకూర్చేవారు. రుణాల కోసం లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను తనఖా పెట్టేవారు. రుణ వాయిదాలన్నీ చెల్లించిన తర్వాత పట్టాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ కారణాలతో లక్షలాది మంది లబ్ధిదారుల పట్టాలు, పోజిషన్ సర్టిఫికెట్లు తహసీల్దారు కార్యాలయాల్లోనే (Tahsildar Office) ఉన్నాయి. ఇటీవల 22ఏ వివాదానికి సంబంధించిన సమీక్ష జరిగినప్పుడు తహసీల్దారు కార్యాలయాల్లో ఉన్న పట్టాల విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను వెంటనే లబ్ధిదారులకు తిరిగి ఇచ్చేయాలని కలెక్టర్ల (Collectors)ను మంత్రి పొంగులేటి ఆదేశించారు.







