మోడీ ఆదేశాలతోనే నా ఫోన్ ట్యాపింగ్.. రాహుల్ సంచలన ఆరోపణలు..!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ అవుతోందా.. అవుననే అంటున్నారు రాహుల్. అంతేకాదు.. తన ఫోన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో ట్యాప్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. విదేశీ శక్తుల సాయంతో దేశంలో అరాచకం సృష్టించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన ఈ వ్యాఖ్యలతో బదులిచ్చారు. తన ఫోన్లోనే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.
ప్రధాని మోడీతో ముఖాముఖి చర్చకు రావాలన్న సవాలును రాహుల్ మరోసారి పునరుద్ఘాటించారు. ఆ చర్చకు మోడీ వస్తే ఎవరు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారు? ఎవరు దేశ వ్యతిరేకి? అన్న విషయాలు బయటపడతాయని అన్నారు. చర్చ జరిగితే ప్రధాని రాజకీయ జీవితం ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. తాను ప్రసంగాల రూపంలో సాగే చర్చను కోరుకోవడం లేదని, ఇద్దరి మధ్య నేరుగా చర్చ జరగాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
పార్లమెంటులో చర్చకు ప్రయత్నించినా తన మైక్ నిలిపివేస్తున్నారని, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని రాహుల్ ఆరోపించారు. రైతు చట్టాలు, ఓట్ల చోరీ, ఎస్ఐఆర్, చైనా తదితర అంశాలపై తనకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చర్చకు రావాలంటూ చేసిన సవాలుపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ-ఎన్సీఆర్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని తన ఏసీ గది నుంచి బయటకు వచ్చి సామాన్యులు పీల్చే గాలిని పీల్చాలని రాహుల్ అన్నారు. తనపై మోడీ గతంలో మాదిరిగా విమర్శలు చేయడం లేదని, ఆచితూచి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దీనికి కారణం ఆయన మనసులో ఉన్న భయమేనని రాహుల్ వ్యాఖ్యానించారు.







