ఇటలీనేత నోట ఓట్ చోర్ గద్దీ చోడ్ కామెంట్స్.. స్వదేశంలో విమర్శలు..!
హైదరాబాద్ లో జరిగిన భారత్ సమ్మిట్ లో ఇటలీ నేత చేసిన కామెంట్స్.. వివాదాస్పదమయ్యాయి. ఇటలీ వామపక్ష పీఈసీ నేత జియాకోమో ఫిల్బెక్ (Giacomo Filibeck) .. ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ అని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఓ దేశానికి చెందిన నేత.. మరోదేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం విమర్శలకు దారి తీసింది.
తమ దేశ నేత వ్యాఖ్యలను ఇటలీ అధికార పక్ష నాయకురాలు డెబోరా బెర్గామిని ఖండించారు. 97కోట్ల మంది పౌరులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్న దేశానికి (భారత్కు).. ప్రజాస్వామ్యంపై ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం లేదని చురకలంటించారు. భారత్లో ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఆ దేశానికి సొంత ప్రజాస్వామ్య సంస్థలు, న్యాయవ్యవస్థ ఉన్నాయని పేర్కొన్నారు.
‘‘ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ తమ వాదనలు వినిపించే స్వేచ్ఛ ఉంటుంది. అయితే, ఈ క్రమంలో చేసే ఆరోపణలకు వారు తగిన ఆధారాలు చూపించగలగాలి. ఇక, ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం అనుచితం. అదీనూ మిత్రదేశాల విషయంలో ఈ విధంగా చేయడం సరైన చర్య కాదు’ అని డెబోరా బెర్గామిని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు, ఇటలీ వామపక్ష పీఈసీ నాయకుడు జియాకోమో ఫిల్బెక్ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ-వీసా పోర్టల్ ద్వారా పొందిన కాన్ఫరెన్స్ వీసాపై భారత్కు వచ్చిన విదేశీ పౌరులకు ఇక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశాయి. ఇది వీసా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నాయి. ఇక, ఫిల్బెక్ వ్యాఖ్యలను కేంద్రమంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు తప్పుబట్టారు. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ రాజకీయ నాయకులు జోక్యం చేసుకొనేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రోత్సహిస్తున్నారని కేంద్రమంత్రులు మండిపడ్డారు.







