గౌతమ్ గంభీర్ చెప్పిందే నిజం: రవిశాస్త్రి
న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకున్నప్పటికీ, భారత బ్యాటింగ్ విభాగం ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) వ్యక్తం చేసిన అభిప్రాయాలతో మాజీ కోచ్ రవిశాస్త్రి పూర్తిగా ఏకీభవించారు. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు(World Cup) ముందు, స్వింగ్, సీమ్ పిచ్‌లపై భారత బ్యాటర్లు తడబడటం పెద్ద సమస్యగా మారిందని రవిశాస్త్రి స్పష్టం చేశారు.
మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో కివీస్ పేసర్ల ధాటికి భారత జట్టు కేవలం 89 పరుగులకే కుప్పకూలగా, ఐదో వన్డేలోనూ 209 పరుగులకే పరిమితమైంది. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో చివరి మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. నాలుగో వన్డే తర్వాత గంభీర్ మాట్లాడుతూ, న్యూజిలాండ్ పరిస్థితులు దాదాపు దక్షిణాఫ్రికా పిచ్‌లను పోలి ఉంటాయని, అలాంటి చోట 26 ఓవర్లలోనే ఆలౌట్ కావడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
తాజాగా ఐదో వన్డే ముగిసిన తర్వాత రవిశాస్త్రి మాట్లాడుతూ, గౌతమ్ గంభీర్ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమని అన్నారు. దక్షిణాఫ్రికాలో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పుడే సిద్ధం కావాల్సిన అవసరం ఉందని, కఠినమైన పిచ్‌లపై క్రీజులో నిలదొక్కుకునే పట్టుదలను బ్యాటర్లు అలవర్చుకోవాలని సూచించారు. అన్ని వేళలా 300 లేదా 320 పరుగుల భారీ స్కోర్ల కోసమే చూడకుండా, బౌలింగ్‌కు అనుకూలించే వికెట్లపై 260 నుంచి 270 పరుగులు చేసినా అవే మ్యాచ్ విన్నింగ్ స్కోర్లు అవుతాయని రవిశాస్త్రి విశ్లేషించారు.







