ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి జై షా ఏకగ్రీవం..!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (icc) ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఆయన పేరును ప్రతిపాదించగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గతంలో 2024లో తొలిసారి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, అతి పిన్న వయసులో ఆ పదవిని అధిష్ఠించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
జై షా(jai Shah) నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణ, వాణిజ్యపరమైన అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొంటూ ఐసీసీ బోర్డు ఆయనపై మరోసారి పూర్తి విశ్వాసం ప్రకటించింది. తన పునర్నియామకంపై జై షా హర్షం వ్యక్తం చేస్తూ ఐసీసీ బోర్డు డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ క్రికెట్ ఇప్పుడు అత్యంత కీలక దశలో ఉందని, ముఖ్యంగా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి ప్రవేశపెట్టడం ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఒలింపిక్స్ వేదిక ద్వారా కొత్త దేశాలకు, కొత్త తరం ప్రేక్షకులకు క్రికెట్‌ను మరింత చేరువ చేస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
సభ్య దేశాలన్నింటినీ కలుపుకుని వెళ్తూ, మహిళల క్రికెట్ అభివృద్ధికి, క్రీడ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేందుకు కృషి చేస్తానని జై షా వెల్లడించారు. ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ తవెంగ్వా ముకుహ్లాని, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ సహా పలువురు బోర్డు ప్రతినిధులు జై షా నాయకత్వాన్ని అభినందించారు. 2027 వన్డే ప్రపంచకప్, 2028 ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్ల నిర్వహణ సమయంలో జై షా అనుభవం ఐసీసీకి ఎంతో ఉపయోగపడుతుందని బోర్డు అభిప్రాయపడింది.







