సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిబిఐ స్పీడ్..!
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (cbi) దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు గత నెలలో ఈ కేసును స్వీకరించిన సీబీఐ అధికారులు, అదనపు ఎస్పీ నేతృత్వంలో వరుసగా పది రోజుల పాటు విజయవాడలోనే మకాం వేసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి వెళ్లి ఆమె వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి సిబ్బందిని ప్రశ్నించారు.
పది రోజుల పాటు సాగిన ఈ విచారణలో సీబీఐ అధికారులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న గులివిందల సురేష్ (ఏ4), హోంగార్డు వెంకటరాజు (ఏ7) ఇళ్లలో కోర్టు అనుమతితో సోదాలు నిర్వహించి, వారిని విచారించారు. అంతేకాకుండా, మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ రెండో అంతస్తులో జరిగిన విచారణ, ఆ తర్వాత మృతదేహాన్ని స్వర్గపురి శ్మశానవాటికకు తరలించి దహనం చేసిన ఘటనల వరకు ప్రతి అంశాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. శ్మశానవాటిక సిబ్బందిని కూడా ప్రశ్నించి కీలక ఆధారాలను సేకరించారు.
ఇవి కూడా చదవండి
తాజాగా ఈ కేసులో మరోసారి విచారణ చేపట్టిన సీబీఐ బృందం, మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తూ దర్యాప్తును కొలిక్కి తీసుకువస్తోంది. ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లతో కూడిన ప్రాథమిక విచారణ నివేదికను త్వరలోనే విజయవాడ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నివేదిక కోర్టుకు చేరితే కేసులో మరికొందరు అధికారుల పాత్ర బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.







