కాంగ్రెస్ కొత్త సారథి ముందు సవాలక్ష సవాళ్లు!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఏఐసీసీ కార్యదర్శి బి.ఎం.సందీప్ నియమించింది హైకమాండ్. ఉన్నత చదువుల కోసం మీనాక్షి నటరాజన్ సెప్టెంబర్‌లో లండన్ వెళ్లడంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని సందీప్ తో భర్తీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు మాణిక్కం ఠాకూర్, దీపా దాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ తర్వాత ఈ పదవిని అధిష్టించిన నాలుగో నేత సందీప్. అయితే, అధికార పార్టీకి ఇన్‌ఛార్జ్‌గా రావడం ఎంత ప్రతిష్టాత్మకమో, అంతకుమించి కత్తిమీద సాము లాంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొంది.
సందీప్ ముందున్న అతిపెద్ద సవాలు పార్టీలోని అంతర్గత విభేదాలను చక్కదిద్దడం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మధ్య సమన్వయ లోపం బహిరంగ విమర్శలకు దారితీస్తోంది. నియోజకవర్గ స్థాయిలో సీనియర్ నేతల మధ్య వర్గపోరు ముదిరి కార్యకర్తలు విడిపోయే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతోందంటూ కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలే సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ‘భారత్ సమ్మిట్’ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో భేటీ అయిన రాహుల్ గాంధీ సైతం రాష్ట్ర పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా కొలిక్కి రాలేదు. టీపీసీసీ కార్యవర్గంలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ ఛైర్మన్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ వంటి పదవుల కోసం నేతలు రెండేళ్లకు పైగా ఎదురుచూస్తున్నారు. గత ముగ్గురు ఇన్‌ఛార్జ్‌ల హయాంలో జాబితాలు సిద్ధం చేయడం, ఆ తర్వాత అవి పెండింగ్‌లో పడటం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ రాకతో మళ్లీ మొదటి నుంచి కసరత్తు మొదలవుతుందేమోనని ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. అయితే మీనాక్షి నటరాజన్ హయాంలో ఖరారైన జాబితా ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భరోసా ఇస్తున్నాయి.
మరోవైపు రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మూడు బెర్తుల కోసం సుమారు డజను మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీ కూడా పెండింగ్‌లో ఉంది. దీనికి తోడు గవర్నర్ కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. మంత్రివర్గ విస్తరణ కంటే ముందే ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సిన బాధ్యత అధిష్టానం, రాష్ట్ర నాయకత్వంపై ఉంది.
కర్ణాటకకు చెందిన సందీప్‌కు ఏఐసీసీలో పనిచేసిన అపార అనుభవం ఉంది. గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఉన్న సత్సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశాలు. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా నిలవడం ఆయన ప్రధాన కర్తవ్యం. నేరుగా అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న ఉద్దండులైన తెలంగాణ నేతలను సమన్వయం చేస్తూ, కేవలం ఐక్యతా మంత్రం జపించడమే కాకుండా క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంలో సందీప్ ఎంతవరకు సఫలమవుతారనే దానిపైనే తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.







