రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రేపు దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజు పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఇటీవల పెను బీభత్సం సృష్టించిన ‘మురసు’ తుపాను బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఆర్థిక సాయం కోరడమే ప్రధాన అజెండాగా ఆయన ఈ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో(Narendra Modi) ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించనున్నారు.
‘అర్నబ్’ తుపాను సహాయక చర్యలు కొనసాగుతుండగానే విరుచుకుపడిన ‘మురసు’ తుపాను వల్ల రాష్ట్రానికి అక్షరాలా రూ.2,484.43 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ముఖ్యంగా ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో దాదాపు 1.93 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1.86 లక్షల మంది రైతులకు చెందిన 1.43 లక్షల హెక్టార్లలో సాధారణ పంటలు, 6,756 హెక్టార్లలో ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇవి కూడా చదవండి
వీటితో పాటు 1,385 కిలోమీటర్ల మేర రోడ్లు, 3,859 ఇళ్లు దెబ్బతిన్నాయి. శాఖల వారీగా చూస్తే ఆర్అండ్బీకి రూ.889 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.875 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.337 కోట్లు, జలవనరుల శాఖకు రూ.136 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.119 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.54 కోట్ల నష్టం వాటిల్లింది. ఇటీవలే కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని పరిశీలించింది.
ఈ నేపథ్యంలో, తక్షణ సహాయక చర్యలతో పాటు తీర ప్రాంత మౌలిక సదుపాయాలను శాశ్వతంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి సమగ్ర నివేదిక అందజేయనున్నారు. తుపాను సాయంతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వివిధ పథకాల బకాయిలు, పోలవరం సహా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టుల నిధుల విడుదలపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు. అలాగే, కేంద్ర హోంశాఖ, ఆర్థిక, జలశక్తి, రోడ్డు రవాణా శాఖల కేంద్ర మంత్రులతో కూడా ఆయన వరుసగా భేటీ కానున్నారు. రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి, వరుస సమావేశాలు ముగించుకుని రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు.







